అణు చరిత్రలో మరో ముందడుగు

దేశ అణు చరిత్రలో మరో ముందడుగు పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వాపురం సమీపంలోని మణుగూరు భారజల కర్మాగారంలో  ఆక్సిజన్‌-18 ప్లాంటు ప్రారంభమైంది. దేశంలో ఇది మొదటిది కాగా ప్రపంచంలో ఏడోది

Published : 19 Jan 2022 03:03 IST

మణుగూరు భారజల కర్మాగారంలో ఆక్సిజన్‌-18 ప్లాంటు ప్రారంభం
ప్రపంచంలో ఏడోది.. దేశంలో మొదటిది

మణుగూరు భారజల కర్మాగారంలో ప్రారంభించిన ఆక్సిజన్‌-18 ప్లాంటు

అశ్వాపురం, న్యూస్‌టుడే: దేశ అణు చరిత్రలో మరో ముందడుగు పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వాపురం సమీపంలోని మణుగూరు భారజల కర్మాగారంలో  ఆక్సిజన్‌-18 ప్లాంటు ప్రారంభమైంది. దేశంలో ఇది మొదటిది కాగా ప్రపంచంలో ఏడోది. ఆర్థికంగా, వాణిజ్యపరంగా ఎంతో లాభదాయకం కావడంతో భారత భారజల బోర్డు 2016లో రూ.53 కోట్లతో ప్లాంటు నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు ఆక్సిజన్‌-18 ఉత్పత్తి అమెరికా, రష్యా, చైనా వంటి ఆరు అగ్రరాజ్యాలకే పరిమితమైంది. ఇప్పుడు వాటి సరసన మన దేశం చేరింది. గణతంత్ర వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విజయంపై ప్రకటన చేయనున్నారని సమాచారం.

వర్చువల్‌ పద్ధతిలో..
భారత అణుశక్తి విభాగం ఛైర్మన్‌ కేఎన్‌ వ్యాస్‌ ‘ఆక్సిజన్‌-18’ ప్లాంటును సోమవారం వర్చువల్‌ పద్ధతిలో ఆవిష్కరించారు. భారజల బోర్డు ఛైర్మన్‌ జితేంద్ర శ్రీవాత్సవ, బార్క్‌ డైరెక్టర్‌ మహంతి తదితరులు పాల్గొన్నారు. భారత భారజల బోర్డు అసోసియేట్‌ డైరెక్టర్‌ వీవీఎస్‌ఏ ప్రసాద్‌ మణుగూరు కర్మాగారానికి వచ్చారు. ప్లాంటు జనరల్‌ మేనేజర్‌ జి.సతీశ్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్లు పీజేవీ సుధాకర్‌, వెంకటేశ్‌, ఉపాధ్యాయ తదితరులు పాల్గొన్నారు.

ఉపయోగాలేంటి?
ఆక్సిజన్‌-18ను పాజిట్రాన్‌ ఎమిషన్‌ టోమోగ్రఫీ (పీఈటీ) స్కానింగులో వినియోగిస్తారు. పీఈటీ అనేది న్యూక్లియర్‌ ఇమేజింగ్‌లో ఓ టెక్నిక్‌. ఇది శరీరంలోని జీవ రసాయనిక ప్రక్రియలను, కణతులను, క్యాన్సర్‌ వివిధ దశలను, చిత్త వైకల్యం తదితర వ్యాధులను వంద శాతం కచ్చితత్వంతో నిర్ధారిస్తుంది. శరీరధర్మ, జీవక్రియల అధ్యయనానికీ ఉపయోగపడుతుంది. వీటితోపాటు ఇతర అనేక వైజ్ఞానిక అవసరాలకు ఆక్సిజన్‌-18 ఉపకరిస్తుంది.


ఆక్సిజన్‌-18 అంటే?

క్సిజన్‌ సహజసిద్ధంగా 16, 17, 18 అనే స్థిర ఐసోటోపులను కలిగి ఉంటుంది. సాధారణ నీటిలో ఆక్సిజన్‌-18 ఐసోటోపు 0.204 శాతంగా ఉంటుంది. వివిధ ప్రక్రియల ద్వారా దాన్ని 95.5 శాతం ఆక్సిజన్‌-18 ఐసోటోపుగా మార్పు చెందిస్తారు. ఆ నీటిని సుసంపన్న ఆక్సిజన్‌-18 ఐసోటోపు నీటిగా, డబ్లీ లేబుల్డ్‌ వాటర్‌గా  పిలుస్తారు. ఆ నీటిని ఉత్పత్తి చేసే ప్లాంటును ఆక్సిజన్‌-18 ప్లాంటుగా వ్యవహరిస్తారు. 95.5 శాతం ఆక్సిజన్‌-18 ఐసోటోపు సుసంపన్నంగా ఉండే నీటిని మణుగూరు ప్లాంటులో ఏడాదికి పది కిలోలు ఉత్పత్తి చేయనున్నారు. 10 శాతం ‘ఆక్సిజన్‌-18’ ఉండే నీటిని ఏడాదికి వంద కిలోలు ఉత్పత్తి చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని