
ఏపీలో ఉద్యోగుల ఉద్యమ బాట
విలేకరులతో మాట్లాడుతున్న బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఉద్యోగ సంఘాల నేతలు
ఈనాడు, అమరావతి: పీఆర్సీ అమలుపై ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టేందుకు ఉద్యోగులు, పింఛనుదారులు సిద్ధమవుతున్నారు. అవసరమైతే సమ్మె చేయాలనీ భావిస్తున్నారు. హెచ్‌ఆర్‌ఏ శ్లాబుల మార్పు, సీసీఏ రద్దు, అదనపు పింఛనులో మార్పుపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఏపీ ఐకాస, ఐకాస అమరావతి ఐక్యవేదిక గురువారం నిర్వహించే సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యాచరణను విజయవంతం చేయాలని ఐకాసల ఛైర్మన్లు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. ‘ఈ పీఆర్సీ మాకొద్దు.. ఐఆర్‌తో పాటు డీఏలు ఇవ్వండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడే పీఆర్సీ ఇవ్వండి’ అని ప్రకటించారు.
సమ్మెకూ వెనుకాడం..
‘ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా అవసరమైతే సమ్మె చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ పీఆర్సీ మాకొద్దు. 27% ఐఆర్‌తో పాటు డీఏలు ఇస్తూ పాత వేతనాలను కొనసాగించండి. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడే పీఆర్సీ ఇవ్వండి. రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ ఐఆర్ కంటే తక్కువ ఫిట్‌మెంట్ ఇచ్చిన దాఖలాల్లేవు. వేతనాల్లో పడిన కోతను భర్తీ చేసేందుకే డీఏల విడుదల విషయంలో ప్రేమ ఒలకబోశారు. గత ప్రభుత్వాల హయాంలో సాధించుకున్న హెచ్‌ఆర్‌ఏ, అదనపు పింఛన్లను తీసేసే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. అన్నింటినీ ప్రభుత్వం వెనక్కి తీసుకునేవరకూ పోరాటం ఆగదు. బుధవారం ఏపీ ఎన్‌జీవో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నాం. ఐకాసల ఐక్యవేదిక సమావేశాన్ని గురువారం నిర్వహించి, కార్యాచరణ ప్రకటిస్తాం’
- బండి శ్రీనివాసరావు, ఏపీ ఐకాస ఛైర్మన్
ఉత్తర్వులు రద్దు చేసేవరకూ ఉద్యమం
‘పీఆర్సీ ఉత్తర్వులను రద్దు చేసేవరకూ ఉద్యమం చేస్తాం. ప్రభుత్వం కుట్రతో ఉద్యోగుల జీతభత్యాల్లో కోత వేసింది. పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా.. ఇస్తున్న ఐఆర్ కంటే తక్కువ ఫిట్‌మెంట్‌తో, గత ప్రభుత్వాలు ఇచ్చిన రాయితీలను రద్దు చేసింది. ప్రభుత్వం అన్యాయం చేసినందున ఉద్యమానికి సిద్ధమవుతున్నాం. కలిసొచ్చే సంఘాలతో ముందుకు వెళ్తాం. 20న ప్రకటించే కార్యాచరణను ఉద్యోగులు విజయవంతం చేయాలి.
-బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఐకాస అమరావతి ఛైర్మన్
దశలవారీ పోరుకు సిద్ధం
‘రాష్ట్రప్రభుత్వం జారీచేసిన కొత్త పీఆర్సీ జీవోను వెంటనే రద్దు చేయాలి. సీఎస్ కమిటీ సిఫార్సులను నిలుపుదల చేసి, అశుతోష్ మిశ్ర కమిటీ నివేదికను బయటపెట్టాలి.కొత్త జీవోల ఉపసంహరణ జరిగే వరకూ పాత పద్ధతిలోనే వేతనాలు చెల్లించాలి. సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దుచేయాలి’
- భూపతిరాజు రవీంద్రరాజు, అప్పలనాయుడు, గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.