విపత్తుల ముప్పేట దాడి

కొన్ని రాష్ట్రాల్లో వరదలు... మరికొన్ని రాష్ట్రాల్లో కరవు.. ఇంకొన్ని రాష్ట్రాల్లో తుపాన్ల తాకిడి అధికంగా ఉంటుంది. వీటన్నింటి ప్రభావానికి గురయ్యే అత్యంత వాతావరణ దుర్బలత్వ రాష్ట్రాల్లో అస్సాం, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర తొలి మూడు

Published : 03 Dec 2021 04:10 IST

ఏపీపై తుపాన్లు, కరవు, వరదల ప్రభావం అధికం
విపత్తుల ప్రభావ సూచీలో 8 జిల్లాలు
తెలంగాణ నుంచి మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌  

ఈనాడు, అమరావతి: కొన్ని రాష్ట్రాల్లో వరదలు... మరికొన్ని రాష్ట్రాల్లో కరవు.. ఇంకొన్ని రాష్ట్రాల్లో తుపాన్ల తాకిడి అధికంగా ఉంటుంది. వీటన్నింటి ప్రభావానికి గురయ్యే అత్యంత వాతావరణ దుర్బలత్వ రాష్ట్రాల్లో అస్సాం, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 110 జిల్లాల్లో విపత్తుల ప్రభావం అత్యధికంగా, అధికంగా ఉన్నట్లు గుర్తించగా.. వాటిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 8, తెలంగాణ నుంచి 2 జిల్లాలు ఉన్నాయి. ఇంధన, పర్యావరణ, జల మండలి(సీఈఈడబ్ల్యూ) రూపొందించిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. దేశంలోని ప్రతి 20 మందిలో 17 మంది వాతావరణ, జల సంబంధ విపత్తుల ప్రభావానికి గురవుతున్నట్లు పేర్కొంది. మొత్తం 35 రాష్ట్రాల్లో 27 చోట్ల వాతావరణ దుర్బలత్వ ప్రభావం అధికంగా ఉందని నివేదిక తేల్చింది.

దేశవ్యాప్తంగా అత్యధిక వాతావరణ దుర్బలత్వ పరిస్థితులున్న జిల్లాల్లో అస్సాంలోని ధేమాజి మొదటి స్థానంలో, తెలంగాణలోని ఖమ్మం (వరదలు, కరవు) రెండో స్థానంలో (అన్నీ మొదటి ర్యాంక్‌) ఉన్నాయి. మొత్తంగా దేశంలో 50 జిల్లాల్లో వాతావరణ దుర్బలత్వ తీవ్రత అత్యధికంగా ఉంటుందని నివేదికలో గుర్తించారు.


వరద ప్రభావిత జిల్లాల్లో..

దేశంలోనే అత్యధిక వరద ప్రభావిత ప్రాంతాలుగా దక్షిణాది జోన్‌లో 9 జిల్లాలను గుర్తించారు. ఇందులో తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి, కడప, చిత్తూరు, కర్ణాటకలో దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, కేరళలో కోజికోడ్‌, కన్నూర్‌ జిల్లాలున్నాయి.

పెరుగుతున్న కరవు తీవ్రత

దక్షిణాది జోన్‌లోని 17 కరవు ప్రభావిత జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి విజయనగరం, పశ్చిమగోదావరి, కడప, గుంటూరు, నెల్లూరు.. తెలంగాణలో మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ జిల్లాలు ఉన్నాయి. కరవు బారిన పడే జిల్లాలపైనే.. తుపాన్ల ప్రభావం ఎక్కువగా ఉంటోందని గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని