Updated : 20 Jan 2022 05:26 IST

గ్రామాలపై ప్రత్యేక దృష్టి అవసరం

ఒమిక్రాన్‌ ఒకరి ద్వారా 6-12 మందికి సోకుతోంది
అమెరికన్లను సోషల్‌ మీడియా కొంప ముంచింది
‘ఈనాడు’తో యూఎస్‌ అంటువ్యాధుల నిపుణుడు, ప్రజారోగ్య ఆచార్యుడు డాక్టర్‌ మనోజ్‌ జైన్‌
ఈనాడు - హైదరాబాద్‌

‘భారత్‌లోని గ్రామీణ ప్రాంతాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఒకరి ద్వారా ఆరు నుంచి పన్నెండు మందికి సంక్రమించే పరిస్థితి ఉంది. భారత్‌ మినహా మిగిలిన దేశాల్లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. భారత్‌లో రానున్న రెండు నుంచి నాలుగు వారాలు చాలా కీలకం. భారీగా కేసులు పెరుగుదలకు అవకాశాలున్నాయి. అమెరికాలో ప్రజలు సోషల్‌ మీడియా భ్రమల నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి వ్యాక్సిన్లు తీసుకుంటున్నారు’ అని అమెరికాలోని అంటువ్యాధుల నిపుణుడు, ఎమోరి విశ్వవిద్యాయలం ప్రజారోగ్యం ఆచార్యుడు డాక్టర్‌ మనోజ్‌ జైన్‌ వివరించారు. బుధవారం అమెరికా నుంచి ఆయన ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఐసొలేషన్‌ వ్యవధి తగ్గించటం ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది?

ఐసొలేషన్‌ను ఏడు నుంచి పది రోజులు ఉంచితే బాగుండేది. అమెరికాలో కేసులు పెరుగుదల, డాక్టర్లకు కూడా వైరస్‌ సోకటం, వ్యాధి తీవ్రత లేకపోవటంతో వ్యవధిని అయిదు రోజులకు తగ్గించారు. కనీసం ఏడు రోజులు ఐసొలేషన్‌లో ఉండగలిగితే సంక్రమణను నియంత్రించవచ్చు. అయిదు రోజుల అనంతరం పరీక్ష చేసిన తరువాత తగ్గిందని నిర్ధారణైతే ఐసొలేషన్‌లో ఉండాలా? లేదా? అన్నది డాక్టర్ల సలహాను అనుసరిస్తే మంచిది.

కేసుల సంఖ్య తగ్గుతోంది కదా? వైరస్‌ ఎండమిక్‌గా మారుతున్నట్లా?

దక్షిణాఫ్రికా, యూకేలో కేసులు బాగా తగ్గాయి. అమెరికాలో తగ్గుముఖం పట్టాయి. భారత్‌లో వచ్చే రెండు నుంచి నాలుగు వారాలు చాలా కీలకం. రానున్న రోజుల్లో కేసులు అనూహ్యంగా పెరుగుతాయి. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో వైద్య సదుపాయాలు పూర్తి స్థాయిలో లేవు. ఒమిక్రాన్‌లో లక్షణాల తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ సంక్రమణ మాత్రం తీవ్ర స్థాయిలో ఉంటోంది. గ్రామాల్లో కేసులు పెరిగితే ఆందోళనకర పరిస్థితులు ఏర్పడతాయి. ప్రభుత్వం అప్రమత్తతతో గమనించాలి. రానున్న ఆరు నెలల్లో కరోనా మహమ్మారి ఎండమిక్‌గా మారుతుందన్న అంచనాలో ఉన్నాం.

కరోనా నుంచి రక్షణ ఎలా?

కొద్ది కాలం పాటు మాస్కును వాడటం మంచిది. వ్యాక్సిన్‌ తీసుకోవటం అత్యంత కీలకం. అవసరాన్ని బట్టి మోనోక్లోనల్‌ యాంటీబాడీలు, త్వరలో అందుబాటులోకి రానున్న యాంటీవైరల్‌ ఔషధాలు ఎంతగానో ఉపకరిస్తాయి. ఏ ఔషధాలను వాడాలన్నా వైద్యుల పర్యవేక్షణ అనివార్యం.

అమెరికన్లు వ్యాక్సిన్‌ను వ్యతిరేకించటానికి కారణం ఏమిటి?

అమెరికన్లను సోషల్‌ మీడియానే కొంప ముంచింది. వాటిలో వచ్చే వ్యాక్సిన్లపై వ్యతిరేక ప్రచారాన్ని వారు నమ్మారు. తప్పుదారి పట్టామన్న సత్యాన్ని ఇటీవలే గుర్తించి వ్యాక్సిన్లు వేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. రోగనిరోధోక శక్తి తక్కువగా ఉన్న వారు వ్యాక్సిన్‌ తీసుకున్న తరువాత వ్యాధి లక్షణాలు కనిపించినా ఆందోళన అవసరం లేదు.

ఒమిక్రాన్‌ సంక్రమణ తీరు ఎలా ఉంది?

ఇటీవల కాలంలో ఎప్పుడూ ఏ వైరస్‌ ద్వారా ఇంత తీవ్ర స్థాయిలో సంక్రమణను చూడలేదు. తొలుత వచ్చిన కొవిడ్‌-19 వేరియంట్‌తో ఒకరి ద్వారా రెండు నుంచి రెండున్నర మందిలో, డెల్టాతో అయిదుగురికి,  ఒమిక్రాన్‌తో ఆరు నుంచి 12 మందికి చేరుతోంది. మునుపటి రోజుల్లో తట్టు(మీజిల్స్‌) స్థాయిలో సంక్రమిస్తోంది. మొదటి రెండు వేరియంట్లలో మరణాల శాతం 1.6 శాతంగా ఉంది. తాజా దానిలో ఆ తీవ్రత ఎక్కడా కనిపించకపోవటం సంతోషకరం. డెల్టా వైరస్‌ను ఒమిక్రాన్‌ అణచివేస్తోంది. సంక్రమణ అధికంగా ఉన్నప్పటికీ తీవ్రత తగ్గటమే ఇందుకు ఉదాహరణ.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని