మోసపూరిత ఖాతాలపై దర్యాప్తు చేయొచ్చు

భారీగా రుణాలు తీసుకుని దివాలా బాటలో ఉన్న కంపెనీల మోసపూరిత బ్యాంకు ఖాతాలపై దర్యాప్తు కొనసాగించడానికి తెలంగాణ హైకోర్టు అనుమతించింది. కోస్టల్‌ ప్రాజెక్ట్స్‌, ఇంద్‌ భారత్‌, ట్రాన్స్‌ట్రాయ్‌,

Published : 08 Dec 2021 04:45 IST

తెలంగాణ హైకోర్టుఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: భారీగా రుణాలు తీసుకుని దివాలా బాటలో ఉన్న కంపెనీల మోసపూరిత బ్యాంకు ఖాతాలపై దర్యాప్తు కొనసాగించడానికి తెలంగాణ హైకోర్టు అనుమతించింది. కోస్టల్‌ ప్రాజెక్ట్స్‌, ఇంద్‌ భారత్‌, ట్రాన్స్‌ట్రాయ్‌, వీఎన్‌ఆర్‌ ఇన్‌ఫ్రా, వీఎంసీ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ల బ్యాంకు లావాదేవీలపై బ్యాంకులతో పాటు సీబీఐ, ఈడీలు దర్యాప్తు కొనసాగించవచ్చని అనుమతించింది. ఈ పిటిషన్లలో విచారణను నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది. బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టంలోని సెక్షన్‌ 35ఎ కింద రిజర్వు బ్యాంకు 2016 జులై 1న జారీ చేసిన సర్క్యులర్‌ ప్రకారం ఈ కంపెనీల ఖాతాలను మోసపూరిత ఖాతాలుగా ప్రకటించింది. ఈ సర్క్యులర్‌ను సవాలు చేస్తూ కోస్టల్‌ ప్రాజెక్ట్స్‌ తరఫున సబ్బినేని సురేంద్ర, ఇంద్‌భారత్‌ తరఫున ఎంపీ రఘురామకృష్ణరాజు, ఆయన భార్య కనుమూరు రమాదేవి, వీరవెంకట సత్యనారాయణరావు, వీఎంసీకి చెందిన బి.హిమబిందు, వీఎన్‌ఆర్‌ ఇన్‌ఫ్రాకు చెందిన వాకాటి నారాయణరెడ్డి, ట్రాన్స్‌ట్రాయ్‌కి చెందిన శ్రీధర్‌ చెరుకూరి పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అన్ని పిటిషన్లలో మధ్యంతర ఉత్తర్వులను ఎత్తేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈడీ, సీబీఐలతో పాటు బ్యాంకులూ చట్టప్రకారం కంపెనీల మోసపూరిత ఖాతాలపై దర్యాప్తు కొనసాగించవచ్చని అనుమతిస్తూ తదుపరి విచారణను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని