ఆరున్నరేళ్లయినా అతీగతీ లేదు

ఏకంగా రూ.25 కోట్ల కుంభకోణం..జిల్లా కలెక్టర్‌ పరిశీలించి నివేదిక ఇచ్చారు.. ఆరోపణలపై దర్యాప్తు చేసి మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని సీబీసీఐడీకి ప్రభుత్వం అప్పగించింది.. ఆదేశాలు జారీ చేసి ఆరున్నరేళ్లయ్యింది..

Published : 04 Dec 2021 02:46 IST

నల్గొండ కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో రూ.25 కోట్ల అక్రమాలు
దర్యాప్తులో సీబీసీఐడీ నిష్క్రియాపరత్వం
వెల్లువెత్తుతున్న విమర్శలు
ఈనాడు - హైదరాబాద్‌

కంగా రూ.25 కోట్ల కుంభకోణం..జిల్లా కలెక్టర్‌ పరిశీలించి నివేదిక ఇచ్చారు.. ఆరోపణలపై దర్యాప్తు చేసి మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని సీబీసీఐడీకి ప్రభుత్వం అప్పగించింది.. ఆదేశాలు జారీ చేసి ఆరున్నరేళ్లయ్యింది.. కానీ ఇప్పటివరకు అతీగతీ లేదు.. అసలు ఈ కేసు ఏమైందని సమాచారహక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తే, రెండు నెలల్లో దర్యాప్తు పూర్తవుతుందని, ఈ దశలో వివరాలు ఇవ్వడం కుదరని సమాధానం వచ్చింది. ఈ మాట చెప్పి రెండేళ్లయ్యింది. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమైనట్లు తేల్చి మరింత లోతుగా దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించి సంవత్సరాలు గడుస్తున్నా అడుగు ముందుకు పడకపోవడం చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 2015 ఏప్రిల్‌ తొమ్మిదిన వ్యవసాయ, సహకారశాఖ ముఖ్యకార్యదర్శి జీఓఎంఎస్‌-18 జారీ చేశారు. ‘‘నల్గొండ జిల్లా కేంద్ర సహకారబ్యాంకు పరిధిలోని దేవరకొండ బ్రాంచి మేనేజర్‌ ప్రాథమిక సహకార సంఘాలకు రుణాలు పంపిణీ చేయడంలో తీవ్ర అవకతవకలకు పాల్పడ్డారు. రూ.17.81 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయని జిల్లా సహకార బ్యాంకు అధికారుల విచారణలో తేలింది. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని, వేరే సంస్థకు అప్పగించాలని దర్యాప్తు చేసిన అప్పటి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సూచించారు. 2014 జనవరి పదిన జరిగిన నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మేనేజింగ్‌ కమిటీ.. 2009 నుంచి 2013 వరకు జరిగిన అక్రమాలపై సీబీసీఐడీ విచారణకు ఆదేశించాలని తీర్మానించింది. దీని ఆధారంగా 2014 మార్చిలో జిల్లా కలెక్టర్‌ నుంచి వచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకొని చివరకు రూ.25 కోట్లుగా తేలిన అక్రమాలపై విచారణను సీబీసీఐడీకి అప్పగించడంతోపాటు బాధ్యులైన వారిపై కేసులను నమోదు చేయాలని, మూడు నెలల్లోగా చర్యల సిఫార్సుకు సంబంధించిన నివేదికను అందజేయాలి’’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఆదేశించి ఇప్పటికి ఆరున్నరేళ్లు దాటినా జరిగిందేమీ లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.


సహ చట్టం పరిధిలో నిలదీసినా...

ర్యాప్తునకు సంబంధించిన వివరాలపై ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(ఎఫ్‌జీజీ) సంస్థ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసింది. మొదటిసారిగా 2016 నవంబరులో దరఖాస్తు చేస్తే సమాచారం ఇవ్వలేదు. అప్పీలు చేసినా ఫలితం లేకపోయింది. చివరకు 2017 మార్చి మూడున రెండోసారి అప్పీలు చేశారు. దీనిపై సమాచార హక్కు చట్టం రాష్ట్ర ప్రధాన కమిషనర్‌ 2018 జనవరిలో ఆదేశాలు జారీ చేశారు. ఇందులో సంబంధిత అధికారి వాదనను పేర్కొన్నారు. 2009-13 మధ్య నల్గొండ జిల్లా సహకార బ్యాంకులో జరిగిన అక్రమాలపై వివరాలు కోరారని, ఒక కేసు సీఐడీ హైదరాబాద్‌, మరో మూడు కేసులు దేవరకొండ డీఎస్పీ వద్ద ఉన్నాయని, అన్నీ ఒకదానికొకటి సంబంధం ఉన్నవని, వీటన్నిటిపైనా ఇంకా విచారణ జరుగుతోందని, రెండునెలల్లో దర్యాప్తు పూర్తవుతుందని ఆ అధికారి నివేదించారు. 45 రోజుల్లోగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రధాన కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. అధికారులు చెప్పినట్లు రెండు నెలలు కాదు కదా రెండేళ్లు దాటినా ముందడుగు పడటంలేదని, బాధ్యులపై చర్యల్లేవని ఎఫ్‌జీజీ కార్యదర్శి పద్మనాభరెడ్డి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని