సొమ్ము రికవరీ ఎన్నడో?

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)ల్లో సొమ్ము రికవరీ ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో హైదరాబాద్‌-రంగారెడ్డి జిల్లాలకు కలిపి ఒకటి, మిగతా 8 పాత ఉమ్మడి జిల్లాలకు కలిపి మరో 8 డీసీసీబీలు ఉన్నాయి. వీటిలో

Published : 19 Jan 2022 03:28 IST

డీసీసీబీల్లో అడ్డగోలుగా  రుణాల పంపిణీ
నల్గొండ, వరంగల్‌, ఖమ్మం బ్యాంకుల్లో రూ.కోట్ల కుంభకోణాలు
ఇంకా పెండింగ్‌లోనే చర్యలు

ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు

ఈనాడు, హైదరాబాద్‌: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)ల్లో సొమ్ము రికవరీ ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో హైదరాబాద్‌-రంగారెడ్డి జిల్లాలకు కలిపి ఒకటి, మిగతా 8 పాత ఉమ్మడి జిల్లాలకు కలిపి మరో 8 డీసీసీబీలు ఉన్నాయి. వీటిలో నల్గొండ, వరంగల్‌, ఖమ్మం డీసీసీబీల్లో పాలకవర్గాలకు ఎన్నికైనవారు రాజకీయ నాయకుల అండతో విచ్చలవిడిగా రుణాలిప్పించగా.. అవి తిరిగి వసూలు కాలేదు. రూ.కోట్ల కుంభకోణాలు జరిగినా.. విచారణలు, చర్యలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఖమ్మం జిల్లా బ్యాంకులో రూ.6 కోట్ల దాకా గోల్‌మాల్‌ జరిగిందని సహకార శాఖ విచారణలో తేలింది. రికవరీ చేయవద్దంటూ పాలకవర్గంలోని కొందరు హైకోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఈ బ్యాంకులో జరిగిన అక్రమాల్లో పాలకవర్గానికి సిబ్బంది కూడా సహకరించారని, వారిపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ‘రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు’(టెస్కాబ్‌) నియమించిన కమిటీ తాజాగా తేల్చింది. దీంతో సిబ్బందిపై వేటు వేయాలని డీసీసీబీ ప్రస్తుత పాలకవర్గానికి టెస్కాబ్‌ లేఖ రాసింది. నల్గొండ డీసీసీబీలో అవినీతి సొమ్ము ఇంకా రికవరీ కాలేదు. వరంగల్‌ డీసీసీబీలో గత పాలకవర్గం రూ.7 కోట్ల వరకూ అవినీతికి పాల్పడటంతో దాన్ని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. సొమ్ము ఇంకా రికవరీ కాలేదు. ఈ వ్యవహారంలోనూ కోర్టు స్టే ఉంది.


తనఖా రుణాలపై దృష్టి

కొంతకాలంగా వరంగల్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల డీసీసీబీల్లో రుణాల పంపిణీ పెద్దఎత్తున జరుగుతోంది. ఇది పారదర్శకంగా జరుగుతోందా, అర్హులకే ఇస్తున్నారా, ఒకవేళ రుణాలు తిరిగి కట్టకపోతే.. తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేస్తే అంత సొమ్ము తిరిగి వస్తుందా అనేది సరిగా పరిశీలిస్తున్నారా అనే అంశంపై నాబార్డు తాజాగా దృష్టి పెట్టింది. కొన్ని డీసీసీబీల్లో ఆస్తుల తనఖా రుణాలు ఇటీవల బాగా పెరిగాయి. తనఖా పెట్టే ఆస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని డీసీసీబీలకు టెస్కాబ్‌ సూచించింది.


రిజర్వు బ్యాంకు చర్యలు నిబంధనలు ఉల్లంఘిస్తే..

డీసీసీబీల ఆర్థిక కార్యకలాపాలన్నీ కచ్చితంగా రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) నిబంధనల ప్రకారమే జరగాలని, తేడాలుంటే సాధారణ వాణిజ్య బ్యాంకుల మాదిరిగానే కఠిన చర్యలుంటాయని కేంద్రం ఇటీవల ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను రాష్ట్రంలోని డీసీసీబీలు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కనిపించడం లేదని సహకార బ్యాంకు అధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. పాలకవర్గాలు తీవ్ర ఒత్తిడి తెచ్చి.. తమకు నచ్చినవారికి నిబంధనలకు విరుద్ధంగా రుణాలు ఇప్పిస్తున్నాయని, భవిష్యత్తులో అవి వసూలు కాకపోతే ఆర్‌బీఐ కఠిన చర్యలు తీసుకోవడం తథ్యమని ఆయన స్పష్టం చేశారు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం డీసీసీబీ రోజువారీ విధుల్లో పాలకవర్గ సభ్యులు జోక్యం చేసుకోకూడదు. డీసీసీబీ కార్యనిర్వహణాధికారి(సీఈవో) పర్యవేక్షించాలి. కానీ, కొన్ని జిల్లాల్లో పాలకవర్గాల సభ్యులు నియంత్రిస్తున్నారు. డీసీసీబీల తీరుపై నాబార్డు ఏటా ఇచ్చే నివేదికల ఆధారంగా రిజర్వు బ్యాంకు, రాష్ట్ర సహకార శాఖ విచారణ జరిపి చర్యలు తీసుకుంటాయి. వరంగల్‌, ఖమ్మం డీసీసీబీల్లో అవినీతి, నిధుల రికవరీపై విచారణ నివేదిక అందిందని సహకార శాఖ రాష్ట్ర కమిషనర్‌ వీరబ్రహ్మయ్య ‘ఈనాడు’కు చెప్పారు. స్టే ఎత్తివేయాలని హైకోర్టులో పిటిషన్‌ వేశామని, అది తొలగిన తరవాత సొమ్ము రికవరీ చేస్తామని తెలిపారు. నల్గొండ డీసీసీబీపై విచారణ కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని