11 క్లబ్బుల్లో అగ్నిమాపక వ్యవస్థే లేదు

సికింద్రాబాద్‌ క్లబ్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాద నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా జనం గుమిగూడటానికి అవకాశం ఉన్న ప్రాంతాలన్నింటిపైనా దృష్టి సారించారు. దీనిలో భాగంగా ఫంక్షన్‌ హాళ్ల చిట్టా

Published : 18 Jan 2022 03:56 IST

సికింద్రాబాద్‌ క్లబ్‌ దుర్ఘటన నేపథ్యంలో తనిఖీలు  

ఈనాడు, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ క్లబ్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాద నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా జనం గుమిగూడటానికి అవకాశం ఉన్న ప్రాంతాలన్నింటిపైనా దృష్టి సారించారు. దీనిలో భాగంగా ఫంక్షన్‌ హాళ్ల చిట్టా సేకరిస్తున్నారు. వాటిలో అగ్నిమాపక వ్యవస్థ తదితర అంశాలను పరిశీలించి నివేదిక రూపొందించనున్నారు. దీంతోపాటు రాజధానిలోని ప్రధానక్లబ్బుల్లో ఒక్కదాంట్లోనూ సరైన అగ్నిమాపక వ్యవస్థ లేదని నిర్ధారించిన అధికారులు వాటన్నింటిపై చర్యలకు సిద్ధమవుతున్నారు.

ఫోరెన్సిక్‌ నిపుణుల ఆరా!

షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే సికింద్రాబాద్‌ క్లబ్‌లో ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నా అసలు కారణాలపై ఫోరెన్సిక్‌ నిపుణులు ఆరా తీస్తున్నారు. సాధారణంగా 15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉండే వాణిజ్య సముదాయాలు, 18 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉంటే విద్యాసంస్థల భవనాలు, సినిమాహాళ్లు వంటి జనసమ్మర్ద కట్టడాలన్నీ కచ్చితంగా నిరభ్యంతర ధ్రువపత్రం (ఎన్‌.ఒ.సి.) తీసుకోవాలి. అయితే క్లబ్బులు, ఫంక్షన్‌హాళ్లు దీని పరిధిలోకి రావు. అయినప్పటికీ సికింద్రాబాద్‌ క్లబ్‌ ఉదంతం నేపథ్యంలో ఇప్పుడు అధికారులు వీటిపైనా దృష్టి సారించారు. ముఖ్యంగా ఫంక్షన్‌హాళ్లలో పెళ్లిళ్ల సీజన్లో వేల మంది జనం గుమిగూడుతుంటారు. ఏదైనా ఉపద్రవం తలెత్తితే లోపల ఉన్న వారందర్నీ తక్షణమే ఖాళీ చేయించడం సాధ్యంకాదు. అందుకే అధికారులు వీటిపై దృష్టి సారించారు.  

ఉన్నతస్థాయి సమావేశం

సికింద్రాబాద్‌ క్లబ్‌ ప్రమాదం నేపథ్యంలో అగ్నిమాపక, విపత్తు నివారణశాఖ డైరెక్టర్‌ జనరల్‌ సంజయ్‌కుమార్‌ జైన్‌ ఆధ్వర్యంలో సోమవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా సినిమాహాళ్లు, ఆసుపత్రులతో పాటు అగ్నిప్రమాదాలు జరిగితే తీవ్ర నష్టానికి అవకాశం ఉన్న అన్ని కట్టడాలు, వాటిలో ఉన్న నివారణ ఏర్పాట్లపై చర్చించారు. క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.

నోటీసులు జారీ

రాజధానిలో ముఖ్యమైన క్లబ్బులు 11 ఉన్నట్లు గుర్తించిన అగ్నిమాపక అధికారులు వాటన్నింటిలోనూ సోమవారం తనిఖీలు నిర్వహించారు. ఒక్క దాంట్లో కూడా సరైన అగ్నిమాపక వ్యవస్థ లేదని తేలడంతో నివ్వెరపోయారు. కొన్ని చోట్ల కేవలం గ్యాస్‌ వెదజల్లే ఉపకరణాలు మాత్రమే ఉన్నాయి. ఏళ్లుగా వాటిని మార్చకపోవడంతో అవి కూడా పనిచేసే స్థితిలో లేవు. క్లబ్బుల్లో ఫంక్షన్లు జరుగుతుంటాయి. ఎక్కువ మంది జనం గుమిగూడుతుంటారు కాబట్టి వాటిలోనూ తప్పనిసరిగా పటిష్ఠమైన అగ్నిమాపక వ్యవస్థ ఏర్పాటు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. 11 క్లబ్బులకు నోటీసులు జారీ చేస్తున్నారు. వీటికి సమాధానాలు అందిన తర్వాత చర్యలు చేపట్టనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని