Published : 08/12/2021 04:45 IST

రబీ వరిసాగుపై ఎలాంటి ఆంక్షల్లేవు

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వెల్లడి

ఈనాడు, దిల్లీ: తెలంగాణలో ఈ ఏడాది రబీలో వరిసాగుపై కేంద్ర వ్యవసాయశాఖ ఎలాంటి ఆంక్షలూ విధించలేదని ఆ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు. మంగళవారం లోక్‌సభలో నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 2021 రబీలో వరిసాగు సహా ఇతర పంటల సాగుపై ఆంక్షలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఉత్తర్వులు జారీచేసిందా? అనే ప్రశ్నకు కేంద్రమంత్రి ఈ మేరకు స్పష్టంచేశారు.

పసుపు సహా ఉద్యాన రైతుల ఆదాయం పెంచడానికి చర్యలు
పసుపు రైతులతోపాటు, ఇతర ఉద్యాన పంటలు సాగుచేసే రైతుల ఆదాయం పెంచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు లోక్‌సభలో నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి వెల్లడించారు. ‘‘పసుపుతో సహా అన్ని రకాల ఉద్యానపంటల ఉత్పాదకత, నాణ్యత పెంచడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంపొందించేందుకు మిషన్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ హార్టీకల్చర్‌ (ఎంఐడీహెచ్‌)కింద రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్రం పలు కార్యక్రమాలు చేపడుతోంది. క్యాలికట్‌లోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఆర్కనట్‌ అండ్‌ స్పైస్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ అత్యధిక ఉత్పత్తి గల పసుపు వంగడాలను అభివృద్ధిచేసి రైతులకు పంపిణీచేస్తోంది’’ అని తోమర్‌ వివరించారు.


విభజన చట్టం అమలుపై 25 సార్లు సమీక్ష

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం అమలుపై సమీక్షించడానికి ఇప్పటివరకు 25 సార్లు సమావేశాలు ఏర్పాటుచేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ తెలిపారు. ఆ చట్టం అమలు పురోగతి గురించి మంగళవారం లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని అంశాలు చాలావరకు ఇప్పటికే అమలయ్యాయి. మరికొన్ని అంశాల అమలు వివిధ దశల్లో ఉంది. మౌలిక వసతుల ప్రాజెక్టులు, విద్యా సంస్థల ఏర్పాటుకు సమయం పడుతుంది. అందుకోసం చట్టంలో పదేళ్ల గడువు విధించారు. విభజన చట్టంలోని వివిధ అంశాల అమలు పురోగతిపై కేంద్ర హోంశాఖ  ఇప్పటివరకూ 25 సమీక్ష సమావేశాలు నిర్వహించింది’’ అని ఆయన వెల్లడించారు.

2020-21లో 2.39 లక్షల హెక్టార్లలో పంటనష్టం
ప్రకృతి వైపరీత్యాల కారణంగా తెలంగాణలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2.39 లక్షల హెక్టార్లలో పంటనష్టం వాటిల్లినట్లు రాష్ట్రం నుంచి సమాచారం అందిందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్‌ వెల్లడించారు.  


ప్రత్యేక హోదా, హోదాయేతర రాష్ట్రాల మధ్య పన్నుల వాటా పంపిణీలో వివక్ష లేదు

కేంద్ర పన్నుల వాటా పంపిణీలో ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదాయేతర రాష్ట్రాల మధ్య ఎలాంటి వివక్ష చూపొద్దని 14వ ఆర్థికసంఘం చెప్పినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కల్పించే అంశం గురించి తెరాస ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డి మంగళవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘‘ ఆర్థికసంఘం సిఫారసులను అనుసరించి కేంద్ర ప్రభుత్వం 2015-20 మధ్యకాలంలో రాష్ట్రాలకు పంపిణీచేసే పన్నుల వాటాను 32% నుంచి 42%కి పెంచింది. రాష్ట్రాలకు ఎదురయ్యే రెవెన్యూ లోటును పన్ను వాటా బదలాయింపు ద్వారా సాధ్యమైనంత మేరకు భర్తీచేస్తున్నాం. లోటు భర్తీకాని రాష్ట్రాలకు..రెవెన్యూలోటు గ్రాంట్లు మంజూరు చేస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు కొన్ని ఆదాయ పన్ను ప్రోత్సాహకాలను ప్రకటించాం. రెండు రాష్ట్రాల్లో గుర్తించిన(నోటిఫై) వెనుకబడిన ప్రాంతాల్లో 2015 ఏప్రిల్‌ 1 నుంచి 2020 మార్చి 31 వరకు ఏర్పాటుచేసిన పరిశ్రమల్లో నెలకొల్పే కొత్త యంత్రాలపై చేసే వాస్తవ ఖర్చుపై ఇచ్చే 20% అదనపు రాయితీని 35%కి పెంచుతూ ఆదాయపన్ను చట్టం-1961లోని సెక్షన్‌ 32ను సవరించాం’’ అని వివరించారు.
 

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని