ప్రభుత్వ వర్సిటీల్లోనూ చదువుకొనాల్సిందే!

ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కూడా ప్రైవేటు కళాశాలలు, వర్సిటీల మాదిరిగా అధిక ఫీజుల వసూళ్లకు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు పెంచుకోవడానికి అనుమతించడంతో..రెగ్యులర్‌ కోర్సుల్లోని సీట్లను కూడా సెల్ఫ్‌ ఫైనాన్స్‌గా మార్చి విద్యార్థుల నుంచి వీలున్నంత పిండుకునేందుకు సిద్ధమయ్యాయి.

Updated : 01 Dec 2021 03:02 IST

 సాధారణ సీట్లను సెల్ఫ్‌ఫైనాన్స్‌గా మార్చి ఫీజుల దోపిడీ
 జేఎన్‌టీయూహెచ్‌ ఎంటెక్‌లో 63 శాతం అవే
బోధనా రుసుములు వచ్చినా..విద్యార్థులపై తప్పనిభారం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కూడా ప్రైవేటు కళాశాలలు, వర్సిటీల మాదిరిగా అధిక ఫీజుల వసూళ్లకు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు పెంచుకోవడానికి అనుమతించడంతో..రెగ్యులర్‌ కోర్సుల్లోని సీట్లను కూడా సెల్ఫ్‌ ఫైనాన్స్‌గా మార్చి విద్యార్థుల నుంచి వీలున్నంత పిండుకునేందుకు సిద్ధమయ్యాయి.

జేఎన్‌టీయూహెచ్‌లో 63 శాతం...ఓయూలో 36 శాతం
జేఎన్‌టీయూహెచ్‌లో మొత్తం 558 సీట్లు ఉన్నాయి. అందులో 63 శాతం (351) సీట్లు సెల్ఫ్‌ ఫైనాన్స్‌, స్పాన్సర్డ్‌ సీట్లే ఉన్నాయి. రెగ్యులర్‌, రెగ్యులర్‌-1, సెల్ఫ్‌ ఫైనాన్స్‌, స్పాన్సర్డ్‌(సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విత్‌ నో స్కాలర్‌షిప్‌) పేరిట సీట్లను నాలుగు రకాలుగా విభజించిన జేఎన్‌టీయూహెచ్‌ ఒక్కో దానికి ఒక్కో ఫీజును నిర్ణయించింది. రెగ్యులర్‌ సీటన్లు విభజించి, ఫీజు పెంచి దాన్ని రెగ్యులర్‌-1 విభాగం కిందికి తెచ్చింది. వాటిలో కొన్నింటిని విభజించి ఉపకార వేతనం రాని సీట్లుగా మార్చింది. ఇలా రకరకాలుగా విడగొట్టడం ద్వారా వర్సిటీపై ఆర్థికభారం లేకుండా చేసుకోవడంతోపాటు కోర్సుకు సంబంధించిన వేతనాలు, నిర్వహణ తదితర అన్ని ఖర్చులను విద్యార్థుల నుంచే రాబట్టాలనే ప్రణాళికను యూనివర్సిటీలు అమలుచేస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఓయూలో మొత్తం 463 సీట్లుంటే 166 (36 శాతం) సీట్లు సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విభాగంలో ఉన్నాయి. జేఎన్‌టీయూహెచ్‌లో ఎంటెక్‌ కోర్సుకు వార్షిక రుసుం రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంది. ఓయూలో మాత్రం అది రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంది. అంటే ఓయూలో గరిష్ఠ రుసుం కంటే జేఎన్‌టీయూహెచ్‌లో ప్రారంభ రుసుం రూ.10 వేలు అధికంగా ఉండటం గమనార్హం. ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీలకు కోర్సు ఫీజు ఎంత ఉన్నా, ఆ మొత్తాన్ని ప్రభుత్వం బోధనా రుసుముగా చెల్లిస్తుంది. ఇతర అర్హులకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌ కింద రూ.57 వేలు మాత్రమే ఇస్తుంది. అంటే మిగిలిన మొత్తాన్ని విద్యార్థులే చెల్లించాలి. ఇది పేద విద్యార్థులకు భారంగా పరిణమిస్తుందని, వారిని ఉన్నత విద్యకు దూరం చేస్తుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని