కాడి దించేస్తున్న ‘కౌలు రైతు!’

యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై నెలకొన్న గందరగోళంతో సాగుపై ప్రభావం పడుతోంది. వరి నాట్లు వేసే విషయంలో సొంత భూమి ఉన్న రైతులు ఆచితూచి ధైర్యం చేస్తుంటే.. కౌలుదారులు వెనకడుగు వేస్తున్న పరిస్థితి. దీంతో

Published : 04 Dec 2021 05:18 IST

గిట్టుబాటు కాదంటూ నిరాసక్తత
తక్కువకు ఇచ్చేందుకు ముందుకు వస్తున్న యజమానులు
వరి కొనుగోళ్లపై వివాదం ప్రభావం
ఈనాడు, నిజామాబాద్‌

యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై నెలకొన్న గందరగోళంతో సాగుపై ప్రభావం పడుతోంది. వరి నాట్లు వేసే విషయంలో సొంత భూమి ఉన్న రైతులు ఆచితూచి ధైర్యం చేస్తుంటే.. కౌలుదారులు వెనకడుగు వేస్తున్న పరిస్థితి. దీంతో తమ పొలాలు పడావుగా మారే ప్రమాదం ఉందని గ్రహించిన యజమానులు ధరలు తగ్గించేందుకు అంగీకరిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దాదాపు ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి.  

ఒప్పందాలు ఆలస్యం..
ప్రభుత్వాల వైఖరితో రైతులు అయోమయంలో పడ్డారు. మెట్ట ప్రాంతాల్లో ఆరుతడి పంటలు వేయాలని అధికారులు చెబుతున్నారని.. కానీ, విత్తన లభ్యతపై మాట్లాడట్లేదని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కౌలు ఒప్పందాల్లో ముందడుగు పడటం లేదు. పెట్టుబడి ఎకరాకు రూ.30 వేలకు చేరింది. ఈ పరిస్థితుల్లో యాసంగిలో వరి వేసి సర్కారు కొనకుంటే తాము దళారుల దోపిడీకి గురవడం ఖాయమని కౌలుదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

గ్రామ కమిటీల తీర్మానాలు
సమస్య ఉన్న ప్రాంతాల్లో కొన్నిచోట్ల గ్రామాభివృద్ధి కమిటీలు రంగంలోకి దిగి ఇరుపక్షాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటున్నాయి. యాసంగిలో సాధారణంగా ఎకరానికి 70 కేజీలవి 13-15 బస్తాల వడ్లు, లేదా రూ.13-15 వేల డబ్బులు కౌలుగా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మెట్ట ప్రాంతాల్లో ఆరు బస్తాలు, మాగాణిలో అయితే 8 బస్తాలు ఇవ్వాలని పలుచోట్ల కమిటీలు నిర్ణయించాయి.  


ఉమ్మడి జిల్లాల వారీగా ఇలా..

మ్మడి జిల్లాల వారీగా యాసంగిలో వరి సాగుపై అధికారులు ఇప్పటికే అంచనాలు వేస్తున్నారు. నిజామాబాద్‌లో 5 లక్షల ఎకరాల్లో వరి వేస్తారని అంచనా. ఇందులోనూ కౌలు వ్యవసాయం 30 శాతంగా ఉంది. ఖమ్మంలోనూ 30 శాతం కౌలు కిందే ఉంటోంది. వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాల్లో 20-25 శాతం కౌలు వ్యవసాయం కొనసాగుతోంది. తమకున్న కొంత పొలానికి తోడు మరో రైతు భూమిని కౌలు తీసుకొని సాగు చేస్తూ జీవిస్తున్న రైతులే ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సందిగ్ధంలో వీరు కౌలు చేసేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.


కౌలు వదులుకున్నా..
- చుంచు మల్లయ్య, హసన్‌పర్తి, హనుమకొండ జిల్లా

నాలుగు ఎకరాలు కౌలు తీసుకున్నా. వానాకాలంలో పడ్డ ఇబ్బందులు చూశాక ఆందోళనగా ఉంది. ఇక్కడ వరి తప్ప ఇతర పంటలు పండవని అధికారులకూ తెలుసు. చేసేదేమీ లేక కౌలు వదులుకున్నా.


సొంతభూమికే పరిమితమయ్యాం..
- కార్తీక్‌, దేవరకాద్ర, మహబూబ్‌నగర్‌ జిల్లా

మాకు ఏడెకరాల పొలం ఉంది. పక్క రైతుకు చెందిన ఆరెకరాలు కొంతకాలంగా కౌలు చేస్తున్నాం. ఇప్పుడు వరి వద్దంటున్నారు. వేసినా అమ్ముకొనే పరిస్థితి ఉండదు కనుక సాగు తగ్గించుకోవాలని అనుకున్నాం. కౌలు నుంచి తప్పుకొన్నాం. సొంతభూమికే పరిమితమయ్యాం.


వరి తప్ప వేరే పండదు
-ప్రవీణ్‌కుమార్‌, రుద్రూర్‌, నిజామాబాద్‌ జిల్లా

నాకున్న ఐదెకరాలతోపాటు మరో పాతిక ఎకరాలు కౌలు చేస్తుంటాను. మేము కౌలు చేసే భూములు చెరువు కింద ఉంటాయి. వరి తప్ప ఏది వేసినా పండదు. యాసంగిలో ఇది వరకు 13 సంచులు ఇచ్చేవాళ్లం. ఇప్పుడు గిట్టుబాటు కాదని చెప్పి ఎకరాకు రూ.8 వేలు చొప్పున ఇస్తానని ఒప్పించా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని