Published : 03/12/2021 04:23 IST

జల, విద్యుత్తు ప్రాజెక్టులకు రూ.1.63 కోట్ల రుణం

తెలంగాణలో కాళేశ్వరం, పాలమూరు, సీతారామ తదితరాలకు పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ ద్వారా అప్పు అందించాం
కాళేశ్వరానికి వడ్డీ 9.2-11%.. 2022 అక్టోబరు నుంచి చెల్లింపులు
కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ వెల్లడి

ఈనాడు, దిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన జల, విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణానికి పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎఫ్‌సీ), రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌(ఆర్‌ఈసీ)ల ద్వారా ఇప్పటివరకు రూ.1,63,627 కోట్ల రుణం విడుదల చేసినట్లు కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్‌కేసింగ్‌ తెలిపారు. గురువారం లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘‘ఆర్‌ఈసీ ద్వారా కాళేశ్వరం, ఇందిరమ్మ ఫ్లడ్‌ఫ్లో కెనాల్‌, దేవాదుల ఎత్తిపోతలు, సీతారామ ఎత్తిపోతలు, పీవీ నరసింహారావు కంతనపల్లి సుజల స్రవంతి, పీఎఫ్‌సీ ద్వారా కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు రుణం అందించాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు  పీఎఫ్‌సీ ఇచ్చిన రుణంపై వడ్డీ 9.2% నుంచి 11%మేర ఉంది. రుణ కాలపరిమితి 12 ఏళ్లు. 2022 అక్టోబరు 15 నుంచి చెల్లింపులు ప్రారంభమవుతాయి. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల కింద రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణానికి పూచీకత్తు ఇచ్చింది. ఈ ప్రాజెక్టు 7 లింకుల్లో సాగుతుంది. ఇప్పటివరకు మొదటి రెండు లింకులు 100% పూర్తయ్యాయి. మూడోది 76%, నాలుగోది 92%, అయిదోది 57%, ఆరోది 25%, ఏడోది 55% మేర పూర్తయింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల రుణంపై వడ్డీ    10.65% నుంచి 11% మేర ఉంది. రుణ కాల పరిమితి 15 ఏళ్లు. 2024 అక్టోబరు 15 నుంచి రుణ చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొత్తం అయిదు దశల్లో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. ఇప్పటి వరకు తొలిదశ  49%, రెండో దశ 70%, మూడో దశ 67%, నాలుగో దశ 52% పూర్తయింది. అయిదోది రాష్ట్ర ప్రభుత్వ అనుమతి దశలో ఉంది. దీనికి పీఎఫ్‌సీ ఎలాంటి రుణం అందించలేదు’’ అని కేంద్ర మంత్రి వెల్లడించారు.

రాష్ట్ర రోడ్ల అభివృద్ధికి రూ.744 కోట్లతో ప్రతిపాదనలు

కేంద్ర రహదారి, మౌలిక వసతుల నిధి (సీఆర్‌ఐఎఫ్‌) కింద 523 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను అభివృద్ధి చేయమని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.744 కోట్ల విలువైన 42 ప్రతిపాదనలు అందినట్లు కేంద్ర రహదారి, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. గురువారం లోక్‌సభలో తెరాస ఎంపీ నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఆయా రాష్ట్రాల భూభాగం, ఇంధన వినియోగం సూత్రాల ఆధారంగా రాష్ట్ర రహదారుల అభివృద్ధికి కేంద్రం సీఆర్‌ఐఎఫ్‌ నిధులు కేటాయిస్తుందన్నారు. తెలంగాణకు 2021-22కి రూ.262.19 కోట్లు కేటాయించామన్నారు. 2022-23 తాలూకూ కేటాయింపులను వచ్చే ఏడాది ఖరారు చేస్తామన్నారు.

అంతరించే దశలో 117 భారతీయ భాషలు

అంతరించే దశలో 117 భారతీయ భాషలు ఉన్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. గురువారం రాజ్యసభలో తెరాస నేత కె.కేశవరావు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. పదివేల మంది కంటే తక్కువ జనాభా మాట్లాడే భాషలను అంతరించే దశలో ఉన్నట్లు పరిగణిస్తున్నామని చెప్పారు. వీటి సంరక్షణకు మైసూరులోని భారతీయ భాషల సంస్థకు యూజీసీ రూ.45.89 కోట్లు ఇచ్చిందన్నారు.

పులుల గణనకు ప్రత్యేక యాప్‌

పులుల గణన(ఇండియా టైగర్‌ ఎస్టిమేషన్‌-2022) కోసం ఎంస్ట్రైప్స్‌ (మానిటరింగ్‌ సిస్టం ఫర్‌ టైగర్స్‌ ఇంటెన్సివ్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ ఎకలాజికల్‌ స్టేటస్‌) పేరుతో ప్రత్యేక యాప్‌ రూపొందించినట్లు పర్యావరణ, అటవీశాఖ సహాయమంత్రి అశ్వినీకుమార్‌ చౌబే తెలిపారు. తెరాస సభ్యుడు కె.ఆర్‌. సురేష్‌రెడ్డి గురువారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని