Updated : 03/12/2021 04:56 IST

అనుచిత ప్రవర్తనను అడ్డుకోవడం అప్రజాస్వామికమా!

1962-2010 మధ్య 11 సందర్భాల్లో సభ్యులపై చర్యలు
అవన్నీ సమర్థనీయం కాకుంటే అన్నిమార్లు ఎందుకు చేశారు!
ఎంపీల సస్పెన్షన్‌పై వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు

సభను అపవిత్రం చేసే చర్యలను ప్రజాస్వామ్యమని.. వాటిని నిరోధించడం అప్రజాస్వామ్యమని ప్రచారం చేయడం దురదృష్టకరం. దేశ ప్రజలు ఇలాంటి కొత్త పోకడలను సమర్థించరని విశ్వసిస్తున్నా.

- రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు


దిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఎగువ సభ కార్యకలాపాలకు తీవ్ర అవరోధం కలగడంపై రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యుల అనుచిత ప్రవర్తనను అడ్డుకోవడం అప్రజాస్వామికం ఎలా అవుతుందని ప్రశ్నించారు. 12 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ సభలో వరుసగా నాలుగో రోజు కూడా నిరసనలు కొనసాగాయి. వీటి కారణంగా గురువారం సమావేశం ప్రారంభమైన వెంటనే రాజ్యసభ 50 నిమిషాల పాటు వాయిదా పడింది. ‘‘12 మంది సభ్యుల సస్పెన్షన్‌ను విపక్ష నేతలు అప్రజాస్వామ్యంగా ఎలా అభివర్ణిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి చర్య తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన తీర్మానాలను కొనసాగించడం కోసం 1962 నుంచి 2010 వరకు 11 సందర్భాల్లో అవరోధం కలిగిస్తున్న సభ్యులను సస్పెండ్‌ చేశారు. అవన్నీ అప్రజాస్వామిక చర్యలేనా? అలాగైతే.. అన్నిసార్లు సభ్యులను ఎలా సస్పెండ్‌ చేశారు’’అని వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. నిరసన వ్యక్తం చేస్తున్న సభ్యులు.. సస్పెన్షన్‌ విధించటానికి దారితీసిన కారణాలపై సభలో కానీ, వెలుపల కానీ ఒక్కమాట కూడా మాట్లాడలేదని ఆక్షేపించారు. ‘తమ అనుచిత ప్రవర్తనపై సభ్యులు కనీసం మీడియా సమావేశాల్లో కూడా విచారం వ్యక్తం చేయకపోవడం బాధాకరం. క్షమాపణ కోరకుంటే సభా నిబంధనల ప్రకారం వారిపై సస్పెన్షన్‌ను ఎత్తివేయడం సాధ్యంకాద’ని పేర్కొన్నారు. అధికార, విపక్ష సభ్యులు చర్చించుకొని ప్రస్తుత ప్రతిష్టంభనను తొలగించేంద]ుకు ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశారు. సభ్యుల సస్పెన్షన్‌ అంశంపై మాట్లాడేందుకు విపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గేను అనుమతించాలని కాంగ్రెస్‌ ఎంపీలు డిమాండ్‌ చేయగా వెంకయ్యనాయుడు నిరాకరించారు. దీనిపై ఖర్గే ఇప్పటికే మాట్లాడారని తెలపడంతో  కాంగ్రెస్‌ సభ్యులు సభామధ్యంలోకి దూసుకెళ్లారు.

గురువారం రాజ్యసభలో చర్చలు

ఆనకట్టల భద్రత బిల్లుకు ఆమోదం

దేశంలో ఎంపిక చేసిన ఆనకట్టల భద్రత పర్యవేక్షణ, నిర్వహణ, వాటిపై నిరంతర నిఘాకు సంస్థాగతమైన యంత్రాంగం ఏర్పాటు కోసం రూపొందించిన బిల్లుకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. రాష్ట్రాల హక్కులను హరించేలా ఉన్న ఈ బిల్లును పార్లమెంటరీ సెలెక్ట్‌ కమిటీకి పంపించాలని చర్చ సందర్భంగా కాంగ్రెస్‌, టీఎంసీ, డీఎంకే సభ్యులు డిమాండ్‌ చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ బిల్లును సభలో ప్రవేశపెట్టిన అనంతరం సభ్యులు దీనిపై చర్చించారు. బిల్లులోని నిబంధనలను మార్చాల్సి ఉందని, దానిని సెలెక్ట్‌ కమిటీకి పంపించాలంటూ డీఎంకే నేత తిరుచ్చి శివ సవరణలను ప్రతిపాదించారు. ఆనకట్టల భద్రత కోసం ఏర్పాటు చేసే జాతీయ స్థాయి కమిటీ, అధికార యంత్రాంగం నియంత్రణ మొత్తం కేంద్ర ప్రభుత్వ గుప్పిట్లో ఉంటుందన్నారు. కాంగ్రెస్‌, టీఎంసీ సభ్యులు కూడా బిల్లుకు సవరణలు చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం, ఏఐడీఎంకే, ఆర్జేడీ, ఎండీఎంకే సభ్యులు బిల్లును  పూర్తిగా వ్యతిరేకించారు. సెలెక్టు కమిటీకి పంపించాలన్న తీర్మానానికి వ్యతిరేకంగా 80 ఓట్లు రాగా అనుకూలంగా 26 ఓట్లే వచ్చాయి. సవరణలు చేసినందున ఈ బిల్లును మరోసారి లోక్‌సభకు పంపించనున్నారు.

పార్లమెంటు ఎదుట ధర్నాలో ప్రతిపక్ష సభ్యులతో కలిసి కూర్చొన్న రాహుల్‌గాంధీ 

మద్దతుధరలపై వాకౌట్‌

అధిక ధరలు, ద్రవ్యోల్బణం, రైతుల సమస్యలపై రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్‌ చేశారు. ఈ అంశాలపై చర్చించాలన్న డిమాండ్‌ను డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ తిరస్కరించడంతో తొలుత కాంగ్రెస్‌ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోగా టీఎంసీ, తెరాస, డీఎంకే, వామపక్షాల సభ్యులూ వారిని అనుసరించారు. రైతుల సమస్యలపై నిరసనను తెరాస సభ్యులు లోక్‌సభలో గురువారం కూడా కొనసాగించారు. ప్రశ్నోత్తరాల సమయం వాయిదా పడలేదు. ప్రస్తుత సమావేశాల్లో లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయం పూర్తిగా కొనసాగడం ఇదే తొలిసారి.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని