చదరపు గజం రూ.లక్ష

ఉప్పల్‌ భగాయత్‌లో మూడో దశ వేలమూ హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు కాసుల వర్షం కురిపిస్తోంది. తొలి రోజు ఈ-వేలంలో అధికారుల అంచనాలను దాటేస్తూ మూసీ తీరాన ప్లాట్లు గతంకంటే

Updated : 03 Dec 2021 12:04 IST

ఉప్పల్‌ భగాయత్‌లో 2 ప్లాట్లకు రికార్డు ధర

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఉప్పల్‌ భగాయత్‌లో మూడో దశ వేలమూ హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు కాసుల వర్షం కురిపిస్తోంది. తొలి రోజు ఈ-వేలంలో అధికారుల అంచనాలను దాటేస్తూ మూసీ తీరాన ప్లాట్లు గతంకంటే భారీ స్థాయిలో ధరలు పలికాయి. రెండు ప్లాట్లు చదరపు గజానికి రూ.1.01 లక్షల రికార్డు ధర పలికాయి. ఒక ప్లాటును కనిష్ఠంగా రూ.53 వేలకు పాడారు. చదరపు గజానికి రూ.35 వేల నిర్ధారిత ధర ఉండగా.. ఉదయం సెషన్లో ఓ ప్లాట్‌ అత్యధికంగా చదరపు గజానికి రూ.77 వేలు, రెండో సెషన్‌లో రెండు ప్లాట్లు ఏకంగా రూ.1.01 లక్షల ధరలు పలికాయి. సగటున గజానికి రూ.71,815 ధర వచ్చింది. మూడో దశలో మొత్తం 44 ప్లాట్లలో తొలిరోజు 23 ప్లాట్లకు వేలం జరిగింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీఎస్‌ వేదికగా జరిగిన ఈ ప్రక్రియలో..  ప్రవాసీయులతో పాటు స్థానిక రియల్టర్లు నువ్వా నేనా అన్నట్లుగా ధరలు పెంచుకుంటూ పోయారు. తొలిరోజు 19 వేల చదరపు గజాల వేలంలో రూ.141.61 కోట్లు రాగా, శుక్రవారం మిగిలి ఉన్న 1.15 లక్షల చ.గజాల్లో మొత్తం 21 ప్లాట్లకు సగటున రూ.60 వేలదాకా వచ్చినా సుమారు రూ.900 కోట్లు ఖజానాకు వస్తాయని హెచ్‌ఎండీఏ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  

గతంలో రూ.79 వేలు..

ఉప్పల్‌ భగాయత్‌ భూముల వేలం రెండో దశలో గరిష్ఠంగా చదరపు గజానికి రూ.79 వేలు, కనిష్ఠంగా రూ.30 వేలు పలకగా.. ఈ ఏడాది కొంత పెరగొచ్చని హెచ్‌ఎండీఏ అధికారులు భావించారు. అనూహ్యంగా చ.గజం రూ.లక్షను దాటింది. 2018లో నిర్వహించిన వేలంలో చ.గజం కనీస ధర రూ.20 వేలు నిర్ణయించగా.. అత్యధికంగా అత్తాపూర్‌లో రూ.1.53 లక్షలు పలికింది. తర్వాత మాదాపూర్‌లో గజం రూ.1.52 లక్షలు, షేక్‌పేట్‌లో రూ.1.2 లక్షలు కోట్‌ చేశారు.

భారీ అంచనాలు

మల్టీ పర్పస్‌ జోన్‌కి కేటాయించిన 12.04 ఎకరాల్లో 10 ప్లాట్లతో పాటు మరో 11 ప్లాట్లను శుక్రవారం వేలం వేయనున్నారు. తొలిరోజు ప్రవాసీలూ పెద్దఎత్తున పాల్గొనడంతో రెండోరోజు మల్టీపర్పస్‌ భూములకు చ.గజానికి కనీసం రూ.70వేల దాకా పలికే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని