Updated : 15/01/2022 06:02 IST

కొత్త వస్త్రాలతో పోరులోకి..

భారత సైన్యానికి కొత్త యూనిఫాం

ధునికత వైపు క్రమంగా అడుగులు వేస్తున్న భారత సైన్యం.. యూనిఫాం విషయంలోనూ కొత్త సొబగులు అద్దుకుంటోంది. వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా 13 లక్షల మంది సైనికుల పోరాట దుస్తుల్లో మార్పు జరిగింది. జవాన్లకు మరింత సౌకర్యం కలిగించేలా, యుద్ధ క్షేత్రంలో శత్రువులను మెరుగ్గా ఏమార్చేలా వీటిని ప్రత్యేకంగా రూపొందించారు. సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వీటిని తొలిసారి ప్రదర్శించనున్నారు.  

సైనిక దళాలకు ప్రత్యేకత తెచ్చేది వారు ధరించే విలక్షణ యూనిఫామే. సందర్భానికి తగ్గట్లు దుస్తులు వేసుకోవడం ఎప్పటి నుంచో వస్తున్న సైనిక ఆనవాయితీ. ఇందులో పోరాట యూనిఫాం (కంబాట్‌ డ్రెస్‌)కు ఎనలేని ప్రాధాన్యం ఉంది. తీవ్ర వేడి, చలి నుంచి సైనికులను రక్షించడం, ఊసరవెల్లిలా పరిసరాలతో మెరుగ్గా కలిసిపోయి (కామోప్లాజ్‌) శత్రువులను తెలివిగా బోల్తా కొట్టించడం వీటి ఉద్దేశం. ఇందుకోసం వస్త్రంపై భిన్న వర్ణాలను ఒక పద్ధతిలో కలపడం ద్వారా ఒక ప్యాటర్న్‌ను ఏర్పరుస్తారు.

ఇప్పుడు మార్పు ఎందుకు?

ప్రస్తుతం సైన్యం వాడే పోరాట దుస్తులు బహిరంగ మార్కెట్‌లోనూ లభ్యమవుతున్నాయి. వివిధ శాఖల ఆధ్వర్యంలోని భద్రతా విభాగాలూ వాటిని విరివిగా ఉపయోగిస్తున్నాయి. ఆ శాఖల సిబ్బందిని కూడా సైనికులుగా ప్రజలు పొరబడుతున్నారు. దీంతో శాంతి భద్రతల విధుల్లో సైన్యాన్ని వాడుతున్నారన్న అపోహలు చెలరేగుతున్నాయి.

ప్రస్తుతం పోరాట యూనిఫాం జీవితకాలం 18 నెలలుగా ఉంది. దీంతో మరింత మన్నిక కలిగిన, ఎక్కువ సౌకర్యంతో కూడిన ఆధునిక వస్త్రం అవసరమైంది.

ఎలా ఉంటుంది?

సైనికుల సౌకర్యం, వారు విధులు నిర్వర్తించే భిన్న భౌగోళిక ప్రదేశాలను దృష్టిలో పెట్టుకొని  డిజైన్‌ రూపొందించారు. తీవ్ర వేడి, చలిని తట్టుకొనేలా పటిష్ఠత, తక్కువ బరువు కలిగిన వస్త్రాన్ని ఎంపిక చేశారు. ఇందులో 70 శాతం కాటన్‌, 30 శాతం పాలిస్టర్‌ను ఉపయోగించారు.

తీవ్ర వడపోత తర్వాతే..

పోరాట దుస్తుల రూపకల్పనకు భారత సైన్యం.. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌) సేవలను వినియోగించుకుంది. ప్రపంచవ్యాప్తంగా సైనిక యూనిఫారాలపై విస్తృత స్థాయి విశ్లేషణ, చర్చలు జరిగాయి. మొత్తం మీద 15 విభిన్న కామోఫ్లాజ్‌ పోకడలు, నాలుగు భిన్న డిజైన్లు, 8 రకాల వస్త్రాలను నిఫ్ట్‌ ప్రతిపాదించింది. వాటిని పరిశీలించిన సైన్యం.. నాలుగు కమోఫ్లాజ్‌ ప్యాటర్న్‌లు, మూడు డిజైన్లు, ఐదు రకాల వస్త్రాలను ఎంపిక చేసింది. వాటిని భిన్న మిశ్రమాల్లో యూనిఫారాలుగా తయారుచేసి, సైన్యంలోని 150 మంది సిబ్బందికి ఇచ్చారు. వారు వెలిబుచ్చిన అభిప్రాయాల ఆధారంగా తుది ఎంపిక చేశారు. సైన్యాధిపతి జనరల్‌ ఎం.ఎం.నరవణె కూడా సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. దశలవారీగా వీటిని సైన్యానికి అందిస్తారు. సైనికులంతా ఈ యూనిఫాంలో కనిపించడానికి కనీసం రెండేళ్లు పట్టొచ్చు.

ఈ కొత్త యూనిఫాం దీర్ఘకాలం మన్నుతుంది. వేసవి, శీతాకాలాల్లో ధరించడానికి సౌకర్యంగా ఉంటుంది. ఉతికినప్పుడు త్వరగా ఆరిపోతుంది.

ఈ డ్రెస్‌లో ‘డిస్రప్టివ్‌ డిజిటల్‌ ప్యాటర్న్‌’ ఉంటుంది. దీన్ని పిక్సెలేటెడ్‌ డిజైన్‌ అని కూడా పిలుస్తారు. ఇది ఆలీవ్‌, మట్టి వర్ణాల మిశ్రమం. లేత రంగులో కనిపిస్తుంది. భారత సైన్యం మోహరించే ప్రాంతాలకు అనుగుణంగా ప్యాటర్న్‌ను రూపొందించారు. గతంలో అటవీ, ఎడారి ప్రాంతాలకు భిన్నమైన పోరాట దుస్తులు ఉండేవి. కొత్త యూనిఫాంను అన్ని భౌగోళిక ప్రదేశాలకూ అనువుగా తీర్చిదిద్దారు. దీనివల్ల సైనికులు తమ పరిసరాలతో సులువుగా కలిసిపోతారు.

ఈ కొత్త డ్రస్‌ను టక్‌ చేయరు. బెల్టు బయటకు కనిపించదు. లోపల టి షర్టు ధరించాలి. ప్యాంట్‌కు అదనపు జేబులు ఉంటాయి. ప్యాంట్‌ దిగువ భాగం.. బూట్లలోకి ఒదిగిపోతుంది.

పోరాట దుస్తుల్లో ర్యాంకును సూచించే చిహ్నాలను భుజాలపై కాకుండా.. ముందు భాగంలో గుండీల వద్ద ప్రదర్శించే అవకాశం ఉంది. మెరుగైన కమోఫ్లాజ్‌ కోసం వాటిని నలుపు రంగులో ప్రదర్శిస్తారన్న అభిప్రాయమూ ఉంది.

కొత్త యూనిఫాం 13 సైజుల్లో లభ్యమవుతుంది. వీటిని పూర్తిగా సైన్యానికే ప్రత్యేకించారు. భద్రతా కారణాల వల్ల పౌరులకు అందుబాటులో ఉంచరాదని ప్రభుత్వం నిర్ణయించింది.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని