Updated : 08 Dec 2021 05:13 IST

PM Modi: మీరు మారకపోతే.. నేనే మార్చేస్తా

పార్లమెంటుకు హాజరుపై భాజపా ఎంపీలకు ప్రధాని హెచ్చరిక

భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా

దిల్లీ: పార్లమెంటుకు క్రమం తప్పకుండా హాజరుకావాలని భాజపా ఎంపీలకు ప్రధాని మోదీ మరోసారి నొక్కి చెప్పారు. ఎంపీలు మారాలని, లేనిపక్షంలో తామే మార్పు తీసుకొస్తామని హెచ్చరించారు. చిన్నపిల్లలు కూడా పదేపదే చెప్పించుకోవడానికి ఇష్టపడరన్నారు. దిల్లీలోని అంబేడ్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి విలేకరులకు వెల్లడించారు. పార్టీ ఎంపీలంతా తమ నియోజకవర్గాల్లో క్రీడా పోటీలు నిర్వహించాలని మోదీ సూచించినట్టు ఆయన తెలిపారు. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ... పార్టీ జిల్లా, మండల అధ్యక్షులతో తరచూ సమావేశం కావాలని ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. వారితో కలిసి తేనీరు తాగాలన్నారు. ప్రధాని మోదీ కూడా తన నియోజకవర్గమైన వారణాసిలో ఈనెల 14న పార్టీ జిల్లా, మండల అధ్యక్షులతో భేటీ అవుతారని తెలిపారు. సంప్రదాయానికి భిన్నంగా భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం తొలిసారి పార్లమెంటు వెలుపల జరిగింది. పార్లమెంట్‌ హౌస్‌ కాంప్లెక్స్‌లో మరమ్మతులు జరుగుతుండటంతో సమావేశ వేదికను మార్చారు. హోంమంత్రి అమిత్‌ షా, ఇతర నేతలు, పార్టీ ఎంపీలు హాజరయ్యారు. సమావేశంలో నేతలు మోదీకి పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. నవంబరు 15ను బిర్సా ముండా జయంతిగా నిర్వహించుకోవాలని మోదీ చేసిన ప్రకటనపై కేంద్రమంత్రి అర్జున్‌ ముండా హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రధానిని శాలువాతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు.

13న కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ ప్రారంభం
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 13న కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ను ప్రారంభించనున్నట్టు భాజపా ప్రధాన కార్యదర్శి తరుణ్‌ చుగ్‌ మంగళవారం తెలిపారు. ‘దివ్య కాశీ, భవ్య కాశీ’ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమానికి భాజపా సీఎంలు, ఉప ముఖ్యమంత్రులు హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమం దేశ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారమవుతుందని వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.‘‘పవిత్ర నగర రూపురేఖలను మార్చేందుకు సంకల్పించడం ద్వారా భారత సాంస్కృతిక హీరోగా మోదీ నిలిచారు. 250 ఏళ్ల తర్వాత కాశీ విశ్వనాథుని ఆలయ పరిసరాల్లో సుందరీకరణ, పునర్నిర్మాణ పనులు జరిగాయి. ఈ సందర్భంగా వారణాసిలో నెల రోజులపాటు వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ నెల 13-14 తేదీల్లో భాజపా ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో, 17న దేశంలోని అందరు మేయర్లతో సమావేశాలు ఉంటాయి’’ అని తరుణ్‌ చుగ్‌ పేర్కొన్నారు.

16న వారణాసిలో యూపీ మంత్రివర్గ సమావేశం
ఈనాడు, లఖ్‌నవూ: కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ ప్రారంభోత్సవం నేపథ్యంలో వారణాసిలో ఈ నెల 16న ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా కాశీ గొప్పతనాన్ని, హిందూత్వ సందేశాన్ని చాటిచెప్పేందుకు భాజపా సర్కారు ప్రయత్నిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రధాని కలల ప్రాజెక్టు...
2014 ఎన్నికల్లో వారణాసి నుంచి గెలిచిన తరువాత ప్రధాని మోదీ తన పార్లమెంటు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ను ఆయన కలల ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. వారణాసిలో మోదీ పలుమార్లు పర్యటించిన సందర్భంగా ఆలయంలో పూజలు చేయడమే కాకుండా, కారిడార్‌ నిర్మాణం విషయమై ప్రత్యేకంగా అధికారులతో మాట్లాడేవారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని