సంచులు నింపుతూ.. తుది శ్వాస

ధాన్యం కొంటారో లేదోనని దిగాలు పడ్డ రైతు.. చివరికి కొనుగోలు సమయంలో సంచులు నింపుతూ తుది శ్వాస విడిచారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో మంగళవారం ఈ విషాదం చోటుచేసుకుంది. 

Updated : 08 Dec 2021 15:41 IST

ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆగిన రైతుగుండె
కరీంనగర్‌ జిల్లాలో విషాదం

జమ్మికుంట, జమ్మికుంట గ్రామీణం న్యూస్‌టుడే: ధాన్యం కొంటారో లేదోనని దిగాలు పడ్డ రైతు.. చివరికి కొనుగోలు సమయంలో సంచులు నింపుతూ తుది శ్వాస విడిచారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో మంగళవారం ఈ విషాదం చోటుచేసుకుంది.  కొనుగోలు కేంద్రానికి రైతు రెండు వారాల క్రితం ధాన్యం తీసుకెళ్లారని కుటుంబసభ్యులు చెప్తుండగా..మూడు రోజులకిందే తెచ్చారని అధికారులు అంటున్నారు. రైతులు, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. కరీంనగర్‌ జిల్లా ఆబాది జమ్మికుంటకు చెందిన రైతు బిట్ల ఐలయ్య (59) జమ్మికుంట సింగిల్‌విండో కొనుగోలు కేంద్రానికి రెండు వారాల క్రితం ధాన్యం తీసుకువచ్చారు. తేమ శాతం ఎక్కువ ఉండటంతో కొనేందుకు నిర్వాహకులు తొలుత నిరాకరించారు. దాంతో కేంద్రం వద్దే ధాన్యాన్ని ఆరబోశారు. రోజూ కేంద్రానికి వచ్చి వెళ్తున్నారు. ఎట్టకేలకు నిర్వాహకులు కొనుగోలుకు అంగీకరించి మంగళవారం గోనెసంచులు ఇచ్చారు. ధాన్యాన్ని వాటిలో నింపుతున్న సమయంలో ఐలయ్యకు గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలి మరణించారు. హుజూరాబాద్‌ ఆర్డీవో రవీందర్‌రెడ్డి వివరాలను సేకరించారు. ఐలయ్య కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు జమ్మికుంట సీఐ రాంచందర్‌రావు చెప్పారు.

భాజపా నాయకుల ఆందోళన
రాష్ట్ర ప్రభుత్వం ఐలయ్య కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా వారు అంబులెన్స్‌ను అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్‌రావు మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయడంతోనే రైతు మనోవేదనతో మృతి చెందారన్నారు.


అధికారుల తప్పిదం లేదు
- శ్యామ్‌ప్రసాద్‌ లాల్‌, అదనపు కలెక్టర్‌

భగత్‌నగర్‌, న్యూస్‌టుడే: జమ్మికుంట ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు బిట్ల ఐలయ్య మృతికి సంబంధించి కొనుగోలు కేంద్రం ఇన్‌ఛార్జి, ముఖ్య కార్యనిర్వహణ అధికారులది ఎలాంటి తప్పులేదని కరీంనగర్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ లాల్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రానికి ఐలయ్య ఈ నెల 4న 10-10 రకానికి చెందిన 50 బస్తాల ధాన్యాన్ని తీసుకువచ్చారని, ఈ నెల 6న 1877 నంబరు టోకెన్‌ జారీచేశామన్నారు. మంగళవారం ఐలయ్య ధాన్యాన్ని గన్నీ సంచుల్లో నింపే సమయంలో గుండెపోటు రావడంతో ఆకస్మికంగా మృతిచెందారన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు