అయ్యో పాపం.. కుటుంబం అంతమాయె!

ఆస్తిపాస్తులు కలిగిన ముచ్చటైన కుటుంబం. ఇప్పటికే రెండు ఇళ్లున్నాయి. ఇటీవలే కొత్తగా మూడంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నారు. దీని కోసం చేసిన అప్పులు తీర్చే విషయంలో తలెత్తిన వివాదాలు ....

Updated : 04 Dec 2021 05:59 IST

నలుగురిని మింగిన అప్పులు.. వివాదాలు
ఉరి వేసుకున్న భర్త.. ఇద్దరు పిల్లలతో చెరువులో దూకిన భార్య
సంగారెడ్డి జిల్లాలో విషాదం

ఈనాడు, సంగారెడ్డి, న్యూస్‌టుడే, జోగిపేట టౌన్‌, రామచంద్రాపురం: ఆస్తిపాస్తులు కలిగిన ముచ్చటైన కుటుంబం. ఇప్పటికే రెండు ఇళ్లున్నాయి. ఇటీవలే కొత్తగా మూడంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నారు. దీని కోసం చేసిన అప్పులు తీర్చే విషయంలో తలెత్తిన వివాదాలు ఆ కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. భర్త ఆత్మహత్య చేసుకోగా.. భార్య పిల్లలిద్దరిని చెరువులో తోసి తానూ తనువు చాలించింది.సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ఈ విషాదఘటన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌ కొత్త ఎంఐజీ కాలనీలో ఉండే చంద్రకాంత్‌ (38) టీసీఎస్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. నెలకు రూ.70 వేల వరకు జీతం వస్తోంది. భార్య లావణ్య. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రథమ్‌ (9), సర్వజ్ఞ (14 నెలలు). వీరికి ఇదే కాలనీలో రెండు ఇళ్లున్నాయి. రెండేళ్ల క్రితం ఆశోక్‌నగర్‌లో మూడంతస్తుల కొత్త ఇల్లు నిర్మించారు. ఇందుకోసం తీసుకున్న అప్పులు, చెల్లించాల్సిన నెలసరి వాయిదాల విషయమై ఏడాదిగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి.

ఇంట్లోనే ఉరేసుకున్న చంద్రకాంత్‌
ఇల్లు కట్టేందుకు చేసిన అప్పులతో పాటు క్రెడిట్‌ కార్డు బకాయిలకు సంబంధించిన చెల్లింపులపై ఇంట్లో తరచూ వాగ్వాదాలు జరిగేవి. అప్పులతో తనకేం సంబంధం లేదని, ఆ కష్టమంతా మీరేపడండని చంద్రకాంత్‌ తండ్రి నాగేశ్వరరావు చెప్పడం.. మరికొన్ని ఇతర కారణాలు చివరికి నలుగురి ప్రాణాలకు తీశాయి. అమీన్‌పూర్‌లో తండ్రి కొత్తగా కొన్న ఇంటి గృహప్రవేశానికి వెళ్లిన లావణ్య ఈనెల 2న సాయంత్రం పిల్లలను తీసుకొని తమ ఇంటికి వెళ్లింది. అప్పటికే భర్తకు, మామకు మధ్య గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో ఆమె భర్త చంద్రకాంత్‌ తాను చనిపోతే ఈ సమస్యలన్నీ ఉండవంటూ మాట్లాడారు. ఈ పరిణామంతో లావణ్య ఇద్దరు పిల్లలను తీసుకొని ..‘ఎవరెందుకు చావాలి? మేమే వెళ్లిపోతామ’ంటూ బయటకు వచ్చేసింది. ముత్తంగి వరకు వచ్చిన తర్వాత రోడ్డుమీద వెళుతున్న ఒక వ్యక్తి ఫోన్‌ తీసుకొని తమ పక్కింటి వారికి ఫోన్‌ చేసింది. ‘నీ భర్త ఉరేసుకుని చనిపోయాడని’ వారు చెప్పగానే నిర్ఘాంతపోయింది. తనకు కొంత డబ్బు కావాలని ఫోన్‌ ఇచ్చిన వ్యక్తిని అడగ్గా.. తన వద్దలేవంటూ ఆయన సమాధానమిచ్చారు. దీంతో నడచుకుంటూ ముందుకు వెళ్లిపోయింది. అప్పటికే తన చెల్లి కనిపించడం లేదని ఆమె సోదరి సౌజన్య రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రంతా వెతికినా ఆచూకీ తెలియలేదు. శుక్రవారం ఉదయం అందోలులోని పెద్ద చెరువులో ఒక మహిళ, బాబు శవాలు తేలాయి. చెరువులో పడి చనిపోయింది లావణ్య, ఆమె ఇద్దరు పిల్లలేనని పోలీసులు నిర్ధారించారు. తన కుమారుడు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడని నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చంద్రకాంత్‌ మృతదేహానికి పటాన్‌చెరులో, లావణ్య, ఇద్దరు పిల్లల మృతదేహాలకు జోగిపేట ప్రాంతీయ ఆసుపత్రిలో శవపరీక్షలు నిర్వహించారు.

ఏడాదికాలంలో రూ.42 లక్షలు ఇచ్చా
తన కూతురు సంసారం బాగుండాలని ఏడాదికాలంలో రూ.42 లక్షలు చంద్రకాంత్‌కు ఇచ్చానని లావణ్య తండ్రి, నిజామాబాద్‌ జిల్లాకు చెందిన రాజేంద్రప్రసాద్‌రావు తెలిపారు. తమ వియ్యంకుడి వ్యవహారశైలి వల్లే ఈ దారుణం చోటు చేసుకుందన్నారు. గతంలోనూ చంద్రకాంత్‌ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించినట్లు తన కుమార్తె చెప్పిందన్నారు. అందుకే వారికి అండగా నిలిచే ప్రయత్నం చేశానన్నారు. అయినా తన కుమార్తె కుటుంబం ఇలా ఆగమైపోయిందని ఆయన విలపించారు.


నాలుగు రోజుల క్రితమే నచ్చజెప్పి వచ్చా

నేను నాలుగు రోజుల క్రితమే వాళ్ల ఇంటికి వెళ్లి వచ్చా. లావణ్య దంపతులతో పాటు నాగేశ్వరరావుతో విడివిడిగా మాట్లాడాను. తక్షణం చెల్లించాల్సిన అప్పులు రూ.15 లక్షల వరకు ఉన్నాయని చంద్రకాంత్‌ చెప్పాడు. వారికి మునిపల్లి మండలంలో 12 ఎకరాల భూమి ఉంది. రెండెకరాలు అమ్మి అప్పులు తీర్చుకోవాలని సలహా ఇచ్చా. అందుకు వాళ్ల తండ్రి నాగేశ్వరరావు ఒప్పుకోలేదు. పైగా లావణ్య, చంద్రకాంత్‌లను తన ఇంటి నుంచి వెళ్లిపొమ్మన్నారు. చివరకు వారు లోకాన్నే విడిచిపెట్టి వెళ్లారు.

- మధుసూదన్‌రావు, లావణ్య బాబాయ్‌


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు