Night Curfew: రాత్రి కర్ఫ్యూ!

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రణకు మరోసారి కఠిన చర్యలకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. రాత్రి తొమ్మిది గంటల తర్వాత నుంచి కర్ఫ్యూ విధించేందుకు యోచిస్తోంది. విద్యాసంస్థల్లో సెలవులను పొడిగించిన ప్రభుత్వం థియేటర్లు, మాల్స్‌

Published : 17 Jan 2022 05:51 IST

జనసమ్మర్ద నియంత్రణకు చర్యలు
థియేటర్లు, మాల్స్‌పై ఆంక్షలు
విద్యాసంస్థల్లో ఆన్‌లైన్‌ తరగతులు
రాష్ట్ర ప్రభుత్వ యోచన
నేడు మంత్రిమండలి భేటీలో నిర్ణయించే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రణకు మరోసారి కఠిన చర్యలకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. రాత్రి తొమ్మిది గంటల తర్వాత నుంచి కర్ఫ్యూ విధించేందుకు యోచిస్తోంది. విద్యాసంస్థల్లో సెలవులను పొడిగించిన ప్రభుత్వం థియేటర్లు, మాల్స్‌ ఇతర జనసమ్మర్ద ప్రాంతాల్లో ఆంక్షలను అమలు చేయాలని భావిస్తోంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగే మంత్రిమండలి సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. సభాపతి పోచారం సహా పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు దీని బారిన పడ్డారు.  ఒమిక్రాన్‌ కేసులు పెరగడంపైనా ఆందోళన నెలకొంది. కొవిడ్‌ నిబంధనలు పట్టించుకోకపోవడం వల్ల కేసులు పెరుగుతున్నాయనే భావన ప్రభుత్వవర్గాల్లో ఉంది. దీంతో ప్రజలు సంచరించే ప్రాంతాల్లో నియంత్రణ కోసం పలు చర్యలను చేపట్టేందుకు సమాయత్తమవుతోంది. వీటితో పాటు కరోనా పరీక్షలు ముమ్మరం చేయడం, అర్హులందరికీ టీకాలివ్వడం, ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెంచడం వంటి చర్యలపైనా మంత్రిమండలి నిర్ణయం తీసుకోనుంది. విద్యాసంస్థల్లో ఆన్‌లైన్‌ తరగతుల ప్రారంభానికి అనుమతించనుంది. మంత్రిమండలి సమావేశ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా స్థితిగతులపై వైద్యఆరోగ్యశాఖ నుంచి సమగ్ర నివేదికను ప్రభుత్వం కోరింది. అనాథల సంక్షేమం, కొత్త క్రీడావిధానం, పేదల ఇళ్లస్థలాల క్రమబద్ధీకరణ, ఉద్యోగులకు కరవుభత్యం, దళితబంధుకు నిధుల మంజూరు, వంటి అంశాలు ఎజెండాలో ఉన్నాయి.

ఉద్యోగ ప్రకటనలపైనా...

మరోవైపు రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీపైనా మంత్రిమండలిలో చర్చించనున్నట్లు సమాచారం. వచ్చే నెలలో జరిగే బడ్జెట్‌ సమావేశాల దృష్ట్యా శాఖల వారీగా పద్దుల రూపకల్పనపైనా సీఎం కేసీఆర్‌ మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.

యూపీ ఎన్నికలకు తెరాస బృందాలు!

ఉత్తర్‌ప్రదేశ్‌ సహా అయిదు రాష్ట్రాల ఎన్నికల అంశం ప్రస్తావనకు వచ్చే వీలుంది. ఈ ఎన్నికల్లో భాజపాకు వ్యతిరేకంగా...సమాజ్‌వాదీ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయాలని తెరాస అధిష్ఠానం భావిస్తోన్నట్లు సమాచారం. మూడు విడతలుగా యూపీలో ఎన్నికల ప్రచారానికి తెరాస బృందాలు తరలివెళ్లే వీలుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని