
వాహనరంగానికి ఊతం
రాష్ట్రంలో కొత్తగా 11 ఆటోనగర్లు
ముంబయి, బెంగళూరు, నాగ్‌పుర్ జాతీయ రహదారుల వెంబడి 3..
మరో 8 పట్టణాలకు మంజూరు
అవుటర్ వెలుపలకు హైదరాబాద్ ఆటోనగర్
వరంగల్‌లో యూనిట్లు శివారుకు తరలింపు
ఈనాడు, హైదరాబాద్
రాష్ట్రంలో వాహనాల సంఖ్య, క్రయవిక్రయాలు ఏటేటా పెరుగుతున్నాయి. ఈ రంగానికి ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 11 ఆటోనగర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్ నుంచి ముంబయి, బెంగళూరు, నాగ్‌పుర్ జాతీయ రహదారుల వెంబడి ఒక్కోటి చొప్పున 3, మరో 8 పట్టణాలకు వీటిని మంజూరు చేసింది. జాతీయ రహదారుల వెంబడి యూనిట్లకు 30 ఎకరాలు, పట్టణాల్లో 10 ఎకరాల చొప్పున కేటాయించింది. వచ్చే ఆరు నెలల్లో కొత్త వాటిని ఏర్పాటు చేయడంతో పాటు వాహనాల సంఖ్యకు అనుగుణంగా భవిష్యత్తులో అన్ని నగరాలు, పట్టణాలకు ప్రభుత్వం వాటిని విస్తరిస్తుందని పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
రాష్ట్రంలో అన్ని రకాల పెట్రోల్, డీజిల్ వాహనాల సంఖ్య 1.50 కోట్లకు చేరుకుంది. మరో పది వేల ఎలక్ట్రిక్ వాహనాలు కొత్తగా వచ్చాయి. ప్రస్తుతం ఈ రంగంలో పది లక్షల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. వెయ్యి లోపు సర్వీసింగ్ సెంటర్లు, రెండు లక్షల మందికి పైగా ప్రైవేటు మెకానిక్‌లు ఉన్నారు. నగరాల్లో, పట్టణాల్లో బస్సులు, లారీలు, కార్లు తదితర వాహనాల మరమ్మతులు, ఇతర సేవలకు ఇబ్బందులెదురవుతున్నాయి. సిబ్బందికి వసతి సమస్యగా మారుతోంది. వీటన్నింటిపై అధ్యయనం చేసిన పరిశ్రమల శాఖ.. వాహనరంగానికి ప్రాధాన్యమివ్వడంతోపాటు వాటిపై ఆధారపడిన వారి కోసం, కొత్తగా ఉపాధి కల్పనకు ఆటోనగర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
కొత్తవి ఎక్కడెక్కడ..
ముంబయి జాతీయ రహదారిపై (సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఐనోల్ గ్రామం వద్ద), బెంగళూరు, నాగ్‌పుర్ జాతీయ రహదారుల వెంబడి; కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ (ఇటీవలే శంకుస్థాపన చేశారు), పెద్దపల్లి జిల్లా రామగుండం, నల్గొండ జిల్లా మిర్యాలగూడ, కామారెడ్డి జిల్లా బాన్సువాడ, వికారాబాద్ జిల్లా, కామారెడ్డి, జనగామ, జగిత్యాల
అన్ని సౌకర్యాలతో..
ఆటోనగర్ల నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) నిర్వహిస్తుంది. కొత్త ఆటోనగర్లలో వాహనాలు, వాటి పరికరాల విక్రయ కేంద్రాలతో పాటు సర్వీసింగ్, రిపేరింగ్ సెంటర్లు, ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ స్టేషన్లు, పెట్రోలు బంకులు ఏర్పాటు చేస్తారు. రహదారులు, నీటిసరఫరా, మురుగునీటిపారుదల, పార్కింగ్, వేయింగు మిషన్ల సౌకర్యం కల్పిస్తారు.
ప్రస్తుతం హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, బోధన్‌లలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆటోనగర్లు ఉన్నాయి. వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం తదితర చోట్ల ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో చిన్న చిన్న యూనిట్లుగా నడుస్తున్నాయి. హైదరాబాద్, వరంగల్ ఆటోనగర్ల చుట్టూ జనావాసాలు భారీగా పెరిగాయి. దీంతో వాహనాల పార్కింగ్, కాలుష్య సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్, వరంగల్ యూనిట్లను శివారు ప్రాంతాలకు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ ఆటోనగర్ కోసం అవుటర్‌రింగ్‌రోడ్డు బయట 50 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు.