లెక్కలూ లేవు... పత్రాలూ లేవు!

కోట్ల రూపాయల ప్రజాధనం వినియోగంలో గ్రామ పంచాయతీల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో నిధుల వినియోగం, జవాబుదారీతనంలో నిర్లక్ష్యాన్ని రాష్ట్ర ఆడిట్‌ శాఖ

Published : 08 Dec 2021 04:45 IST

పంచాయతీల్లో యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన
2.12 లక్షల ఆడిట్‌ అభ్యంతరాలు
నిధుల వినియోగంలో అడ్డగోలు వ్యవహారాలు
వివరణ కోరిన ఆడిట్‌శాఖ

ఈనాడు, హైదరాబాద్‌: కోట్ల రూపాయల ప్రజాధనం వినియోగంలో గ్రామ పంచాయతీల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో నిధుల వినియోగం, జవాబుదారీతనంలో నిర్లక్ష్యాన్ని రాష్ట్ర ఆడిట్‌ శాఖ తేటతెల్లం చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని 12,789 గ్రామ పంచాయతీల ఆడిట్‌ను పూర్తి చేసిన రాష్ట్ర ఆడిట్‌ శాఖ నిధుల వ్యయం తీరు, నిబంధనల ఉల్లంఘన, రికార్డులను అందుబాటులో ఉంచకపోవడం, వసూలు చేసిన నిధులను జమచేయకపోవడం సహా వివిధ అంశాలను గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,12,651 అభ్యంతరాలను నమోదు చేసింది. వాటిపై వివరణ ఇవ్వాలని సంబంధిత పంచాయతీలకు నోటీసులు జారీ చేసింది. గ్రామ పంచాయతీలు వసూలు చేసే మొత్తాలను సంబంధిత శాఖలకు ఇవ్వకుండా తమ వద్దే ఉంచుకుంటున్న వ్యవహారాన్ని తప్పుపట్టింది. పంచాయతీల్లో నిధుల వినియోగంలో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. కోట్ల రూపాయల నిధుల వినియోగంలో ప్రధానంగా 18 అంశాలపై ఆడిట్‌ అభ్యంతరాలను వ్యక్తం చేసింది.

నగదు నిర్వహణ అధ్వానం...
పంచాయతీల్లో నగదు నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆడిట్‌శాఖ గుర్తించింది. బడ్జెట్‌లో నిర్దేశించిన గ్రాంట్‌ల కంటే ఎక్కువ మొత్తం వినియోగించారు. నిధులు విడుదల కాకముందే ఖర్చు చేయడం, ఉన్న నిధులను వినియోగించకపోవడం, కనీసం వాటిని ఖర్చు చేసేందుకు గడువు కోరకపోవడం వంటి లోపాలు అనేక పంచాయతీల్లో జరిగాయి. మరికొన్నిచోట్ల నిధుల వినియోగంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. బకాయిల వసూలు విషయంలో చట్టపరమైన చర్యల జోలికిపోకపోవడంతో అవి అలాగే ఉండిపోయాయి. ప్రత్యేక సందర్భాల్లో కాంట్రాక్టర్లకు ఇచ్చిన అడ్వాన్స్‌లను తిరిగి వసూలు చేయకపోవడం గమనార్హం.

వసూలైనవీ జమ చేయట్లేదు...
వసూలు చేసే పన్నులను సంబంధిత శాఖలకు బదిలీ చేయాల్సి ఉన్నా పంచాయతీలు ఆ నిధులను తమవద్దే ఉంచుకున్నాయి. జీఎస్టీ, ఆదాయపు పన్ను, లేబర్‌ సెస్‌, లైబ్రరీ సెస్‌లను సంబంధిత సంస్థలకు ఇవ్వలేదు. సీనరేజీ చెల్లింపులూ పాక్షికంగానే ఉన్నాయి. నిధుల వినియోగానికి సంబంధించిన ఎంబుక్‌లను ఇవ్వలేదు. ఓచర్లు లేకుండానే నిధులు డ్రా చేసిన సందర్భాలున్నాయి. ఒకే పనికి మళ్లీ మళ్లీ డబ్బులు డ్రా చేయడం, నకిలీ చలాన్ల వ్యవహారాలూ వెలుగుచూశాయి. చట్టబద్ధంగా రికవరీ చేయాల్సినవి చేయకపోగా, అనుమతించిన రేట్లకంటే ఎక్కువ చెల్లింపులు చేశారు. గ్రాంట్‌లు ఉపయోగించిన మొత్తాలకు వినియోగ సర్టిఫికెట్‌లు ఇవ్వలేదు.

అత్యధిక పంచాయతీల్లో గుర్తించిన లోపాలివి..
* వసూలు చేసి మొత్తాన్ని శాఖలకు ఇవ్వకపోవడం

* నిధుల మళ్లింపు                  

* అధిక చెల్లింపులు  

* రికార్డులు, వినియోగ సర్టిఫికెట్‌లు ఇవ్వకపోవడం

* అడ్వాన్స్‌లు సర్దుబాటు చేయకపోవడం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని