Published : 01/12/2021 06:09 IST

విపక్షాల వాకౌట్‌

 రాజ్యసభ సభ్యులపై వేటును నిరసించిన ఎంపీలు
ప్రొరోగ్‌ అయ్యాక అప్పటి పరిణామాలపై చర్యలా?: ఖర్గే
ఉభయ సభల్లో రెండోరోజూ అంతరాయం

రాజ్యసభ సభ్యుల సస్పెన్షనుపై మహాత్ముని విగ్రహం ఎదుట ప్రతిపక్ష నేతల నిరసన

దిల్లీ:  పార్లమెంట్‌ ఉభయసభల్లో రెండోరోజూ విపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి. వర్షాకాల సమావేశాల్లో రభస చేసినందుకు 12 మంది ఎంపీలపై ప్రస్తుత శీతాకాల సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్‌ వేటు వేయడాన్ని నిరసిస్తూ పలుపార్టీల సభ్యులు మంగళవారం రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేశారు. సభను అపవిత్రం చేయడం పట్ల వారు ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు తప్పుపట్టారు. సభ తీసుకున్న నిర్ణయం సబబేనని చెప్పారు. నిబంధనల ప్రకారమే అది జరిగిందనీ, అలాంటి అధికారం సభకు, సభాపతికి ఉన్నాయని చెప్పారు. సస్పెన్షన్‌ ఎత్తివేతను కోరుతూ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రతిపాదించిన తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. గత సమావేశం ప్రొరోగ్‌ అయిన తర్వాత ఆనాటి ఘటనలపై కొన్ని నెలల తర్వాత ఇప్పుడు వేటు వేయడం తగదనీ, వారి సస్పెన్షన్‌.. సభా నిబంధనలకు పూర్తి విరుద్ధం, అప్రజాస్వామికం అని ఖర్గే చెప్పారు. నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. మొత్తం సమావేశ కాలం పాటు వేటు వేయడం ‘మితిమీరిన చర్య’గా పేర్కొంటూ విడిగా లేఖ సమర్పించారు. ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పడం సబబు కాదన్నారు. నిర్ణయాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని ఛైర్మన్‌ తేల్చి చెప్పారు. ‘..వారు సభకు అంతరాయం కలిగించారు. టేబుళ్లపైకి వచ్చారు. పత్రాలు విసిరికొట్టారు. ఇప్పుడు నాకు పాఠాలు చెబుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు’ అని చెప్పారు. తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించక తప్పడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన సమయంలోనూ సభలో అనేక మందిపై చర్యలు తీసుకున్నామనీ, దానిని అప్రజాస్వామికమని అనడం తప్పు అని చెప్పారు.

లోక్‌సభలో తెరాస నిరసన
సభ్యులపై సస్పెన్షన్‌ను నిరసిస్తూ అంతకుముందు లోక్‌సభలో కూడా విపక్షాలు ఆందోళనకు దిగాయి. వారికి మద్దతుగా సభ నుంచి వాకౌట్‌ చేశాయి. ప్రభుత్వం నిరంకుశత్వంతో వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ప్రశ్నోత్తరాల సమయం మొదలవగానే తెరాస సభ్యులు వెల్‌లోకి వెళ్లి, కనీస మద్దతు ధరపై చట్టాన్ని తీసుకురావాలని, ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలనీ డిమాండ్‌ చేశారు. ఆ మేరకు నినాదాలిచ్చారు. కాంగ్రెస్‌, వామపక్ష సభ్యులు సహా ఇతర విపక్ష ఎంపీలు కొన్ని అంశాలను లేవనెత్తేందుకు ప్రయత్నించారు. తమకు అవకాశం రాకపోవడంతో కాంగ్రెస్‌, ఎన్సీపీ, వామపక్షాలు, డీఎంకే వాకౌట్‌ చేశాయి. ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల వేతనాలు, సేవా నిబంధలనకు సంబంధించిన సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.

గాంధీ విగ్రహం వద్ద నిరసన
సభలో మాట్లాడేందుకు విపక్షాలకు అవకాశం రావడం లేదని లోక్‌సభలో కాంగ్రెస్‌పక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధరి చెప్పారు. ఎంపీల గొంతు నొక్కాలని చూస్తే గళమెత్తకుండా కూర్చోలేమని ఆయన విలేకరులకు చెప్పారు. ఉభయ సభల నుంచి వాకౌట్‌ చేసిన ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. 12 మందిపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. చర్చలేమీ చేపట్టకుండా ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడ్డాయి. ‘సభ్యులు దేని కోసం క్షమాపణ చెప్పాలి? పార్లమెంటులో ప్రజా సంబంధిత అంశాలను లేవనెత్తినందుకా?’ అని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ట్విటర్‌ ద్వారా ప్రశ్నించారు.

రోజువారీగా వ్యూహ రూపకల్పన
సమావేశం ప్రారంభానికి ముందు పార్లమెంటు ఆవరణలో ప్రతిపక్షాలు సమావేశమై, సభ్యుల సస్పెన్షన్‌పై చర్చించాయి. సభలో అనుసరించాల్సిన తీరుపై రోజువారీగా వ్యూహం రూపొందించాలని నిర్ణయించాయి. ఈ భేటీలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కూడా పాల్గొన్నారు. డీఎంకే, శివసేన, ఎన్‌సీపీ, సీపీఎం, సీపీఐ, ఆప్‌, ఆర్‌జేడీ, ఎన్‌సీ, ఆర్‌ఎస్‌పీ, తెరాస తదితర 16 పార్టీల సభ్యులు హాజరయ్యారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో తమ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు ఉన్నప్పటికీ టీఎంసీ హాజరు కాలేదు. సభలను బహిష్కరించాక పార్లమెంట్‌ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఉభయసభల ఎంపీలు నిరసనకు దిగారు. సస్పెన్షన్‌ నిర్ణయాన్ని ఛైర్మన్‌ ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. తాము చేసింది తప్పేం కాదని, ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణలు చెప్పబోమని స్పష్టంచేశారు. ఆ తర్వాత రెండోసారి విపక్ష నేతలు మల్లికార్జున్‌ ఖర్గే కార్యాలయంలో సమావేశమయ్యారు. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద 12 మంది ఎంపీలు డిసెంబర్‌ 23 వరకు ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు నిరసన వ్యక్తం చేస్తారని తృణమూల్‌ తెలిపింది.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని