Published : 05/12/2021 04:40 IST

ఘంటసాల గొప్ప ఉద్యమకారుడు కూడా...

ఆయన స్వాతంత్య్ర సమరయోధులనూ ఉత్తేజితం చేశారు

మహా గాయకుడి సంస్మరణార్థం దిల్లీలో గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తా

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

పి.సుశీలకు ఘంటసాల శతజయంతి ప్రత్యేక పురస్కారాన్ని అందిస్తున్న సుప్రీంకోర్టు

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ. చిత్రంలో డా.వి.గీత, చోడవరం ఎంఎల్‌ఏ

కరణం ధర్మశ్రీ, మంత్రి శ్రీనివాసగౌడ్‌, మండలి బుద్ధప్రసాద్‌, సంజయ్‌ కిషోర్‌,

మురళీమోహన్‌, ఆర్‌.నారాయణ మూర్తి తదితరులు

రవీంద్రభార[తి, న్యూస్‌టుడే: ఘంటసాల భౌతికంగా మనల్ని విడిచి వెళ్లి యాభై ఏళ్లు కావస్తున్నా.. తెలుగువారిని, తెలుగు నేలను పాటల రూపంలో ప్రతిక్షణం పలకరిస్తూనే ఉన్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. ‘సంగమం ఫౌండేషన్‌’ ఆధ్వర్యంలో ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి వేడుకల ప్రారంభోత్సవ సభ శనివారం రాత్రి రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా గానకోకిల పి.సుశీలకు ఘంటసాల శతజయంతి ప్రత్యేక పురస్కారాన్ని అందజేశారు. మండలి బుద్ధప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రసంగిస్తూ ‘‘స్వాతంత్రోద్యమంలో 18 నెలల పాటు జైలులో ఉండి తోటి సమరయోధులను ఘంటసాల తన పాటల ద్వారా చైతన్యవంతం చేశారు. అల్లూరి సీతారామరాజు చిత్రంలో ‘తెలుగువీర లేవరా..’ పాటవింటే ఎంతో ఉత్తేజం కలుగుతుంది. ఆయన పాటల మాంత్రికుడే కాదు, గొప్ప ఉద్యమకారుడు కూడా’’అని కీర్తించారు. జీవించినంత కాలం పాడాలని.. పాడినంత కాలం జీవించాలని చెప్పినట్లుగానే ఘంటసాల తన జీవితాన్ని ముగించారని అన్నారు. దిల్లీలో ఘంటసాల సంస్మరణార్థం తన ఆధ్వర్యంలో గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తానని జస్టిస్‌ రమణ ప్రకటించారు.


అలనాటి, నేటి సినిమాలను పోల్చి చూసుకోవాలి...

తొలినాళ్లలో సినిమారంగం వివిధ సామాజిక అంశాలపై చర్చించి ప్రజల్లో చైతన్యానికి దోహదపడింది. ఇప్పుడా విలువలు కనిపించడం లేదు. అలనాటి, నేటి సినిమాలను పోల్చి చూసుకోవాల్సిన అవసరం ఉందని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. ‘పరాయిభాష నేర్చుకుంటే గొప్పవాళ్లమవుతామనే తపనలో మన భాషా సంస్కృతులు దిగజార్చేలా ప్రవర్తిస్తున్నామా.. అనిపిస్తోంది. ఆంగ్లభాష నేర్చుకుంటేనే గొప్పవాళ్లు అవుతారనే అపోహల్ని సృష్టిస్తున్నారు. నేను డిగ్రీ వరకు తెలుగులోనే చదువుకున్నాను. న్యాయవిద్యలో చేరాకే ఆంగ్లం నేర్చుకున్నా. అయినా దిల్లీ వరకు వెళ్లగలిగాన’ని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు తెలుగు నేర్పించి, వారితో మంచి పుస్తకాలు చదివించాలని సూచించారు. ‘ఓం నమో వెంకటేశా, ఓం నమో తిరుమలేశా..’ అంటూ ఘంటసాల పాడిన ప్రార్థనా గీతంతో జస్టిస్‌ రమణ తన ప్రసంగాన్ని ముగించారు.అనంతరం రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ ఘంటసాల శతజయంత్యుత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఏపీలోని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సహకారం సైతం ఉంటుందని అన్నారు. సంగమం నిర్వాహకులు సంజయ్‌కిశోర్‌ స్వాగతం పలికారు. సభలో శాంతా బయోటెక్‌ అధినేత కె.ఐ.వరప్రసాదరెడ్డి, సినీ దర్శకనిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, ఆర్‌.నారాయణమూర్తి, నటి మంజుభార్గవి, వివేకానంద ఆసుపత్రి ఎండీ డాక్టర్‌ వి.గీత కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి (97), ప్రముఖ నటుడు, నిర్మాత మురళీమోహన్‌, ‘మన ఘంటసాల’ పుస్తక రచయిత డా.పి.ఎస్‌.గోపాలకృష్ణను  సత్కరించారు. అంతకుముందు సంగీత గురువులు శశికళాస్వామి, జయశ్రీ వంద మంది బాలికలతో సమర్పించిన ఘంటసాల పాటల చరణాల విభావరి మంత్రముగ్ధులను చేసింది.  కార్యక్రమానికి ముందు రవీంద్ర భారతి ప్రాంగణంలోని ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని