సింగరేణిపై సమ్మె మేఘాలు

సింగరేణిపై సమ్మె మేఘాలు కమ్ముకున్నాయి. దేశవ్యాప్తంగా 88 బొగ్గు బ్లాకులను వేలం వేస్తున్న క్రమంలో సింగరేణికి చెందిన నాలుగు బ్లాకులనూ ఈ నెల 13న వేలం వేయాలని కేంద్రం నిర్ణయించింది. దీన్ని వ్యతిరేకిస్తూ గుర్తింపు

Published : 03 Dec 2021 04:27 IST

బొగ్గు బ్లాకుల వేలం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు
ఈ నెల 9 నుంచి 72 గంటల సమ్మెకు నిర్ణయం
నేడు చర్చలకు ఆహ్వానించిన యాజమాన్యం

శ్రీరాంపూర్‌, న్యూస్‌టుడే: సింగరేణిపై సమ్మె మేఘాలు కమ్ముకున్నాయి. దేశవ్యాప్తంగా 88 బొగ్గు బ్లాకులను వేలం వేస్తున్న క్రమంలో సింగరేణికి చెందిన నాలుగు బ్లాకులనూ ఈ నెల 13న వేలం వేయాలని కేంద్రం నిర్ణయించింది. దీన్ని వ్యతిరేకిస్తూ గుర్తింపు సంఘమైన తెరాస అనుబంధ తెబొగకాసం, అయిదు జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 9 నుంచి 11 వరకు 72 గంటలు సమ్మె చేయాలని నిర్ణయించాయి. సంఘాల నేతలు గనులపై సమావేశాలు నిర్వహిస్తూ కార్మికులను సన్నద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 3న హైదరాబాద్‌లో చర్చలకు రావాలని సంఘాలను యాజమాన్యం పిలిచింది. చర్చల ఫలితాన్ని బట్టి కార్మిక సంఘాలు తొలుత సింగరేణిలో, ఆ తర్వాత దేశవ్యాప్తంగా సమ్మెకు దిగాలని యోచిస్తున్నాయి.

సొంత వనరులతో ప్రగతి సాధిస్తున్నా..

ప్రభుత్వరంగ సంస్థలైన కోల్‌ ఇండియా, సింగరేణిలు సొంత వనరులతోనే అభివృద్ధి పథంలో సాగుతున్నాయి. మరోవైపు పన్నుల రూపంలో అయిదేళ్లలో సింగరేణి రాష్ట్రానికి రూ.15,011 కోట్లు, కేంద్రానికి రూ.17,690 కోట్లు చెల్లించింది. ఇలా ఏటా రూ.వేల కోట్లు రాబట్టుకుంటున్నా.. గనులను ప్రైవేటుకు ధారాదత్తం చేసేందుకు యత్నిస్తుండటంపై కార్మిక సంఘాలు నిరసన తెలుపుతున్నాయి.

ప్రైవేటుతో పోటీ సాధ్యమా!

సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకుల్లో నిక్షేపాలను వెలికితీయడానికి అన్వేషణ, భూసేకరణ కోసం యాజమాన్యం ఇప్పటికే రూ.750 కోట్లు ఖర్చు చేసింది. వీటికి వేలం నిర్వహిస్తే ఉత్పత్తి విలువలో 4 శాతం చెల్లించి పాల్గొనాల్సి ఉంటుంది. వేలంలో ప్రైవేటు సంస్థలు ఎక్కువ కోట్‌ చేసి బ్లాకులను దక్కించుకుంటాయని.. ప్రభుత్వరంగ సంస్థలు వెనకబడిపోతాయని కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రైవేటు సంస్థలు కొంతకాలం తక్కువ ధరకు అమ్మినా.. ఆ తర్వాత బాగా పెంచుతాయని వారు చెబుతున్నారు. ఫలితంగా విద్యుదుత్పత్తి ఖర్చు పెరుగుతుందని, సిమెంటు, ఇతర పరిశ్రమల ఉత్పత్తి వ్యయం పెరిగి ద్రవ్యోల్బణం దిశగా పయనించే ప్రమాదం ఉందని నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని