నిమ్స్‌లో రోబోటిక్‌ సర్జరీ సౌకర్యం

నిమ్స్‌ ఆసుపత్రిలో అత్యాధునిక రోబోటిక్‌ సర్జరీ సదుపాయం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గర్భిణుల కోసం అదనంగా 200 పడకల సౌకర్యం కల్పించేందుకు

Published : 08 Dec 2021 04:45 IST

త్వరలో ఏర్పాటుచేస్తామన్న హరీశ్‌రావు
రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసులు లేవని వెల్లడి

నిమ్స్‌లో రోగిని పరామర్శిస్తున్న హరీశ్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: నిమ్స్‌ ఆసుపత్రిలో అత్యాధునిక రోబోటిక్‌ సర్జరీ సదుపాయం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గర్భిణుల కోసం అదనంగా 200 పడకల సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మంగళవారం ఆసుపత్రిని సందర్శించిన ఆయన రూ.12 కోట్లతో అందుబాటులోకి తెచ్చిన జెనెటిక్‌ ల్యాబ్‌, న్యూమాటిక్‌ ట్యూబ్‌ సిస్టం, బోన్‌ డెన్సిటో మీటర్‌, ఫిజియోథెరపీ భవనం, ఇతర పరికరాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ‘‘గతంలో నిమ్స్‌లో వెంటిలేటర్‌, సాధారణ బెడ్‌ దొరకాలంటే చాలా కష్టంగా ఉండేది.. ఇప్పుడు ఇక్కడ నాణ్యమైన వైద్యం అందుతోంది. మరో 120 వెంటిలేటర్లు 45 రోజుల్లో అందుబాటులోకి వస్తాయి. కరోనా మూడోదశ ముప్పు వచ్చినా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని వెల్లడించారు. ఆసుపత్రిలో చికిత్స పొందే రోగుల్లో 15 శాతం మంది మాత్రమే నగదుతో ప్రవేశం పొందుతున్నారని.. మిగిలిన 85 శాతం మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా సేవలందుతున్నాయని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద బోన్‌మారో శస్త్రచికిత్సలను ఉచితంగా చేస్తున్నారన్నారు.

టీకాపై సినీ తారలు ప్రచారం చేయాలి
ఇప్పటివరకు రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాలేదని మంత్రి అన్నారు. డబ్ల్యూహెచ్‌వో, ఇతర దేశాల వైద్యులు సూచించిన ప్రకారం.. ఒమిక్రాన్‌ ప్రాణాంతకం కాదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. టీకా తొలి డోస్‌ 94 శాతం, రెండో డోస్‌ 47 శాతం పంపిణీ పూర్తయిందని తెలిపారు. టీకాపై అపోహల్ని తొలగించేందుకు క్రీడాకారులు, సినీతారలు, రాజకీయ ప్రముఖులు ప్రచారం చేయాలని మంత్రి కోరారు.

ప్రతి రోగికీ భోజనం..: డయాలసిస్‌ వార్డులోని రోగులను మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ రోగి.. ఇక్కడ ఆరోగ్యశ్రీ రోగులకు మాత్రమే మధ్యాహ్న భోజనం పెడుతున్నారని మొరపెట్టుకున్నారు. వెంటనే డైరెక్టర్‌తో మాట్లాడి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రతి రోగికి మధ్యాహ్న భోజనం అందించాలని మంత్రి ఆదేశించారు. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ఆసుపత్రి డెరెక్టర్‌ మనోహర్‌, డిప్యూటీ మెడికల్‌ సూపరింటెండెంట్‌ లక్ష్మీభాస్కర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని