Published : 30/11/2021 05:48 IST

ఆహార ధాన్యాల సేకరణపై జాతీయ విధానం తీసుకురావాలి

పార్లమెంట్‌ లోపల, బయట తెరాస ఎంపీల ఆందోళన

ధాన్యం కొనుగోలుపైౖ  పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న తెరాస ఎంపీలు నామా నాగేశ్వరరావు, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్‌నేత, బీబీపాటిల్‌, బండా ప్రకాశ్‌, సురేశ్‌రెడ్డి, రాములు, కె.కేశవరావు, రంజిత్‌రెడ్డి, సంతోష్‌కుమార్‌

ఈనాడు, దిల్లీ: ధాన్యం కొనుగోళ్లకు వార్షిక లక్ష్యం విధించాలని, జాతీయ ఆహార ధాన్యాల సేకరణ విధానం తీసుకురావాలని తెరాస ఎంపీలు నినదించారు. ధాన్యం కొనుగోళ్లకు ఒకే దేశం- ఒకే విధానం ప్రకటించాలని కోరారు. ఏడాదికి ఎంత మొత్తం కొనుగోలు చేస్తామో ఒకసారి ప్రకటిస్తే అందుకు అనుగుణంగా రాష్ట్రాలు తమ వ్యవసాయ ప్రణాళిక రూపొందించుకుంటాయని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ తెరాస ఎంపీలు ఆకుపచ్చ కండువాలు ధరించి లోక్‌సభ, రాజ్యసభ, పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులో సోమవారం ప్లకార్డులు చేతపట్టి నిరసన తెలిపారు. ఉభయసభల వాయిదా తర్వాత పార్లమెంట్‌ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద.., తెలంగాణ భవన్‌లో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అనంతరం ఎంపీలతో కలసి తెరాస పార్లమెంటరీ పార్టీనేత కె.కేశవరావు విలేకరులతో మాట్లాడారు.

కేంద్రం వివక్ష చూపుతోంది
‘‘ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్రంలో దుర్భర పరిస్థితి నెలకొంది. ఎంత సేకరించాలో చెప్పిన కేంద్రం ఇప్పుడు దానిని ఒప్పందం అంటోంది. తెలంగాణలో వేడి కారణంగా యాసంగి పంటలో బియ్యం విరుగుతాయి. అందుకే ఉప్పుడు బియ్యం వస్తాయి. రైతు బంధు, నీటివసతి, ఉచిత విద్యుత్తు సరఫరా వంటి కార్యక్రమాలతో తెలంగాణలో పంట ఉత్పత్తి బాగా పెరిగింది. ఈ వానాకాలంలో 1.2 కోట్ల టన్నుల ధాన్యం పండింది. ప్రతి గింజను కేంద్రమే కొనుగోలు చేయాలి. తెలంగాణ నుంచి ధాన్యం కొనని కేంద్రం.. పంజాబ్‌నుంచి కొనుగోలు చేస్తూ తెలంగాణ పట్ల వివక్ష చూపుతోంది. పంట మార్పిడికి కనీసం రెండేళ్ల సమయం అవసరం’’ అని కేకే అన్నారు.

చర్చకు నిరాకరించడంతోనే ఆందోళన: నామా
‘‘ధాన్యం కొనుగోళ్లపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని సభాపతి తిరస్కరించారు. మూడు సాగుచట్టాల రద్దు బిల్లుపై చర్చకు అవకాశమిస్తే ఈ సమస్యను లేవనెత్తుదామని భావించినా అదీ చేయలేదు. అందుకే ఆందోళన చేశాం. ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్‌, మంత్రులు, ఎంపీలు కేంద్రంతో చర్చలు జరుపుతుంటే పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత తేవాలి. తెలంగాణ ఎంపీలంతా ఉభయ సభల్లో కలిసి పోరాడాలి. సభలో ఆందోళనకు కలసి రాకుంటే రానున్న కాలంలో మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉండదు’’ అని కాంగ్రెస్‌, భాజపా ఎంపీలనుద్దేశించి వ్యాఖ్యానించారు. కార్యక్రమాల్లో లోక్‌సభ సభ్యులు రంజిత్‌రెడ్డి, వెంకటేశ్‌ నేత, శ్రీనివాస్‌రెడ్డి, రాములు, బి.బి.పాటిల్‌, రాజ్యసభ సభ్యులు బండా ప్రకాశ్‌, సురేశ్‌రెడ్డి, జోగినపల్లి సంతోష్‌కుమార్‌ పాల్గొన్నారు.

సంజయ్‌ మెడలో కండువా వేసిన తెరాస ఎంపీ
ఉభయ సభల్లో, వెలుపల తెరాస ఎంపీలు ‘రైతులను శిక్షించొద్దు’ ‘రాష్ట్రాల మధ్య వివక్ష చూపొద్దు’, ‘జాతీయ ఆహారధాన్యాల సేకరణ విధానం ప్రకటించాలి’, ‘సేకరణలో ఏకరూపత పాటించాలి’ తదితర ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సమయంలో భాజపా ఎంపీలు బండి సంజయ్‌, సోయం బాపురావు తెరాస ఎంపీల వద్దకు వచ్చి గతంలో కేసీఆర్‌.. కేంద్రానికి అనుకూలంగా మాట్లాడిన అంశాలపై పత్రాలను ప్రదర్శించారు. వెంటనే స్పందించిన నామా నాగేశ్వరరావు.. సంజయ్‌ మెడలో ఆకుపచ్చ కండువా వేసి రైతుల పక్షాన మాట్లాడాలన్నారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని