వద్దు నిర్లక్ష్యం

కొవిడ్‌ మూడోదశ ఉద్ధృతి క్రమేణా పెరిగిపోతోంది. రాష్ట్రంలో రోజుకు దాదాపుగా 3000-3500 వరకూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం 24 వేల మందికి పైగా కరోనాతో చికిత్స పొందుతున్నారు. ఈనెల 1 నుంచి 12 వరకూ గణాంకాలను పరిశీలిస్తే..

Published : 20 Jan 2022 05:31 IST

3-5 రోజులైనా తీవ్రత తగ్గకపోతే ఆసుపత్రిలో చేరక తప్పదు
స్వల్ప లక్షణాలుంటే మాత్రం ఇంటి వద్దే చికిత్స
10 రోజుల్లోపే రెమ్‌డెసివిర్‌ అందజేస్తే మెరుగైన ఫలితం
కరోనా చికిత్సపై ఐసీఎంఆర్‌- ఎయిమ్స్‌ మార్గదర్శకాలు

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ మూడోదశ ఉద్ధృతి క్రమేణా పెరిగిపోతోంది. రాష్ట్రంలో రోజుకు దాదాపుగా 3000-3500 వరకూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం 24 వేల మందికి పైగా కరోనాతో చికిత్స పొందుతున్నారు. ఈనెల 1 నుంచి 12 వరకూ గణాంకాలను పరిశీలిస్తే.. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరికలు 3 శాతం పెరిగాయి.  తొలుత స్వల్ప లక్షణాలతో మొదలైనా.. కొందరిలో 5-6 రోజుల్లో లక్షణాలు తీవ్రమవుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో చికిత్సపై ప్రజలకు అవగాహన అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లక్షణాల తీవ్రతను ఎలా గుర్తించాలి? ఎప్పుడు ఆసుపత్రిలో చేరాలి? ఎవరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి? తదితర మార్గదర్శకాలను  ఐసీఎంఆర్‌-దిల్లీ ఎయిమ్స్‌లు సంయుక్తంగా విడుదల చేశాయి.


కొవిడ్‌పై నిర్లక్ష్యం తగదు

కొవిడ్‌ను ఐసీఎంఆర్‌ మూడు దశలుగా విభజించింది. స్వల లక్షణాలతో కూడిన వ్యాధి.. మధ్యస్థ వ్యాధి.. తీవ్ర వ్యాధిగా పరిగణించి.. జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. వీటిని పాటించడం ద్వారా కొవిడ్‌ ముప్పు నుంచి తప్పించుకోవడానికి అవకాశాలు మెరుగవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.


స్వల్ప వ్యాధి

లక్షణాలు: జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి

చికిత్స: ఇంట్లోనే ఉండి చికిత్స పొందాలి. తేలికపాటి దగ్గు, జ్వరం ఐదు రోజులకు మించి వస్తుంటే.. వైద్యుడి సలహా మేరకు ఔషధాలను వాడాలి.

జాగ్రత్తలు

* భౌతిక దూరం పాటించాలి.

* ఇంట్లోనూ మాస్కు ధరించాలి.

* నీళ్లు తగినంతగా తాగాలి.

* రోజుకు 3సార్లు శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్‌ పరీక్షించుకోవాలి.

ఎప్పుడు అత్యవసరం?

* శ్వాస పీల్చుకోవడం కష్టమైనప్పుడు

* ఆక్సిజన్‌ శాతం 93 కంటే తగ్గినప్పుడు

* జ్వరం, దగ్గు తీవ్రమైనప్పుడు

* 5 రోజులు గడిచినా లక్షణాలు తగ్గకపోతే

* దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారైతే 3 రోజుల కంటే ఎక్కువగా లక్షణాలు కనిపిస్తున్నప్పుడు


ఎవరికి ఎక్కువ ముప్పు?

60 ఏళ్లు దాటినవారు, మధుమేహులు, ఊబకాయులు, గుండె రక్తనాళాల జబ్బు, అధిక రక్తపోటు హెచ్‌ఐవీ, క్షయ, ఊపిరితిత్తులు, కిడ్నీ, కాలేయ జబ్బులు, మెదడు, రక్తనాళాల జబ్బులతో చికిత్స పొందుతున్నవారు


మధ్యస్థ వ్యాధి

లక్షణాలు: నిమిషానికి 24 సార్ల కంటే అధికంగా శ్వాస పీల్చుకోవడం, ఆయాసం, రక్తంలో ఆక్సిజన్‌ 90-93 శాతం మధ్యలో ఉండడం.

చికిత్స: * ఈ తరహా లక్షణాలున్నవారికి ఆసుపత్రిలో చికిత్స అందించాలి.

* రక్తంలో ఆక్సిజన్‌ శాతం కనీసం 92-96 మధ్యలో ఉండేలా చూసుకోవాలి.

* కృత్రిమ ప్రాణవాయువును అందించాలి.

* స్టెరాయిడ్‌ చికిత్సను ఆసుపత్రిలోనే ప్రారంభించి, అక్కడే ముగించాలి. ఇంటికెళ్లాక కూడా స్టెరాయిడ్‌ వాడే విధానానికి స్వస్తి పలకాలి.

* దీర్ఘకాలం, అవసరానికి మించి స్టెరాయిడ్‌ చికిత్సను వినియోగించడం వల్ల మ్యూకర్‌ మైకోసిస్‌ తదితర జబ్బుల బారినపడే ప్రమాదముంది.

జాగ్రత్తలు

* శ్వాస తీరు ఎలా ఉందో పరీక్షిస్తూ ఉండాలి.

* ఆరోగ్య పరిస్థితి క్రమేణా క్షీణిస్తుంటేనే.. ఛాతీ ఎక్స్‌రే, సీటీ స్కాన్‌ వంటి పరీక్షలు చేయించాలి.

* 2-3 రోజులకోసారి సీఆర్‌పీ, డీ డైమర్‌, షుగర్‌, సీబీసీ, కిడ్నీ, కాలేయ పనితీరు పరీక్షలు చేయిస్తుండాలి.


తీవ్ర వ్యాధి

లక్షణాలు: నిమిషానికి 30 సార్ల కంటే అధికంగా శ్వాస పీల్చుకోవడం, తీవ్ర ఆయాసం, రక్తంలో ఆక్సిజన్‌ శాతం 90 కంటే తగ్గిపోవడం.

చికిత్స: * ఐసీయూలో చేర్పించి చికిత్స అందించాలి.

* పరికరాల ద్వారా ప్రాణవాయువును ఇవ్వాలి.

* వైద్యుడి సూచనల మేరకు స్టెరాయిడ్‌ ఔషధాలను, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ చికిత్సను అందించాలి.

జాగ్రత్తలు

* నిర్ధారణ పరీక్షలను రోజూ చేయించనక్కర్లేదు. 2-3 రోజులకొకసారి  సీఆర్‌పీ, డీ డైమర్‌, షుగర్‌, సీబీసీ, కిడ్నీ, కాలేయ పనితీరు పరీక్షలు చేయిస్తుండాలి.

* దగ్గు 2-3 వారాల కంటే ఎక్కువగా వేధిస్తుంటే.. క్షయ ఇతర వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేయించడం ముఖ్యం.


రెమ్‌డెసివిర్‌ ఎప్పుడు?

క్షణాలు కనిపించిన 10 రోజుల్లోపు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ ఇవ్వాలి. ఇది మధ్యస్థ నుంచి తీవ్ర లక్షణాలున్న వారికి, ఆక్సిజన్‌ సాయంతో చికిత్స పొందుతున్న వారికే ఇవ్వాలి. ఇంటి వద్ద చికిత్స పొందుతున్న వారికి, ప్రాణవాయువు అవసరం లేని వారికి ఇది ఇవ్వనక్కర్లే ేదు. వెంటిలేటర్‌ సాయంతో చికిత్స పొందుతున్న వారికి రెమ్‌డెసివిర్‌ ఇవ్వకూడదు. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ ఇచ్చినప్పుడు కిడ్నీ, లివర్‌ పరీక్షలు చేయించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని