అంతర్జాతీయ ప్రయాణికులపై నిఘా

కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను ముమ్మరం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఆర్‌టీ-పీసీఆర్‌, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్ష (ఆర్‌ఏటీ)లకు చిక్కకుండా ఈ వేరియంట్‌ తప్పించుకోలేదని పేర్కొంది

Updated : 01 Dec 2021 05:06 IST

ఒమిక్రాన్‌ అలజడితో రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

దిల్లీ, ఈనాడు-దిల్లీ: కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను ముమ్మరం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఆర్‌టీ-పీసీఆర్‌, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్ష (ఆర్‌ఏటీ)లకు చిక్కకుండా ఈ వేరియంట్‌ తప్పించుకోలేదని పేర్కొంది. ప్రధానంగా అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వివిధ విమానాశ్రయాలు, ఓడరేవులు, భూ సరిహద్దుల ద్వారా దేశంలోకి ప్రవేశిస్తున్నవారిపై సమర్థ నిఘా ఏర్పాటుచేయాలని ఆదేశించింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఒమిక్రాన్‌ రకం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. కొవిడ్‌ నియంత్రణ చర్యల సన్నద్ధతపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ ఉన్నతస్థాయి సమావేశాన్ని మంగళవారం వర్చువల్‌ విధానంలో నిర్వహించారు. మహమ్మారి వ్యాప్తి నియంత్రణకు కీలక సూచనలు చేశారు.

తొలిరోజే ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష
ఒమిక్రాన్‌ ముప్పు నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాజేష్‌ భూషణ్‌ సూచించారు. ‘ముప్పు’ జాబితాలో ఉన్న దేశాల నుంచి వచ్చేవారికి తొలిరోజునే ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష నిర్వహించాలని.. ఫలితం వచ్చేవరకూ వారిని విమానాశ్రయంలోనే ఉంచాలని పేర్కొన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చేవారికి 8వ రోజున పరీక్ష చేయడం తప్పనిసరి అని తెలిపారు. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లోనూ 5% మందికి (ర్యాండమ్‌గా ఎంపిక చేస్తారు) తొలిరోజునే ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష చేయాలని ఆదేశించారు. పాజిటివ్‌గా తేలిన నమూనాలను జన్యు విశ్లేషణ కోసం ఇన్సాకాగ్‌ ప్రయోగశాలలకు పంపాలని చెప్పారు. ఈ ఆదేశాలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఐరోపా సమాఖ్య సభ్య దేశాలు, బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, బంగ్లాదేశ్‌, బోట్స్‌వానా, చైనా, మారిషస్‌, న్యూజిలాండ్‌, జింబాబ్వే, సింగపూర్‌, ఇజ్రాయెల్‌, హాంకాంగ్‌లను ‘ముప్పు’ దేశాలుగా పేర్కొంటూ కేంద్రం ఇప్పటికే జాబితా విడుదల చేసిన సంగతి గమనార్హం.

నెలాఖరుదాకా ఇంటింటికీ టీకా
ప్రధాని మోదీ గత నెల 3న ప్రారంభించిన ‘ఇంటింటికీ టీకా’ కార్యక్రమాన్ని డిసెంబర్‌ 31 వరకూ కొనసాగించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అర్హులందరికీ తొలి డోసు పంపిణీని వందశాతం పూర్తిచేసి, రెండో డోసు వితరణను వేగంగా కొనసాగించడం తమ లక్ష్యమని ఓ ప్రకటనలో తెలిపింది.

డిసెంబరు 31 వరకూ నిబంధనలు  
కొవిడ్‌ కట్టడి కోసం ప్రకృతి వైపరీత్య నియంత్రణ చట్టం కింద జారీ చేసిన నిబంధనలను డిసెంబర్‌ 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌ భల్లా మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఒమిక్రాన్‌ వ్యాప్తి నియంత్రణ కోసం అనుసరించాల్సిన మార్గదర్శకాలను సూచిస్తూ కేంద్ర వైద్యఆరోగ్య శాఖ నవంబరు 25న జారీ చేసిన సూచనలను పక్కాగా అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన నిర్దేశించారు.

‘దేశంలో ఒమిక్రాన్‌ కేసుల్లేవు’
మన దేశంలో ఇప్పటివరకు ఒమిక్రాన్‌ రకం కొవిడ్‌ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ పార్లమెంటుకు నివేదించారు. ఆ వేరియంట్‌ భారత్‌ను తాకకుండా అవసరమైన అన్ని చర్యలూ చేపట్టినట్లు తెలిపారు. అనుమానమున్న కేసుల్లో జన్యు విశ్లేషణ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దేశంలో కొవిడ్‌ పరిస్థితి నియంత్రణలోనే ఉందని పేర్కొన్నారు. రాజ్యసభలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. దేశంలో తాజాగా ఒక్కరోజులో 6,990 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. గత 551 రోజుల్లో ఇదే అత్యల్పం. 24 గంటల్లో 190 మంది ప్రాణాలను మహమ్మారి బలి తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని