భయపెడుతున్న ‘జవాద్‌’ గండం

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. ఉత్తరాంధ్ర దిశగా కదులుతోంది. శుక్రవారం నాటికి తీవ్ర వాయుగుండంగా.. అనంతరం తుపానుగా బలపడనుంది. ‘వాయుగుండం విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 960 కిలోమీటర్లు,

Published : 03 Dec 2021 04:21 IST

ఉత్తరాంధ్ర దిశగా.. వాయుగుండం
శుక్రవారం నాటికి తుపానుగా మారే అవకాశం
అప్రమత్తతపై ప్రధాని మోదీ సమీక్ష

ఈనాడు, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. ఉత్తరాంధ్ర దిశగా కదులుతోంది. శుక్రవారం నాటికి తీవ్ర వాయుగుండంగా.. అనంతరం తుపానుగా బలపడనుంది. ‘వాయుగుండం విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 960 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 1,020 కిమీ దూరంలో కేంద్రీకృతమైంది. శుక్రవారం (3వ తేదీ) నాటికి తుపాను (జవాద్‌గా పిలుస్తున్నారు)గా మారి.. వాయవ్య దిశగా ప్రయాణిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వరకు ప్రయాణించనుంది. శనివారం ఉదయానికి ఉత్తర కోస్తా- దక్షిణ ఒడిశా తీరానికి చేరుతుంది. అక్కడ నుంచి ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణిస్తుంద’ని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. దీంతో సాయంత్రం నుంచే భారీ నుంచి అతి భారీ వర్షాలతోపాటు గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. విద్యుత్తు స్తంభాలు, చెట్లు కూలిపోయే ప్రమాదం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ సూచించాయి. ‘జవాద్‌’ తుపాను దృష్ట్యా తీసుకుంటున్న ముందుజాగ్రత్త చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర సంస్థల సన్నద్ధతను అడిగి తెలుసుకున్నారు.

తుపాను ప్రభావంతో శుక్రవారం బయలుదేరే పలు రైళ్లను ద.మ.రైల్వే రద్దు చేసినట్లు డివిజనల్‌ రైల్వే అధికారి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 3న ప్రారంభమయ్యే హౌరా-సికింద్రాబాద్‌ మధ్య నడిచే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌(12703), సికింద్రాబాద్‌-హౌరా మధ్య నడిచే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌(12704), సికింద్రాబాద్‌-భువనేశ్వర్‌ మధ్య నడిచే విశాఖ ఎక్స్‌ప్రెస్‌(17016), భువనేశ్వర్‌-సికింద్రాబాద్‌ మధ్య నడిచే విశాఖ ఎక్స్‌ప్రెస్‌(17015) రైళ్లను నిలిపివేసినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని