విద్యుదుత్పత్తిలో జిగేల్‌!

విద్యుదుత్పత్తికి సంబంధించి రెండు కేటగిరీల్లో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. పవర్‌ ప్లాంట్లు మూడు విభాగాల కింద ఉంటాయి. అవి ప్రయివేటువి, కేంద్రానివి, రాష్ట్రానివి. కేంద్ర వాటా కొంత ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న సింగరేణి..

Published : 06 Dec 2021 04:59 IST

దేశంలోనే సింగరేణి టాప్‌
రెండో స్థానంలో తెలంగాణ

కొత్తగూడెంలోని జెన్‌కో విద్యుత్‌ కేంద్రం

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుదుత్పత్తికి సంబంధించి రెండు కేటగిరీల్లో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. పవర్‌ ప్లాంట్లు మూడు విభాగాల కింద ఉంటాయి. అవి ప్రయివేటువి, కేంద్రానివి, రాష్ట్రానివి. కేంద్ర వాటా కొంత ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న సింగరేణి.. రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యాల కింద ఉన్న విద్యుత్‌ కేంద్రాల విభాగంలో అగ్రగామిగా ఉంది. అలాగే రాష్ట్రాల వారీ జెన్‌కోలలో కూడా తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ప్రతి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం స్థాపిత సామర్థ్యంలో ఎంత శాతం మేర విద్యుదుత్పత్తి చేస్తున్నారనే అంశాన్ని ‘ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌’(పీఎల్‌ఎఫ్‌) కింద కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. ఉదాహరణకు 1,000 మెగావాట్ల సామర్థ్యంతో స్థాపించిన ఒక కేంద్రం గరిష్ఠంగా 800 మెగావాట్లు ఉత్పత్తి చేస్తే.. పీఎల్‌ఎఫ్‌ 80 శాతంగా ప్రకటిస్తారు. దీని ఆధారంగా ప్రతి నెలా అన్ని ప్లాంట్లకు, రాష్ట్రాలకు కేంద్రం ర్యాంకులిస్తుంది. రాష్ట్రాల యాజమాన్యాల పరిధిలో ఉన్న విద్యుత్‌ కేంద్రాల పీఎల్‌ఎఫ్‌ ర్యాంకుల జాబితాలో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021-22)లో ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకూ 8 నెలల కాలానికి 86.75 శాతం పీఎల్‌ఎఫ్‌తో సింగరేణి దేశంలోనే అగ్రస్థానం పొందగా.. 74.20 శాతంతో తెలంగాణ రెండో, పశ్చిమ బెంగాల్‌ 69.45 శాతంతో మూడో స్థానంలో నిలిచాయి.

8 నెలల్లో 1,584 కోట్ల యూనిట్ల ఉత్పత్తి

తెలంగాణ జెన్‌కో పరిధిలోని అన్ని విద్యుత్‌ కేంద్రాలు కలిపి ఎనిమిది నెలల కాలంలో 1,584 కోట్ల యూనిట్ల కరెంటు ఉత్పత్తి అయింది. గత ఏడాది(2020-21)లో ఇదే కాలవ్యవధిలో 1,208 కోట్ల యూనిట్లే ఉత్పత్తి కావడం గమనార్హం. గత ఆరు నెలల్లో దేశంలో కొన్ని కేంద్రాలకు ఒకటి, రెండు రోజులకు సరిపోయినంత బొగ్గు కూడా అందుబాటులో లేకపోగా.. తెలంగాణ కేంద్రాలకు అలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. సింగరేణితో పాటు తెలంగాణ జెన్‌కోకు చెందిన విద్యుత్‌ కేంద్రాలన్నీ బొగ్గు గనులకు పక్కనే ఉండటం, కొరత లేకుండా నిరంతరాయంగా సరఫరా కావడం ఇందుకు కారణం. ప్లాంట్లలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా.. నిరంతరం నడిచేలా చర్యలు తీసుకోవడం వల్ల అధిక విద్యుదుత్పత్తి సాధ్యమైందని సింగరేణి డైరెక్టర్‌ విశ్వనాథరాజు ‘ఈనాడు’కు తెలిపారు. రాష్ట్రంలో అధికంగా కరెంటు ఉత్పత్తి చేసి ఇతర రాష్ట్రాలకు సైతం సరఫరా చేశామని తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని