Published : 01/12/2021 06:07 IST

ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్‌తో చర్చకు సై

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ : ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నానని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని అమరవీరుల స్తూపం వద్ద  సీనియర్‌ పాత్రికేయుల సమక్షంలో ముఖ్యమంత్రి కోరినట్లు చర్చలకు సిద్ధమేనన్నారు. నాగరిక భాషలో మాట్లాడతాననే షరతుకు కేసీఆర్‌ అంగీకరిస్తే తను చర్చకు వస్తానని స్పష్టం చేశారు. అసభ్య పదజాల వినియోగంలో కేసీఆర్‌తో గెలవలేనందున ఆ విషయంలో ముందే ఓటమి ఒప్పుకొంటున్నానన్నారు. దిల్లీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు నెలలుగా కల్లాల్లో, రోడ్లపై ధాన్యం కుప్పలతో బాధపడుతున్న రైతులకు ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేశానని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తో మాట్లాడాకే చివరి బస్తా వరకు కొంటామని చెప్పానన్నారు.యాసంగి పంట అంశం తర్వాత.. ముందు వానాకాలం పంట కొనుగోలు చేయాలని సూచించారు.  హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తర్వాత ముఖ్యమంత్రి అభద్రతా భావంతో ఉన్నందునే గంటన్నర పాటు తిట్లపురాణం  కొనసాగించారని ఎద్దేవా చేశారు. సీఎం పదవిని ఎడమ కాలి చెప్పుతో పోల్చిన వ్యక్తి అంతకన్నా గొప్పగా ఎలా మాట్లాడుతారన్నారు. తాను కేంద్రమంత్రి అయినందుకు కేసీఆర్‌ బాధ పడితే తానేం చేయలేనన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విత్తనాలు మార్చుకున్నారని, అలానే విత్తనాలు మార్చుకుంటే యాసంగి పంట వేయొచ్చన్నారు.

కేసీఆర్‌ కనీసం అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు..
‘‘నేను కేంద్ర మంత్రి కావడం కేసీఆర్‌కు ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు. ఒక రైతు బిడ్డ, సాధారణ కార్యకర్త, పార్టీ ఫిరాయించని వ్యక్తి ఎలా క్యాబినెట్‌ మంత్రి అవుతారని కేసీఆర్‌ భావిస్తున్నారో తెలియదు. కేంద్రమంత్రి అయిన తర్వాత అపాయింట్‌మెంట్‌ అడిగితే కేసీఆర్‌ ఇవ్వలేదు. ఫోన్లు చేసినా స్పందించలేదు. కలుస్తానన్నా పట్టించుకోలేదు. కేంద్రమంత్రిగా దిల్లీలో ఉన్న తెలంగాణ బిడ్డ సహకారం తీసుకుందామని రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజూ అనుకోలేదు. ఉన్నతాధికారులూ నన్ను కలవలేదు. ఎంతో చిన్నచూపు చూశారు. అయినా రాష్ట్రాభివృద్ధికి కేంద్ర నుంచి రావాల్సిన వాటి కోసం పాటుపడుతున్నా. 40 ఏళ్లుగా నమ్మిన సిద్ధాంతాల కోసం పని చేస్తున్నా. తెలంగాణ కోసం పోరాడి జాతీయ నాయకత్వాన్ని ఒప్పించా. ఎన్నో ఉద్యమాలు చేసి పైకి వచ్చా. కేంద్రమంత్రి పదవి శాశ్వతం కాదు. నమ్ముకున్న పార్టీ జెండా, తెలంగాణ ప్రజలే నాకు ముఖ్యం. కేసీఆర్‌ పుట్టిన గడ్డపైనే పుట్టిన నేను ఆయన తిట్లకు భయపడే వ్యక్తిని కాదు. ఆయన వ్యాఖ్యలపై నాకేం బాధ లేదు. ఎవరు ఏమిటో ప్రజలు నిర్ణయిస్తారు. ఇలాంటి భాషతో తెలంగాణ ప్రజలకు, రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది. మీపై అసభ్య పదజాలం వాడినందుకు పాత్రికేయులను జైళ్లలో పెట్టిన మీరు అదే భాషతో విమర్శించవచ్చా? ప్రపంచ దేశాల ముందు భారత్‌ను కించపర్చేలా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారు’’ అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని