‘న్యాయ వ్యవస్థ’పై కుట్రలా ఉంది

న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా, న్యాయమూర్తులను అసభ్యకరంగా దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన ఆరుగురు నిందితులకు బెయిలు మంజూరు చేయడానికి ఏపీ

Published : 05 Dec 2021 04:40 IST

వారి పోస్టింగులను జ్యుడిషియరీపై దాడిగా భావించాలి

నిందితులకు బెయిలు నిరాకరించిన ఏపీ హైకోర్టు

ఈనాడు, అమరావతి: న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా, న్యాయమూర్తులను అసభ్యకరంగా దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన ఆరుగురు నిందితులకు బెయిలు మంజూరు చేయడానికి ఏపీ హైకోర్టు నిరాకరించింది. వారు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ నవంబరు 30న ఈ మేరకు తీర్పు ఇచ్చారు.  ఈ కేసులో ఏడో నిందితుడు గుంటూరు పట్టాభిపురానికి చెందిన అవుతు శ్రీధర్‌రెడ్డి, ఎనిమిదో నిందితుడు హైదరాబాద్‌కు చెందిన జలగం వెంకట సత్యనారాయణ, ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన తొమ్మిదో నిందితుడు గూడ శ్రీధర్‌రెడ్డి, పన్నెండో నిందితుడు హైదరాబాద్‌కు చెందిన సుస్వరం శ్రీనాథ్‌, పదమూడో నిందితుడు కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన దరిశ కిశోర్‌కుమార్‌రెడ్డి, పద్నాలుగో నిందితుడు హైదరాబాద్‌కు చెందిన సుద్దులూరి అజయ్‌ అమృత్‌లను సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న నిందితులు బెయిలు మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్లు వేశారు. ‘సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ సంఖ్యలో వ్యక్తులు 2020 ఏప్రిల్‌ నుంచి పోస్టులు పెట్టారు. ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. నిందితులు పెడుతున్న పోస్టులు... జడ్జిలపై వ్యక్తిగతంగా చేస్తున్నవి కాదు. ఆ పోస్టులు న్యాయవ్యవస్థపై దాడిగా భావించాల్సి ఉంది. దర్యాప్తు సీబీఐకి అప్పగించిన ఏడాది తర్వాత నిందితులను కనుగొని ఈ ఏడాది అక్టోబరు 21న అరెస్టు చేశారు. దీనినిబట్టి చూస్తుంటే పిటిషనర్లు చిన్న వ్యక్తులై ఉండొచ్చు.. కాని ఈ కుట్ర వెనుక పెద్ద తలకాయలు ఉండే అవకాశం లేకపోలేదు’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని