Updated : 03/12/2021 06:01 IST

జన్యు పరీక్షలు వందశాతం పెరిగాయ్‌

వ్యాధులపై అవగాహన పరిధి విస్తరించడమే అందుకు కారణం
వయసులవారీగా వివిధ దశల్లో ఆ పరీక్షలతో లోపాలు సరిదిద్దుకోవచ్చు
కేన్సర్‌, గుండెపోటు ముప్పునూ ముందే పసిగట్టవచ్చు
‘ఈనాడు’తో జీనోమ్‌ ఫౌండేషన్‌ ఎండీ డాక్టర్‌ కేపీసీ గాంధీ

న్యులోపాలతో సోకే వ్యాధులు, వంశపారంపర్యంగా వస్తున్న రోగాలపై అవగాహన పెరుగుతుండటంతో జన్యు పరీక్షలు చేయించుకునేందుకు వస్తున్న వారి సంఖ్య హెచ్చుతోందని జీనోమ్‌ ఫౌండేషన్‌ ఎండీ డాక్టర్‌ కేపీసీ గాంధీ తెలిపారు. కొవిడ్‌ సమయంలో పరీక్షలు తగ్గినా.. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే కరోనా తర్వాత పరీక్షలు వందశాతం పెరిగాయన్నారు. గర్భంలో ఉన్నప్పుడు, పుట్టిన వెంటనే, అలాగే యాభై ఏళ్లు దాటిన దశలో  జన్యుపరీక్షలు చేయటం ద్వారా లోపాలను ముందే గుర్తించి సరిచేసుకునేందుకు అవకాశం ఉంటుందని స్పష్టీకరించారు. యాభై ఏళ్లు దాటాక ఇటీవల ఎక్కువ మంది క్యాన్సర్‌ బారిన పడుతుండటం, గుండెపోటు ఘటనలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో వాటి బారినపడే ముప్పు ఆ వయసువారిలో ఏమేరకు ఉందో జన్యుపరీక్షల ద్వారా తెలుసుకోవచ్చన్నారు డాక్టర్‌ గాంధీ.. ఆయనతో ‘ఈనాడు’ ప్రత్యేక ముఖాముఖి..

అరుదైన వ్యాధులుగా వేటిని పరిగణిస్తుంటారు? గుర్తించడం ఎలా?

జన్యువ్యాధుల్లో అరుదైనవి అనేకం ఉన్నాయి. వీటిని జన్యుపరీక్షలతో గుర్తించవచ్చు. ఇలా ఇప్పటివరకు ఏడువేల రోగాలను గుర్తించారు. గుర్తించనివి ఇంకెన్నో.. జీనోమ్‌ ఫౌండేషన్‌ 20 రకాల జబ్బులను గుర్తించింది. కొత్తవి వస్తుంటాయి. కొవిడ్‌లో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌.. వైరస్‌లో జన్యు ఉత్పరివర్తనంతోనే పుట్టుకొచ్చింది. మానవ శరీరంలోనూ పర్యావరణపరంగా, జీవనశైలి మూలంగా జన్యు ఉత్పరివర్తనాలు జరుగుతుంటాయి. అంతకుముందే ఉన్న లోపాలు బయటపడుతుంటాయి. వ్యక్తుల్లోని జన్యువుల్లో ఎలాంటి లోపాలున్నాయో కనుగొనేందుకు పరీక్షలు అవసరం.

జన్యులోపాలతో వచ్చే వ్యాధులను ముందే పసిగట్టి నివారించుకోవచ్చా?

మన దేశంలో ఎంతమందికి ఈ లోపాలున్నాయో తెలియదు. యూకే, అమెరికా వంటి దేశాల్లో ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో పౌరులకు జన్యు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రస్తుతం మనవద్ద అలాంటి వ్యవస్థ లేకున్నా భవిష్యత్తులో రూపుదిద్దుకునే అవకాశం ఉంది. అప్పటిదాకా జన్యు లోపాలతో పిల్లలు పుట్టడం, అర్ధాంతరంగా తనువు చాలించటం.. వంటి పరిస్థితులు రాకూడదనే జీనోమ్‌ ఫౌండేషన్‌ ఏర్పాటైంది. ఇదొక స్వచ్ఛంద సంస్థ. నామమాత్రపు ధరలకు జన్యుపరీక్షలు చేస్తుంది. అవి కూడా భరించలేనివారికి ఇతరుల సహకారంతో నిర్వహిస్తుంది.

జన్యుపరీక్షలు ఎవరు, ఏదశలో చేయించుకోవాలి?

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, రక్త సంబంధీకులను వివాహం చేసుకునే వర్గాల్లో ఎక్కువగా జన్యులోపాలు బయటపడుతున్నాయి. పిల్లలు పుట్టకపోవడానికి ఉన్న జన్యులోపాలను పరీక్షల ద్వారా ముందే తెలుసుకోవచ్చు. సరిచేసుకోవచ్చు. గర్భస్థ సమయంలోనే పరీక్షలతో శిశువులో లోపాలను గుర్తించి సరిదిద్దుకోవచ్చు. పుట్టాక కూడా పరీక్షల ద్వారా ముందస్తుగా గుర్తించవచ్చు. ఏదైనా జబ్బుతో బాధపడుతూ.. ఎక్కడ చూపించినా నయం కావడం లేదని భావిస్తున్నవారు జన్యుపరీక్షలు చేయించుకుంటే తగిన చికిత్స పొందవచ్చు. వంశపారంపర్యంగా వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున.. కుటుంబంలో కేన్సర్‌, గుండెపోటుతో చనిపోవడం వంటి ఘటనలు జరిగి ఉంటే జన్యుపరీక్షలు చేయించుకోవడం మేలు. గుండెలో రంధ్రం ఉండటమూ జన్యులోపమే. ముందే గుర్తిస్తే జీవితకాలాన్ని పొడిగించుకోవచ్చు. కొందరైతే తమకెందుకు గుండెపోటు వచ్చిందో తెలుసుకోడానికీ జన్యుపరీక్షలు చేయించుకుంటున్నారు. కొంతమందికి కాలేయం, మూత్రపిండాలు, మెదడులో సమస్యలు, డిమెన్షియా, అల్జీమర్స్‌, రెటీనాలో సమస్యలు రావచ్చు. ఇవన్నీ జన్యుపరమైన జబ్బులే. వీటిపై పరిశోధనల కోసం వేర్వేరు సంస్థలు, ఆసుపత్రులు, వైద్యనిపుణులతో కలిసి పనిచేస్తున్నాం.

- ఈనాడు, హైదరాబాద్‌

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని