టీకా తీసుకోకుంటే వేతనం బంద్‌.. కరెంట్‌ కట్‌

దేశంలో కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు పెరుగుతుండటంతో.. రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేసింది. ప్రజలు తప్పనిసరిగా టీకాలు పొందడంతో పాటు మాస్కు ధరించడం తదితర

Published : 07 Dec 2021 04:44 IST

సంగారెడ్డి జిల్లా శేఖాపూర్‌ గ్రామస్థులకు టీకాలు ఇప్పిస్తున్న అదనపు కలెక్టర్‌ రాజర్షిషా

ఈనాడు, హైదరాబాద్‌, జహీరాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: దేశంలో కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు పెరుగుతుండటంతో.. రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేసింది. ప్రజలు తప్పనిసరిగా టీకాలు పొందడంతో పాటు మాస్కు ధరించడం తదితర నిబంధనలు పాటించాలని సూచిస్తోంది. అయినప్పటికీ వ్యాక్సిన్లపై కొందరు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీకాలు తీసుకుంటేనే ఈ నెల వేతనం అందిస్తామని టెస్కాబ్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేయగా.. సంగారెడ్డి జిల్లా శేఖాపూర్‌లో వ్యాక్సిన్లు తీసుకునేందుకు నిరాకరించినవారి ఇళ్లకు అధికారులు విద్యుత్తు కనెక్షన్లు తొలగించారు.

వ్యాక్సిన్‌ ధ్రువపత్రం సమర్పిస్తేనే జీతం: టెస్కాబ్‌

కరోనా టీకాలు తీసుకుంటేనే ఈ నెల వేతనం ఇస్తామని, ఇప్పటివరకు వేయించుకోనివారు వెంటనే వ్యాక్సిన్‌ పొంది ధ్రువపత్రం సమర్పించాలని ఉద్యోగులకు ‘తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు’(టెస్కాబ్‌) తాజాగా ఆదేశాలు జారీచేసింది. ఏదైనా కారణంతో టీకా తీసుకోలేని ఉద్యోగులు.. అందుకు కారణాలు, ఆధారాల పత్రాలను వైద్యుల ధ్రువీకరణతో అందజేయాలని బ్యాంకు ఎండీ డాక్టర్‌ నేతి మురళీధర్‌ స్పష్టం చేశారు. ఉద్యోగులందరికీ టీకాలు ఇచ్చేందుకు గత జూన్‌ 12న, తిరిగి సెప్టెంబరు 24న ప్రత్యేక శిబిరాలు నిర్వహించినా కొందరు పొందలేదని తెలిపారు. ఇలాంటి నిర్లక్ష్యం వల్ల బ్యాంకులకు వచ్చే సాధారణ ప్రజలకు కరోనా సోకే అవకాశం ఉన్నందున టీకాలను తప్పనిసరి చేసినట్లు ఆయన వివరించారు.

ఇళ్లకు విద్యుత్తు కనెక్షన్ల తొలగింపు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం శేఖాపూర్‌లో గ్రామ జనాభా 4,284 కాగా.. టీకాలు పొందేందుకు అర్హులు 2,092 మంది ఉన్నారు. వీరిలో ఆదివారం వరకు 1,102 మంది మాత్రమే వ్యాక్సిన్లు తీసుకున్నారు. టీకా వేసుకోని వారికి అయిదు రోజులుగా అధికారులు అనధికారికంగా రేషన్‌ పంపిణీని నిలిపివేశారు. సోమవారం గ్రామంలో పర్యటించిన అదనపు కలెక్టర్‌ రాజర్షిషా.. అందరూ టీకా తీసుకోవాలని సూచించారు. ‘వ్యాక్సిన్‌ తప్పనిసరిగా తీసుకోవాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఏమైనా ఉన్నాయా? ఆరోగ్యం క్షీణించి మాకేమైనా అయితే ఎవరు దిక్కు’ అంటూ కొందరు స్థానికులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా నాలుగు ఇళ్ల విద్యుత్తు కనెక్షన్లను అధికారులు తొలగించారు. టీకాలు తీసుకునేందుకు వారు సమ్మతించడంతో కరెంటు సరఫరాను పునరుద్ధరించారు. గ్రామంలో సోమవారం 105 మంది టీకాలు పొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని