గుర్తించకముందే గుడ్డిగా కాల్చేశారు

దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన నాగాలాండ్‌ కాల్పుల ఘటనకు సంబంధించి మరిన్ని కీలక విషయాలు బయటికొచ్చాయి. వాహనంలో ఉన్నవారు పౌరులో, తిరుగుబాటుదారులో గుర్తించే ప్రయత్నం కూడా చేయకుండానే సైనికులు

Published : 08 Dec 2021 04:45 IST

మృతదేహాలను దాచిపెట్టేందుకు సైనికులు ప్రయత్నించారు
నాగాలాండ్‌ కాల్పులపై ప్రభుత్వానికి పోలీసుల నివేదిక

సైనికుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన పౌరుల మృతదేహాలకు అంత్యక్రియలు

కోహిమా, దిల్లీ: దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన నాగాలాండ్‌ కాల్పుల ఘటనకు సంబంధించి మరిన్ని కీలక విషయాలు బయటికొచ్చాయి. వాహనంలో ఉన్నవారు పౌరులో, తిరుగుబాటుదారులో గుర్తించే ప్రయత్నం కూడా చేయకుండానే సైనికులు తుపాకులకు పనిచెప్పినట్లు తెలుస్తోంది. మోన్‌ జిల్లాలో చోటుచేసుకున్న కాల్పులపై రాష్ట్ర డీజీపీ టి.జాన్‌ లాంకుమెర్‌, కమిషనర్‌ రొవిలాటువొ మోర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదివారం సంయుక్త నివేదికను సమర్పించారు. అందులోని వివరాలు తాజాగా బయటకు వెల్లడయ్యాయి. ‘‘ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. వాహనంలో ఉన్నవారు ఎవరన్నదీ గుర్తించే ప్రయత్నం కూడా చేయకుండానే బలగాలు కాల్పులు జరిపాయి. తొలుత మృత్యువాతపడ్డ ఆరుగురి మృతదేహాలను దాచిపెట్టేందుకు ప్రయత్నించాయి. భౌతికకాయాలను సైనికులు టార్పాలిన్‌ షీట్లలో చుట్టి తమ వ్యాన్‌లోకి ఎక్కిస్తుండటాన్ని గ్రామస్థులు చూశారు. సైనిక శిబిరం వద్దకు వాటిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆగ్రహంతో ఊగిపోయి దాడి చేశారు. వారి నుంచి తప్పించుకునేందుకు.. సైనికులు కాల్పులు జరుపుతూనే అస్సాం వైపు పరుగులు తీశారు’’ అని నివేదికలో పేర్కొన్నారు.

హార్న్‌బిల్‌ ఉత్సవం రద్దు
నాగాలాండ్‌లో ఈ నెల 10 వరకు కొనసాగాల్సిన హార్న్‌బిల్‌ ఉత్సవం అర్ధంతరంగా రద్దయింది. పౌరులపై కాల్పుల ఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి నీఫియు రియో అధ్యక్షతన మంగళవారం అత్యవసరంగా భేటీ అయిన రాష్ట్ర మంత్రిమండలి.. ఉత్సవానికి తక్షణమే ముగింపు పలకాలని నిర్ణయించింది. వివాదాస్పదంగా మారిన సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎఫ్‌ఎస్‌పీఏ) రద్దు చేయాల్సిందిగా కేంద్రానికి లేఖ రాయాలనీ మంత్రిమండలి తీర్మానించింది. మరోవైపు- పౌరులపై కాల్పులకు నిరసనగా నాగాలాండ్‌లోని అత్యున్నత గిరిజన సంఘం- కొన్యాక్‌ యూనియన్‌ (కేయూ) మోన్‌ జిల్లాలో మంగళవారం బంద్‌ నిర్వహించింది. బుధవారం నుంచి ఏడు రోజులపాటు సంతాప దినాలుగా పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చింది. నాగాలాండ్‌ కాల్పులపై సైన్యం జరపనున్న విచారణకు మేజర్‌ జనరల్‌ ర్యాంకు అధికారి నేతృత్వం వహించనున్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని