Updated : 15/01/2022 05:19 IST

Carona:పండగ వేళ..పారాహుషార్‌!

ఈ నెలలోనే కొత్తగా 23 వేల కొవిడ్‌ కేసులు  
పల్లెల్లో వేగంగా వ్యాప్తి
తాజాగా రాష్ట్రంలో 2,398 పాజిటివ్‌లు
స్వీయ జాగ్రత్తలు ఎంతో ముఖ్యమంటున్న నిపుణులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈనెలలో కేసులు భారీగా పెరిగాయి. ఒకటో తేదీ నాటికి ఒక్కటి కూడా లేని జిల్లాల్లో ప్రస్తుతం రోజూ 50 దాకా వస్తున్నాయి. హైదరాబాద్‌లో జనవరి 1 నాటికి రోజువారీ కేసుల సంఖ్య 69గా ఉంటే... శుక్రవారానికి 1,233గా నమోదైంది. ఇదే తరహాలో రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో రెండువందల చేరువలో కేసులు వచ్చాయి. కొత్త ఏడాది వేడుకల సందర్భంగా కరోనా నిబంధనలు పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడం, సంక్రాంతి నేపథ్యంలో పట్టణాల నుంచి గ్రామాలకు ప్రజలు వెళ్లడంతో వైరస్‌ వ్యాప్తి వేగం అవుతోంది. రెండు వారాల్లోనే ఈ కేసులు భారీగా పెరిగాయి. ఈనెల 1 నుంచి శుక్రవారం వరకు రోజుకి సగటున 1,650 మంది చొప్పున ఇప్పటికే 23వేల మందికిపైగా ప్రజలు మహమ్మారి బారిన పడ్డారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2,398 కేసులు నమోదయ్యాయి. జనవరి ఒకటిన నమోదైనవి కేవలం 317. కొవిడ్‌ నిబంధనలు పాటించక పోవడంతో వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తోంది. శనివారం సంక్రాంతి కావడంతో జనం గుంపులుగా చేరడం, మాస్కులు ధరించకపోవడం వంటి పరిస్థితులకు ఎక్కువగా ఆస్కారం ఉందని ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు తీసుకోకపోతే కొవిడ్‌ మరింత విజృంభిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

సూచనలు ఇలా...

భౌతిక దూరం పాటించడం ఎంతో ముఖ్యం. మనం ఎవరి సమీపానికి వెళ్లకపోవడమే కాదు.. ఎవరన్నా దగ్గరకు వస్తున్నారంటే మనమే దూరంగా జరగాలి. ఆ స్పృహ ఎంతో ముఖ్యం.

బయట ఎట్టి పరిస్థితుల్లో మాస్కు ముక్కు జారకూడదు. కొందరు మాట్లాడుతూ ఎదుటి వారికి తన మాట అర్థం కావాలని మాస్కు కిందకు జరుపుతుంటారు. అంటే వారు మాస్కు ధరించిన ఉద్దేశాన్ని గాలికొదిలేసినట్టే.

పండగకని ఊరికొచ్చిన వారు సాధారణంగా చుట్టుపక్కల ఇళ్లకు పలకరింపులకు వెళ్లడం సాధారణం. ఇలాంటి సందర్భాల్లో మాటామంతికి వెళ్లే వారు.. ఆ ఇంట్లోని వారు కూడా మాస్కులు ధరించడం, దూరం దూరంగా కూర్చోవడం చాలా ముఖ్యం.

మాస్కుకు అదనంగా ఫేస్‌షీల్డ్‌ వంటివి ధరించవచ్చు.

68,525 మందికి పరీక్షలు

కరోనా లక్షణాలతో బాధపడుతున్న 68,525 మందికి శుక్రవారం పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,233, రంగారెడ్డిలో 192, మేడ్చల్‌లో 191, సంగారెడ్డిలో 75 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోవడంతో మృతుల సంఖ్య 4,052కు చేరింది. జనవరి 1న ఈ సంఖ్య 4,029గా ఉంది. కొవిడ్‌ నుంచి 1,181 మంది బయటపడడంతో కోలుకున్న వారి సంఖ్య 6,79,471గా నమోదైంది. ప్రస్తుతం మరో 21,676 మంది చికిత్స, ఐసొలేషన్‌లో ఉన్నారు. ఈ నెల 1న ఈ సంఖ్య 3,733గా ఉంది.

ఆసుపత్రుల్లో పెరుగుతున్న చేరికలు

గత రెండు వారాలుగా ఆసుపత్రుల్లో చేరికలు పెరుగుతున్నాయి. జనవరి 1 నాటికి 1,229 మంది ఉంటే ప్రస్తుతం 2వేలకు చేరుకుంది. ఆక్సిజన్‌ పడకలపై బాధితులు దాదాపు రెండింతలయ్యారు. ఐసీయూ పడకల్లో బాధితులు 413 ఉంటే.. ప్రస్తుతం 492 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి, హైదరాబాద్‌ మినహాయిస్తే రెండోదశలో రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదైన జిల్లాల్లో ఖమ్మం, మహబూబ్‌నగర్‌, జగిత్యాల, కరీంనగర్‌, మంచిర్యాల, హనుమకొండ, పెద్దపల్లి నిజామాబాద్‌ ఉన్నాయి. ప్రస్తుతం 30-60 మధ్య కేసులు నమోదవుతున్నాయి.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని