ఆవిష్కరణ కేంద్రాలుగా.. ఐఐటీలు, ట్రిపుల్‌ఐటీలు

ఐఐటీలు, ట్రిపుల్‌ఐటీలు.. ఇకపై సరికొత్త సాంకేతికత అభివృద్ధి చేసే సంస్థలుగా, డాటా నిల్వ కేంద్రాలుగా మారనున్నాయి. ఇందుకోసం కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ ఆధ్వర్యంలో రెండేళ్ల కిందట ప్రత్యేకంగా నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఇంటర్‌

Updated : 18 Jan 2022 04:22 IST

దేశవ్యాప్తంగా 25 విద్యా సంస్థల ఎంపిక
తెలుగు రాష్ట్రాల నుంచి మూడింటికి చోటు
రూ.3,200 కోట్లతో ప్రత్యేకహబ్‌ల ఏర్పాటు

ఈనాడు, హైదరాబాద్‌: ఐఐటీలు, ట్రిపుల్‌ఐటీలు.. ఇకపై సరికొత్త సాంకేతికత అభివృద్ధి చేసే సంస్థలుగా, డాటా నిల్వ కేంద్రాలుగా మారనున్నాయి. ఇందుకోసం కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ ఆధ్వర్యంలో రెండేళ్ల కిందట ప్రత్యేకంగా నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఇంటర్‌ డిసిప్లినరీ సైబర్‌-ఫిజికల్‌ సిస్టమ్స్‌ (ఎన్‌ఎం-ఐసీపీఎస్‌) పేరిట ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టింది. ఇందులో భాగంగా ముందుగా ఆయా విద్యా సంస్థల్లో సెక్షన్‌-8 కంపెనీలుగా టెక్నాలజీ ఇన్నోవేషన్‌ హబ్‌లను ఏర్పాటుచేశారు. ఇవి వచ్చే ఐదేళ్లలో నిర్దేశించిన అంశాల వారీగా సాంకేతికతలను అభివృద్ధి చేయడంతోపాటు పేటెంట్‌లు దక్కించుకునేలా ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని తాజాగా నిర్దేశించారు. ఆవిష్కరణ హబ్‌లకు ఐదేళ్లలో భారీగా నిధులు దక్కనున్నాయి. మొత్తం 25 కేంద్రాల పరిధిలో రూ.3,200 కోట్లు వెచ్చించనున్నారు.

ప్రతిష్ఠాత్మక సంస్థలకు చోటు

ఐఐటీ-ఖరగ్‌పుర్‌, ఐఐటీ-వారణాసి, ఐఐఎస్‌సీ-బెంగళూరు, ఐఐటీ-బాంబే, ఐఐటీ-మద్రాస్‌, ఐఐటీ-కాన్పుర్‌, ట్రిపుల్‌ఐటీ-బెంగళూరు, బిట్స్‌-పిలానీ, ఐఎస్‌ఐ-కోల్‌కతా, ఐఐటీ-ఇండోర్‌, ట్రిపుల్‌ ఐటీ-దిల్లీ, ఐసర్‌-పుణె, ఐఐటీ-భిలాయ్‌, ఐఐటీ-దిల్లీ సహా దేశవ్యాప్తంగా 25 ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలను ఇందుకోసం ఎంపిక చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి మూడు విద్యాసంస్థలకు చోటు దక్కింది. కేంద్ర ప్రభుత్వం వాటికి ఆయా అంశాలను నిర్దేశించింది. ట్రిపుల్‌ఐటీ-హైదరాబాద్‌లో డాటా బ్యాంకు, డాటా సేవలు, డాటా విశ్లేషణ హబ్‌ ఏర్పాటు కానుంది. ఐఐటీ హైదరాబాద్‌ అటానమస్‌ నావిగేషన్‌ సాంకేతికతను అభివృద్ధి చేస్తుంది. ఐఐటీ తిరుపతిలో పొజిషనింగ్‌ సాంకేతికతను అభివృద్ధి చేస్తారు. జీపీఎస్‌ తరహా వ్యవస్థలపైనా దృష్టి పెడతారు. ‘‘ప్రతి టెక్నాలజీ హబ్‌లో ప్రత్యేకంగా టెక్నాలజీ ఇంక్యుబేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తారు. ఇందులో వెయ్యి అంకుర సంస్థలకు చేయూత అందిస్తారు. ప్రతి హబ్‌ నుంచి ఒక యూనికార్న్‌ సంస్థ తయారయ్యేలా తోడ్పాటు అందిస్తారు’’ అని ఐఐటీ హైదరాబాద్‌ వర్గాలు వెల్లడించాయి.


పరిశ్రమల భాగస్వామ్యం తప్పనిసరి

-డాక్టర్‌ కె.ఆర్‌.మురళీమోహన్‌, మిషన్‌ సంచాలకుడు, ఎన్‌ఎం-ఐసీపీఎస్‌, కేంద్ర శాస్త్ర,సాంకేతిక శాఖ

ఏడాది నుంచి సాంకేతికత అభివృద్ధిపై దృష్టిపెట్టాం. పరిశోధన, సాంకేతికత అభివృద్ధి, బదలాయింపు, వాణిజ్యం, ఆంత్రపెన్యూర్‌షిప్‌, స్టార్టప్‌లకు చేయూత, మానవ వనరుల అభివృద్ధి వంటి అంశాలపైనా హబ్‌లు పనిచేస్తాయి. పరిశ్రమల భాగస్వామ్యం తప్పనిసరి. ఆయా హబ్‌లు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉపయుక్తమైన సాంకేతికతను అభివృద్ధి చేస్తాయి.


పేటెంట్‌ స్థాయికి తీసుకెళ్లేలా పరిశోధన
-ఎస్‌.బాపిరాజు, ఐ-హబ్‌ డాటా సెంటర్‌ హెల్త్‌కేర్‌ అధిపతి, ట్రిపుల్‌ఐటీ-హైదరాబాద్‌

ట్రిపుల్‌ఐటీలో ఐహబ్‌ డాటా సెంటర్‌ అందుబాటులోకి తీసుకువచ్చాం. ఆరోగ్య రంగం, స్మార్ట్‌ సంచారంపై సాంకేతికత అభివృద్ధి చేయడమనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని డాటా రూపొందిస్తున్నాం. ఆయా ఉత్పత్తులను రూపొందించి పేటెంట్‌ స్థాయికి తీసుకెళ్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని