ఆర్టీసీ ఛార్జీల పెంపుపై కసరత్తు కొలిక్కి

ఆర్టీసీ ఛార్జీల పెంపుదల కసరత్తు కొలిక్కి వచ్చింది. ఎప్పటి నుంచి పెంచాలన్న అంశంపై తర్జనభర్జనలు సాగుతున్నాయి. గతంలో ప్రభుత్వం 2019 డిసెంబరు ఒకటో తేదీన ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించి మూడో తేదీ నుంచి అమలు చేసింది. ఛార్జీలు పెంచి బుధవారానికి రెండు సంవత్సరాలు పూర్తి అవుతుంది.

Updated : 01 Dec 2021 14:32 IST

నేడు మంత్రి పువ్వాడ ఉన్నతస్థాయి సమీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్టీసీ ఛార్జీల పెంపుదల కసరత్తు కొలిక్కి వచ్చింది. ఎప్పటి నుంచి పెంచాలన్న అంశంపై తర్జనభర్జనలు సాగుతున్నాయి. గతంలో ప్రభుత్వం 2019 డిసెంబరు ఒకటో తేదీన ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించి మూడో తేదీ నుంచి అమలు చేసింది. ఛార్జీలు పెంచి బుధవారానికి రెండు సంవత్సరాలు పూర్తి అవుతుంది. కాగా ప్రస్తుతం ఛార్జీల పెంపుదలను తక్షణమే ప్రకటిస్తారా? కొద్ది రోజుల సమయం తీసుకుంటారా? అన్నది చర్చనీయాంశంగా ఉంది. మంత్రివర్గంలో చర్చించిన మీదట పెంపుదల నిర్ణయం తీసుకుంటామని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులతో చెప్పారు. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీ ఛార్జీల పెంపుదల అంశం చర్చకు రాలేదన్నది సమాచారం. సీఎం ఆమోద ముద్ర లభించాక ఛార్జీల పెంపుదలకు మంత్రివర్గ ఆమోదం లాంఛనమేనని ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. మరోదఫా ఆర్టీసీపై సీఎం సమీక్షించే అవకాశం ఉందన్న ప్రచారమూ సాగుతోంది. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

4,057 మంది ఆర్టీసీ ఉద్యోగుల రక్తదానం
ఆర్టీసీ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 67 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాల్లో 4,057 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు రక్తదానం చేసినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. రెడ్‌క్రాస్‌ సొసైటీ, ప్రహరి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఈ శిబిరాలను నిర్వహించారు. హైదరాబాద్‌లోని జూబ్లీ స్టేషన్‌, ఎంజీబీస్‌లలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాలను సంస్థ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్‌లు ప్రారంభించారు. వారు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్టీసీ ప్రజలకు సేవలందించే సంస్థ అని చాటి చెప్పేందుకు ఇలాంటి మరిన్ని భిన్నమైన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

20 నుంచి 25 పైసలు పెంపుదల?
కిలోమీటరుకు 20 నుంచి 25 పైసల చొప్పున పెంచాలని అధికారులు ప్రతిపాదించారు. ఛార్జీల పెంపుదలతో సుమారు రూ.800 కోట్ల నుంచి రూ.850 కోట్ల వరకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉందని అంచనా. ఆర్టీసీ నష్టాలు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. గత ఏడాది రూ.1,424 కోట్లు నష్టం వస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికి గడిచిన ఏడాది నష్టాలను అధిగమించినట్లు సమాచారం. నష్టాల్లో సింహభాగం డీజిల్‌ ధర పెంపుతోనే వస్తున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని