Published : 03/12/2021 04:15 IST

మళ్లీ అలజడి

పెరుగుతున్న కరోనా కేసులు, తాజాగా 189 నమోదు
కొవిడ్‌ బారిన సూర్యాపేట జిల్లా వైద్యాధికారి కుటుంబం
పొంచి ఉన్న ఒమిక్రాన్‌ ముప్పు
ఆరోగ్యశాఖ అప్రమత్తం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మరోసారి కొవిడ్‌ అలజడి మొదలైంది. నాలుగు నెలలుగా నెమ్మదించిన కరోనా వైరస్‌ నెమ్మదిగా మళ్లీ జడలు విప్పుతోంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ భారత్‌లోకి ప్రవేశించడంతో తిరిగి ఆందోళన ప్రారంభమైంది. కర్ణాటకలో తాజాగా రెండు ఒమిక్రాన్‌ కేసులు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో.. తెలంగాణలోనూ ఆ జాడలు కనిపించే అవకాశాలున్నాయా? అనే భయం వెన్నాడుతోంది. బుధవారం రెండు అంతర్జాతీయ విమానాల ద్వారా రాష్ట్రానికి వచ్చిన వారిలో తెలంగాణకు చెందిన వారు 239 మంది, ఏపీకి చెందిన వారు 72 మంది, మహారాష్ట్రకు చెందినవారు 10 మంది, మధ్యప్రదేశ్‌కు చెందినవారు ఇద్దరు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక్కరు, రాజస్థాన్‌కు చెందిన ఒక్కరున్నారు. వీరి సమాచారాన్ని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ నుంచి ఇతర రాష్ట్రాల ఆరోగ్యశాఖలకు పంపించారు. నెగెటివ్‌గా తేలిన అంతర్జాతీయ ప్రయాణికులను 14 రోజుల పాటు వైద్యసిబ్బంది నిరంతరం పరిశీలన జరుపుతారు. ఈ పరిశీలనలో భాగంగా 8వ రోజు మరోసారి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేస్తారు. అందులో నెగెటివ్‌ వస్తే మరో 7 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో పెట్టి, అప్పటికీ ఎటువంటి లక్షణాలు కనిపించకపోతే సాధారణ రాకపోకలకు అనుమతిస్తారు.

నిర్లక్ష్యంతో క్రమంగా పెరుగుతూ..

గత ఏడాది(2020) మార్చి 2న రాష్ట్రంలో తొలి కొవిడ్‌ కేసు నమోదైంది. అదే ఏడాది మే, జూన్‌, జులై, ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో విజృంభించింది. అక్టోబరు నుంచి నెమ్మదించిన కరోనా వైరస్‌ ఫిబ్రవరి వరకూ క్రమేణా తగ్గుముఖం పట్టింది. మార్చిలో డెల్టా వేరియంట్‌ ప్రభావం మొదలైంది. ఇక్కడి నుంచి ప్రారంభమైన రెండోదశలో డెల్టా వేరియంట్‌ కారణంగా ఏప్రిల్‌, మే, జూన్‌ మాసాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ఏడాది జులై నుంచి రెండోదశ ఉద్ధృతి క్రమేణా తగ్గుముఖం పడుతూ వస్తోంది. నెమ్మదిగా సాధారణ జనజీవనం మొదలై కొవిడ్‌ నిబంధనలపై శ్రద్ధ తగ్గింది. ఈ నిర్లక్ష్య ధోరణి కారణంగా.. గత 2 వారాలుగా క్రమేణా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటికీ  రోజుకు 180-200 వరకూ కొత్త కేసులు నమోదవుతుండడం ఆందోళనకర పరిణామమే. అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ రాకపోకలు కొనసాగుతుండడం.. ఇదే సమయంలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ పొరుగు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో.. ఇప్పుడు కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.

అతివేగంతోనే ఆందోళన

ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారం ఒమిక్రాన్‌ వేరియంట్‌.. డెల్టా వేరియంట్‌ కంటే ఆరింతలు వేగంగా వ్యాప్తి చెందుతుందని ఇప్పటికే నిర్ధారణ అయింది. కేవలం 3 రోజుల్లోనే 4 దేశాల నుంచి 24 దేశాలకు ఈ వేరియంట్‌ పాకింది. అంతర్జాతీయంగా ఒక పక్క కొవిడ్‌ నిబంధనలు కొనసాగుతుండగానే.. ఇంత వేగంగా వ్యాప్తి చెందడం గమనార్హం. ప్రస్తుతానికి ఈ వేరియంట్‌తో స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నా.. దీనివల్ల ఎంత ముప్పు పొంచి ఉందనేది రానున్న రోజుల్లో తెలుస్తుందని వైద్యవర్గాలు తెలిపాయి.

శంషాబాద్‌ విమానాశ్రయంలో అప్రమత్తం

బ్రిటన్‌ నుంచి వచ్చిన ఓ మహిళకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు. నవంబరు 21-డిసెంబరు 1 మధ్య బ్రిటన్‌ నుంచి 1,778 మంది ప్రయాణికులు నగరానికి చేరుకున్నారు. అక్కడి నుంచి వచ్చే వారందరికీ ఆర్టీపీసీఆర్‌ టెస్టులను కేంద్రం తప్పనిసరి చేసింది. మిగిలిన దేశాలకు చెందిన వారిలో రెండు శాతం మందిని ఎంచుకుని పరీక్షలు చేస్తున్నారు. బుధవారం 303 మందిని పరీక్షించగా.. సదరు మహిళకు పాజిటివ్‌గా తేలింది.

డీఎంహెచ్‌వో కుటుంబంలో ఆరుగురికి వైరస్‌

సూర్యాపేట (తాళ్లగడ్డ), న్యూస్‌టుడే: సూర్యాపేట జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్‌ కోటాచలం కొవిడ్‌ బారిన పడ్డారు. ఇటీవల ఆయన కుమారుడు విదేశాల నుంచి వచ్చిన వెంటనే కుటుంబ సభ్యులంతా తిరుపతికి వెళ్లి రెండు రోజుల క్రితం స్వగ్రామం తిరుమలగిరికి చేరుకున్నారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు పరీక్షలు చేయించుకోగా ఆరుగురికి కరోనా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వీరంతా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. రెండురోజులుగా ఆయనను కలిసిన వారంతా ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా 189 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 6,76,376కు పెరిగింది. మరో ఇద్దరు చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 3,995కు చేరింది. తాజాగా 137 మంది కరోనాకు చికిత్స పొంది కోలుకోగా.. మొత్తంగా 6,68,701 మంది ఆరోగ్యవంతులయ్యారు.


గురుకులాల్లో కలకలం

పటాన్‌చెరు, జూలూరుపాడు, జగిత్యాల న్యూస్‌టుడే: పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామం మహాత్మా జ్యోతిబా ఫులె బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో 24 మంది బాలికలకు, జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి గురుకుల పాఠశాలలో 9 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు వైద్యాధికారులు తేల్చారు.మల్యాల సర్కిల్‌లో ఓ ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లకు కొవిడ్‌ సోకింది. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ముగ్గురు విద్యార్థినులు కరోనా బారినపడ్డారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని