Updated : 07 Dec 2021 05:02 IST

హైదరాబాద్‌లో జర్మనీ కాన్సులేట్‌

ఏర్పాటుకు ప్రయత్నాలు

నేరుగా మా దేశానికి విమానాలు
తెలంగాణలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తల ఆసక్తి
‘ఈనాడు’ ముఖాముఖిలో జర్మనీ రాయబారి వాల్టర్‌ జె. లిండ్నర్‌

జర్మనీకి వచ్చే భారతీయుల సంఖ్య ఏటా పెరుగుతోంది. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులు. ప్రవాసులు మా దేశ అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నారు. తెలంగాణ నుంచి వేల మంది జర్మనీలో నివసిస్తున్నారు.  జర్మనీలోని తెలంగాణ సంఘాన్ని ప్రభుత్వం గుర్తించింది.  


ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానం అత్యంత ఆకర్షణీయంగా ఉందని, ఇక్కడ పెట్టుబడులకు తమ దేశ పారిశ్రామికవేత్తలు ఆసక్తితో ఉన్నారని జర్మనీ రాయబారి వాల్టర్‌ జె.లిండ్నర్‌  తెలిపారు. హైదరాబాద్‌ నగరం ప్రపంచంలోని అద్భుత ప్రదేశాల్లో ఒకటని, చక్కటి ఆతిథ్యానికే కాక వాణిజ్య, పారిశ్రామిక, సాంస్కృతిక రంగాల్లో సుసంపన్నంగా ఉందన్నారు. హైదరాబాద్‌ ప్రత్యేకత దృష్ట్యా జర్మనీ కాన్సులేట్‌ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. జర్మనీ నుంచి హైదరాబాద్‌కు త్వరలోనే నేరుగా విమానాలు నడిచే అవకాశం ఉందన్నారు. జర్మనీ, భారత్‌ల మధ్య సంబంధాలు రోజురోజుకూ బలోపేతమవుతున్నాయని తెలిపారు. హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన ఆయన సోమవారం ‘ఈనాడు’తో మాట్లాడారు.

తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు ఎలా ఉన్నాయి?

తెలంగాణకు పారిశ్రామికంగా ఉజ్వల భవిష్యత్తు ఉంది. సమర్థ నాయకత్వం, అనేక సానుకూలతల వల్ల ఇప్పటికే ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా మారింది. పక్షం రోజుల వ్యవధిలోనే పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే విధానం ఎక్కడా లేదు. కార్యాలయాలకు వెళ్లకుండా అనుమతులు పొందడం పారిశ్రామికవేత్తల శ్రమను తగ్గిస్తుంది. మౌలిక వసతులు, సాంకేతిక, నైపుణ్య మానవవనరుల లభ్యత అదనపు ఆకర్షణలు. చాలా జర్మన్‌ సంస్థలు ఇక్కడ సొంతంగా, ఉమ్మడిగా ప్రాజెక్టులను నిర్వహిస్తున్నాయి. రెండు నెలల క్రితం రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌తో భేటీ అయినప్పుడు తెలంగాణకు పరిశ్రమలు వచ్చేందుకు సహకరించాలని కోరారు. దీనిపై నేను పారిశ్రామికవేత్తలను సంప్రదించినప్పుడు తెలంగాణ విధానాలను వారే తెలియజెప్పడం నన్ను విస్మయపరిచింది. ఇప్పుడు తెలంగాణకు పారిశ్రామికవేత్తలే అంబాసిడర్లుగా ఉన్నారు.

జర్మనీ పారిశ్రామికరంగం వాటాలో 80 శాతం చిన్న పరిశ్రమలదే. ఈ పరిస్థితి ఎలా వచ్చింది?

చిన్న పరిశ్రమలకు బలమైన పునాది ఉంది. పెద్ద పరిశ్రమలకు దీటైన ఆదాయాలు, ఎగుమతులను అవి సాధిస్తున్నాయి. ఉపాధిలోనూ పెద్దపీట వాటిదే. విద్యావంతులైన వారు పరిశ్రమల స్థాపన గురించి  ఆలోచిస్తారు. భారత్‌లో, తెలంగాణలో కూడా చిన్న పరిశ్రమలు పురోగమన పథంలో ఉన్నాయి. కీలక ప్రాజెక్టులకు హైదరాబాద్‌ నుంచి పరికరాలు అందుతున్నాయని మా పారిశ్రామిక వేత్తలు తెలిపారు.  

కరోనాను జర్మనీ ఎలా ఎదుర్కొంది?

కరోనా అన్ని దేశాలపై, అన్ని రంగాలపైనా తీవ్ర ప్రభావం చూపింది. మా పారిశ్రామికరంగానికీ సమస్యలెదురయ్యాయి. కొవిడ్‌ను ఎదుర్కోవడానికి మాస్క్‌లు, సామాజికదూరంతో పాటు టీకాలే మార్గం. మా దేశంలోనూ ప్రజలు క్రమశిక్షణతో వ్యవహరించడంతో పాటు ఆరోగ్య విధానాలను పాటించడం వల్ల కరోనాను నియంత్రించాం. 70 శాతం మందికి టీకాలు వేశారు. మరో 30 శాతం మందికి టీకాల కార్యక్రమం కొనసాగుతోంది.

భారత్‌, జర్మనీ సంబంధాలు ఎలా ఉన్నాయి?

ఇండో-జర్మన్‌లు వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నాయి. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంపై జర్మనీ వ్యూహాత్మక పత్రాన్ని భారత్‌ స్వాగతించింది. కరోనా కష్ట సమయాల్లో జర్మనీ భారతదేశానికి మద్దతునిచ్చింది. 4,00,000 లీటర్లు ఉత్పత్తి సామర్థ్యం గల ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. వాణిజ్యం, పెట్టుబడి పరంగా జర్మనీ భారత్‌కు అతిపెద్ద భాగస్వామి. ఇక్కడ రూ.1.57 లక్షల కోట్ల  మేరకు పెట్టుబడులున్నాయి. గత ఏడాది వివిధ ప్రాజెక్టుల్లో రూ. 11,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇవి ఇంకా పెరుగుతాయి.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని