ఈ నెలలోనే జోనల్‌ బదలాయింపులు

కొత్త జోనల్‌ విధానంలో భాగంగా జిల్లా స్థాయి ప్రభుత్వ ఉద్యోగులను సొంత జిల్లాలకు బదలాయించేందుకు విధివిధానాలు ఖరారయ్యాయి. హైదరాబాద్‌ మినహా మిగిలిన 32 జిల్లాల్లో సీనియారిటీ ప్రాతిపదికన ఉద్యోగులకు ఈ అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Updated : 06 Dec 2021 04:58 IST

టీఎన్జీవో, టీజీవోల సమావేశంలో సీఎస్‌ వెల్లడి

ఉద్యోగ సంఘాలతో బీఆర్‌కే భవన్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: కొత్త జోనల్‌ విధానంలో భాగంగా జిల్లా స్థాయి ప్రభుత్వ ఉద్యోగులను సొంత జిల్లాలకు బదలాయించేందుకు విధివిధానాలు ఖరారయ్యాయి. హైదరాబాద్‌ మినహా మిగిలిన 32 జిల్లాల్లో సీనియారిటీ ప్రాతిపదికన ఉద్యోగులకు ఈ అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి జిల్లా పరిధిలో పనిచేస్తున్నవారు తమ సొంత జిల్లా లేదా అందులోని మరో జిల్లాను ఎంచుకునేందుకు వెసులుబాటు కలుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవారు, దివ్యాంగులు, భార్యాభర్తలు, వితంతువులు, కారుణ్య నియామకాల్లోని వారికోసం ఐచ్ఛికాలు కల్పిస్తారు. దీనికి సంబంధించి త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఉద్యోగులకు కేడర్ల వారీ ఐచ్ఛికాలు ఇచ్చి కేటాయింపు అవకాశం కల్పిస్తామని, ఇందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వులు-2018ను అనుసరించి జిల్లాలు, జోన్‌లు, మల్టీజోన్‌లు, వివిధ శాఖల వారీగా.. పోస్టులు, ఉద్యోగుల కేటాయింపు, జోనల్‌ బదిలీలపై సీఎస్‌ ఆదివారం బీఆర్‌కే భవన్‌లో సమావేశం నిర్వహించారు. టీఎన్జీవో, టీజీవోల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్‌, మమత, ప్రతాప్‌, సత్యనారాయణ, ఇతర నేతలు సహదేవ్‌, ముజీబ్‌లతో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్‌, స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ఐజీ శేషాద్రి, ఆర్థికశాఖ కార్యదర్శి రొనాల్డ్‌రాస్‌, జీఏడీ, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొదటగా స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులోలేని జిల్లాల్లో పోస్టులు, ఉద్యోగుల కేటాయింపు చేపడతామని, కోడ్‌ ఎత్తివేశాక.. మిగిలిన జిల్లాల్లో జరుగుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా విధివిధానాలను ఆమోదించినట్లు తెలిసింది.

రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు

జోనల్‌ విధానం అమలులో భాగంగా రాష్ట్రస్థాయిలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తారు. దానికి వికాస్‌రాజ్‌ కన్వీనర్‌గా ఉంటారు. ప్రభుత్వ సలహాదారు శివశంకర్‌, వివిధ శాఖల అధిపతులు, రాష్ట్ర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. తొలిదశలో సొంత జిల్లాలకు ఉద్యోగుల బదలాయింపును చేపడతారు. జిల్లాస్థాయిలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో నోడల్‌ కమిటీ ఉంటుంది. ఉమ్మడి జిల్లా పరిధిలో కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కమిటీ సభ్యులుగా ఉంటారు. సీనియారిటీకి ప్రాధాన్యమిస్తూ.. ఐచ్ఛికాలు కల్పిస్తూ ఉద్యోగుల బదలాయింపులు చేపడతారు. ఉద్యోగులు గడువులోగా ఐచ్ఛికాలతో జిల్లా నోడల్‌ కమిటీకి దరఖాస్తు చేసుకోవాలి. నోడల్‌ కమిటీ వాటిని పరిశీలించి, ఖాళీల్లో సర్దుబాటు చేస్తుంది. పోస్టులు తక్కువగా ఉండి బదలాయింపులు కోరేవారు ఎక్కువమంది ఉంటే... సూపర్‌ న్యూమరరీ పోస్టులను సృష్టిస్తారు.  

జోనల్‌ స్ఫూర్తికి అనుగుణంగా బదలాయింపులు: మమత, రాజేందర్‌

గతంలో ఆర్డర్‌ టు సర్వ్‌ ఇతర అవసరాల దృష్ట్యా ఇతర జిల్లాల్లో పనిచేసేందుకు వెళ్లిన ఉద్యోగులు కొత్త జోనల్‌ విధానం వల్ల సొంత జిల్లాలకు వచ్చే అవకాశాన్ని కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు టీజీవో, టీఎన్జీవో అధ్యక్షులు మమత, రాజేందర్‌లు కృతజ్ఞతలు తెలిపారు. జోనల్‌ స్ఫూర్తికి అనుగుణంగా.. ఏఒక్క ఉద్యోగికీ నష్టం కలగకుండా, సీనియారిటీని పరిరక్షిస్తూ, ఐచ్ఛికాలతో దీనిని ప్రభుత్వం నిర్వహిస్తుందని, నెలలోపే ఈ ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు. త్వరలో రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్‌పై ముఖ్యమంత్రిని కలసి విన్నవిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని