
చొరబాట్ల కట్టడే లక్ష్యం
మావోయిస్టులపై పోలీసుల పటిష్ఠ కార్యాచరణ
ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో విస్తృతంగా గాలింపులు
ఈనాడు, హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్ నుంచి మావోయిస్టుల చొరబాట్లను అడ్డుకునేందుకు తెలంగాణ పోలీసుశాఖ పటిష్ఠ కార్యాచరణ చేపట్టింది. పార్టీలో కొత్తవారి నియామకాల కోసం వారు చిన్న, చిన్న బృందాలుగా ఏర్పడి ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోకి ప్రవేశించవచ్చన్న సమాచారం మేరకు.. ఛత్తీస్‌గఢ్‌ను ఆనుకొని ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో గాలింపు విస్తృతం చేశారు. సీఆర్‌పీఎఫ్ బలగాలతో కలిసి కూంబింగ్ నిర్వహించడంతో పాటు గోదావరి పరీవాహక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. ఇటీవల డీజీపీ మహేందర్‌రెడ్డి స్వయంగా ఈ ప్రాంతాల్లో పర్యటించి పోలీసు బలగాలకు అవసరమైన సూచనలు చేశారు.
రాష్ట్రంలో పట్టు సాధించేందుకు మావోయిస్టులు చేస్తున్న యత్నాలు ఫలించడం లేదు. అరెస్టులు, లొంగుబాట్లు, ఎన్‌కౌంటర్లతో పార్టీ బలహీనపడుతోంది. ముఖ్యంగా తెలంగాణలో పెద్దగా ప్రభావం చూపించలేకపోతోంది. మావోయిస్టు పార్టీలో గత కొంతకాలంగా కొత్తగా ఎవరూ చేరకపోవడంతో క్షేత్రస్థాయిలో బలహీనపడింది. అందుకే నియామకాలు పెంచుకునేందుకు యత్నిస్తోందని పోలీసులు భావిస్తున్నారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు ఆదెల్లు అలియాస్ భాస్కర్ ఇటీవల కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కొన్ని రోజులపాటు మకాం వేసి పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. కడంబ ప్రాంతంలో జరిగిన కాల్పుల నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. స్థానిక నియామకాలు పెంచేందుకు ఆదెల్లు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. జిల్లా అంతటా విస్తృతంగా తనిఖీలు చేపట్టడంతో మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లాడు. అయితే గత కొంతకాలంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను ఆనుకొని ఉన్న సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు మళ్లీ పెరిగాయి. తమ ఉనికి చాటుకునేందుకు వారు అభివృద్ధి పనులను అడ్డుకోవడం, కరపత్రాల పంపిణీ చేస్తున్నారు. ఇవన్నీ తమ దృష్టి మళ్లించేందుకేనని, వీటి మాటున ప్రత్యేక బృందాలను రాష్ట్రంలోకి చొప్పించేందుకు యోచిస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. చొరబాట్లను అడ్డుకోగలిగితే నియామకాలు చేపట్టలేరని, మావోయిస్టులను బలం పుంజుకోకుండా నిలువరించవచ్చన్నది పోలీసుల ఆలోచన. ఇందుకోసం వారు విస్తృత గాలింపులు చేపడుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.