Published : 19 Jan 2022 03:07 IST

అభ్యర్థుల నేరచరిత్రను వెల్లడించాల్సిందే

లేదంటే కోర్టు ధిక్కరణ కేసులు పెట్టాలి
సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలు
విచారణకు పరిశీలిస్తామన్న సీజేఐ ధర్మాసనం

దిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల నేరచరిత్రను, వారి ఎంపికకు కారణాలను రాజకీయ పార్టీలు తప్పనిసరిగా వెల్లడించేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దానిపై వెంటనే విచారణ చేపట్టాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ ఎ.ఎస్‌.బొపన్న, జస్టిస్‌ హిమాకోహ్లిల ధర్మాసనానికి పిటిషన్‌దారు, న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ మంగళవారం విన్నవించారు. యూపీలో ఇప్పటికే తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని, నేరచరిత్ర వెల్లడిపై సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన రెండు తీర్పులను అభ్యర్థులు, పార్టీలు  మొండిగా ఉల్లంఘిస్తున్నాయని నివేదించారు. దీంతో- సీజేఐ స్పందిస్తూ.. పిల్‌ను విచారణకు పరిశీలిస్తామని, అందుకు తేదీ ఇస్తామని తెలిపారు.


దేశంలో ఆకలి చావులు లేవంటారా?

దిల్లీ: ‘దేశంలో ఇప్పుడు ఆకలి చావులు లేవా? దీనిని మీ వాంగ్మూలంగా నమోదు చేసుకోమంటారా?’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా సామాజిక వంటశాలల పథకాన్ని అమలు చేయడంపై నియమావళి రూపొందించాలని ఆదేశించారు. ఆకలి, పోషకాహార లోపం నేపథ్యంలో సామాజిక వంటశాలల ఏర్పాటుకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సీజేఐ జస్టిస్‌ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ వాదనలు వినిపించారు. సామాజిక వంటశాలల ద్వారా అన్నార్తులకు ఆహారం అందించడానికి రాష్ట్రాలకు అదనంగా ఆహార ధాన్యాలను సరఫరా చేసే నిబంధనలు సిద్ధం చేయాలని ధర్మాసనం తెలిపింది. ఆకలితో ఏ ఒక్కరూ చనిపోలేదని కేంద్రం చెప్పడంపై కాసేపు వాగ్వాదం నడిచింది. సామాజిక వంటశాలల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సి ఉందన్న కేంద్రం వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. పోషకాహారలోపం, ఆకలి చావుల విషయాన్ని తీవ్రంగా పరిగణించని రాష్ట్రాలకు విధించిన మొత్తాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇచ్చిన గడువుకు అవి కట్టుబడి ఉండాలంది. విధాన నిర్ణయాల్లో న్యాయస్థానాలు చొరబడరాదంటూ కేంద్రం ప్రమాణపత్రంలో పేర్కొనడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తంచేసింది. ‘ఆకలితో ఇబ్బందులు పడుతున్నవారు లేరని ఏ రాష్ట్రం తోసిపుచ్చడం లేదు. ఒక సమస్య ఉందని అందరూ అంగీకరిస్తున్నారు. నిధుల్ని, మార్గదర్శకాలను కేంద్రం ఇస్తే పథకాన్ని నడపడానికి ఎక్కువ రాష్ట్రాలు సుముఖంగా ఉన్నాయి. మనసుపెట్టి ఒక నమూనా పథకాన్ని రూపొందించాల్సిందిగా మీరు (కేంద్రం) మీ అధికారులకు చెప్పండి’ అని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని