టికెట్ల ధరల పెంపుపై త్వరలో నిర్ణయం

తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. రాష్ట్రంలో సినిమా టికెట్‌ ధరలు తగ్గించబోమని, ఎక్కడో ...

Updated : 04 Dec 2021 11:18 IST

సినిమా థియేటర్ల సామర్థ్యంపై ఆంక్షలు లేవు
సినీ ప్రముఖులతో మంత్రి తలసాని

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. రాష్ట్రంలో సినిమా టికెట్‌ ధరలు తగ్గించబోమని, ఎక్కడో ఎవరో ధరలు తగ్గించారని ఇక్కడ దానిని పాటించాల్సిన అవసరం తమకు లేదన్నారు. సినిమా టికెట్ల ధరల సవరణ నిమిషాల్లో జరిగే పని కాదని, దీనిపై వివిధ రాష్ట్రాలలో అధ్యయనం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తామన్నారు. ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు ఇబ్బంది కలగని రీతిలో ప్రభుత్వ నిర్ణయం ఉంటుందన్నారు. శుక్రవారం పలువురు సినీ దర్శక, నిర్మాతలు మంత్రి తలసానితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, సినిమా టికెట్‌ ధరలు, థియేటర్లపై ఆంక్షలు, సంక్రాంతికి భారీ బడ్జెట్‌ సినిమాల విడుదల దృష్ట్యా టికెట్ల ధరల పెంపుదల తదితర అంశాలపై చర్చించారు. సినిమా నిర్మాణ వ్యయాలు అధికమయ్యాయని, థియేటర్ల నిర్వహణ ఖర్చు కూడా గతంలో కన్నా అనేక రెట్లు పెరిగిందని, కరోనా వల్ల రెండేళ్ల పాటు పరిశ్రమ పూర్తిగా నష్టాల ఊబిలో కూరుకుపోయిందని తెలిపారు. కొవిడ్‌ మూడో దశ ముప్పు వల్ల థియేటర్ల సామర్థ్యం 50 శాతం చేస్తారని ప్రచారం జరుగుతోందని, సంక్రాంతి వరకు పెద్ద సినిమాలున్నాయని, పరిశ్రమను ఆదుకునేందుకు టికెట్‌ ధరల పెంపుపై ఒక నిర్ణయం తీసుకొని సినిమారంగాన్ని ఆదుకోవాలని వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు. తలసాని మాట్లాడుతూ.. కరోనా దృష్ట్యా థియేటర్లపై ఆంక్షలు పెడతారన్నది అపోహ మాత్రమేనన్నారు. కొవిడ్‌ కారణంగా రెండేళ్లుగా కష్టాల్లో ఉన్న పరిశ్రమ ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పరిస్థితుల్లో ఒమిక్రాన్‌ వస్తోందని.. ప్రజలతో పాటు దర్శక నిర్మాతలు, థియేటర్ల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లక్షల మందికి ఉపాధి కల్పించే చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మంత్రితో సమావేశమైన వారిలో సినీ ప్రముఖులు ఎస్‌ఎస్‌ రాజమౌళి, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, దిల్‌ రాజు, డీవీవీ దానయ్య, సూర్యదేవర రాధాకృష్ణ, సునీల్‌ నారంగ్‌, నవీన్‌, వంశీ, ప్రమోద్‌, అభిషేక్‌, బాలగోవింద రాజు, తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యదర్శి అనుపమ్‌ రెడ్డి తదితరులున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని