కొత్తగా 2,047 కొవిడ్‌ కేసులు

రాష్ట్రంలో కొత్తగా 2,047 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 7,09,209కి పెరిగింది. కరోనాతో మరో 3 మరణాలు సంభవించగా.. ఇప్పటివరకూ 4,057 మంది కన్నుమూశారు. తాజాగా 2,013 మంది  కోలుకోగా.. మొత్తంగా 6,83,104 మంది ఆరోగ్యవంతులయ్యారు.

Published : 17 Jan 2022 04:16 IST

మరో 3 మరణాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 2,047 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 7,09,209కి పెరిగింది. కరోనాతో మరో 3 మరణాలు సంభవించగా.. ఇప్పటివరకూ 4,057 మంది కన్నుమూశారు. తాజాగా 2,013 మంది  కోలుకోగా.. మొత్తంగా 6,83,104 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఆదివారం సాయంత్రం 5.30 గంటలవరకూ నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,048 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 55,883 నమూనాలను పరీక్షించగా.. మొత్తం పరీక్షల సంఖ్య 3,06,29,520కి పెరిగింది. మరో 9,829 నమూనాల ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 1,174 కొవిడ్‌ కేసులు నమోదవగా.. మేడ్చల్‌ మల్కాజిగిరిలో 178, రంగారెడ్డిలో 140, హనుమకొండలో 69, సంగారెడ్డిలో 50 కొత్త పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. మిగిలిన జిల్లాల్లో 50 కంటే తక్కువ సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో 1,53,699 కొవిడ్‌ టీకా డోసులు పంపిణీ చేశారు.

ఏడాదిలో 5 కోట్లకు పైగా డోసులు

గత ఏడాది ఇదే తేదీన (జనవరి 16న) రాష్ట్రంలో కొవిడ్‌ టీకాల పంపిణీ ప్రారంభమైంది. గడిచిన ఏడాది కాలంలో మొత్తంగా 5,04,33,553 డోసులను అందజేశారు. టీకాల పంపిణీలో వైద్యసిబ్బంది ఎనలేని కృషిచేశారనీ, క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రాణాలకు ఎదురొడ్డి నిలిచారని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో అర్హులైన వారందరూ 100 శాతం రెండు డోసుల టీకాలు పొందేలా కృషిచేయాలని కోరారు. ప్రజలు కూడా ముందుకు వచ్చి టీకాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పలువురు ప్రజాప్రతినిధులకు..

ఈనాడు, హైదరాబాద్‌, గాంధీభవన్‌, జనగామ టౌన్‌, న్యూస్‌టుడే: పలువురు ప్రజాప్రతినిధులకు ఆదివారం కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల శాసనసభా కమిటీ (పీయూసీ) ఛైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌రెడ్డి మూడోసారి కరోనా బారిన పడ్డారు. రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలకు రెండోసారి సోకింది. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కకూ పాజిటివ్‌ వచ్చింది. అనారోగ్య సమస్యలు లేనప్పటికీ వైద్యుల సూచనల మేరకు శ్రీనివాస్‌రెడ్డి ముందు జాగ్రత్తగా ఆదివారం హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చేరారు. జీవన్‌రెడ్డి, భట్టివిక్రమార్క, యాదగిరిరెడ్డిలు హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. గత కొన్ని రోజులుగా తమతో సన్నిహితంగా ఉన్న వారు పరీక్షలు చేయించుకుని తగు జాగ్రత్తలతో ఐసొలేషన్లో ఉండాలని వారు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని