Published : 20 Jan 2022 05:06 IST

ఆటో/క్యాబ్‌ ఎంత సురక్షితం?

అంతంతగానే ‘మై వెహికిల్‌ ఈజ్‌ సేఫ్‌’ కార్యక్రమం
ప్రైవేటు రవాణా వాహనాలపై నిలిచిన నిఘా
ముందు జాగ్రత్త మేలనే అభిప్రాయాలు

మహిళలు క్యాబ్‌ లేదా ఆటో ఎక్కితే ఎలాంటి భయం లేకుండా సురక్షితంగా ఇల్లుచేరొచ్చు.. వాటిల్లోని క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్‌ చేస్తే డ్రైవర్‌, వాహనం సమగ్ర సమాచారం సెల్‌ఫోన్‌లో ప్రత్యక్షమవుతుంది.. ఏమాత్రం అనుమానమొచ్చినా ఎస్‌ఓఎస్‌ మీట నొక్కితే పోలీసులకు ఇట్టే సమాచారం చేరిపోతుంది.. క్షణాల్లో పోలీసు గస్తీ వాహనం వచ్చి వాలిపోతుంది..’

.. 2014లో సైబరాబాద్‌ పోలీసులు మహిళా ప్రయాణికులకు ఇచ్చిన అభయమిది.


ప్రయాణం చేస్తున్నప్పుడు అనుమానమొస్తే స్కాన్‌ చేసేందుకు క్యూఆర్‌ కోడ్‌ కానరాదు.. కనిపించినా దాని గడువు ముగిసిపోయి ఉంటోంది.. ఒకవేళ దాన్ని స్కాన్‌ చేస్తే వచ్చే డ్రైవర్‌ ఫొటోకు ఆ సమయంలో వాహనం నడిపే డ్రైవర్‌కు పోలికే ఉండదు....’

... ఇదీ ప్రస్తుతం ప్రైవేటు రవాణా వాహనాల్లోని భద్రత పరిస్థితి.


ఈనాడు, హైదరాబాద్‌: మాదాపూర్‌లోని మైండ్‌స్పేస్‌ కూడలి నుంచి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ‘అభయ’ను ఇద్దరు ఆగంతుకులు కారులో అపహరించుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టిన నేపథ్యంలో ఏడేళ్ల క్రితం ‘మై వెహికిల్‌ ఈజ్‌ సేఫ్‌/నా వాహనం సురక్షితం’ అనే బృహత్‌కార్యానికి తెర లేచింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో తిరిగే క్యాబ్‌లు, ఆటోలన్నింటికీ పోలీసు రిజిస్ట్రేషన్‌ నంబర్లను కేటాయించే ప్రణాళిక రూపుదిద్దుకొంది. అలా రిజిస్ట్రేషన్‌ చేసుకునే సమయంలో వాహనం ధ్రువపత్రాలతోపాటు వాహన యజమాని, డ్రైవర్‌ ఆధారాలన్నింటితో డేటా తయారు చేశారు. అనంతరం ప్రతి వాహనంలో క్యూఆర్‌ కోడ్‌తో కూడిన స్టిక్కర్లను అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల ఒంటరి మహిళా ప్రయాణికులతో అమర్యాదగా ప్రవర్తించేందుకు డ్రైవర్లు జంకేవారు. తమ వివరాలు పోలీసుల వద్ద ఉన్నాయనే భయం వారిలో కనిపించేది. ఏడాదికోసారి రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించేవారు. తద్వారా గ్రేటర్‌ పరిధిలో మహిళల ప్రయాణానికి పోలీసులు అభయమివ్వగలిగారు. ఆ సమయంలో క్యాబ్‌లకు పోలీసు రిజిస్ట్రేషన్లకు అయ్యే ఖర్చును సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌(ఎస్‌సీఎస్‌సీ) భరించింది. థింక్‌మాక్స్‌ కంపెనీ ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతోపాటు డేటాను నిక్షిప్తం చేసే ప్రక్రియకు సహకారం అందించింది. గ్రేటర్‌లో దాదాపు 1.1లక్షల ఆటోలకు, 80వేల క్యాబ్‌లకు పోలీసు రిజిస్ట్రేషన్‌ నంబర్లను కేటాయించగలిగారు. ట్రాఫిక్‌ పోలీసులు తరచూ ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టి కొరడా ఝుళిపించడంతో దాదాపు వాహనాలన్నింటికీ రిజిస్ట్రేషన్లు జరిగేవి. అలా క్రమేపీ నిజామాబాద్‌, నిర్మల్‌, సంగారెడ్డి, నల్గొండలకూ ఈ ప్రణాళిక విస్తరించింది.  

 


పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే..

2019 వరకు ఈ ప్రక్రియ సజావుగానే కొనసాగింది. కరోనా మహమ్మారి దెబ్బతో పరిస్థితి మారిపోయింది. ఆ తర్వాత పోలీసులు పట్టించుకోవడం మానేయడంతో కథ మొదటికొచ్చింది.

* ప్రస్తుతం చాలా వరకు వాహనాల్లో పోలీసు రిజిస్ట్రేషన్‌ స్టిక్కర్లే కనిపించడం లేదు. ఒకవేళ ఉన్నా 2020తో గడువు ముగిసి కనిపిస్తున్నాయి. మొత్తం వాహనాల్లో 85-90శాతం మంది డ్రైవర్లు ఆ ఊసే మరిచిపోయారు.

* ఓలా, ఉబర్‌ కార్యకలాపాలు ఊపందుకోవడంతోపాటు ఎస్‌సీఎస్‌సీ సంస్థ పక్కకు తప్పుకోవడంతో రిజిస్ట్రేషన్‌ భారం మొత్తం డ్రైవర్లపైనే పడింది. దీంతో పునరుద్ధరణ చేయించుకోవడం మానేశారు. పోలీసులూ ప్రత్యేక డ్రైవ్‌లు మరిచిపోవడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది.

* ప్రస్తుతం పోలీసుల రికార్డుల్లో ఉన్న వాహనాల వివరాలతో పోల్చితే చాలా వాహనాల యజమానులు, డ్రైవర్లు మారిపోయారు. కొత్త వారి వివరాలేవీ పోలీసుల డేటాలో లేకుండా పోయాయి. ఒకవేళ ఏదైనా వాహనంపై ఫిర్యాదొస్తే గతంలోలా తక్షణమే వివరాలు తెలిసే పరిస్థితి లేదు.

* విమానాశ్రయానికి రాకపోకలు సాగించే వాహనాల వివరాలూ అందుబాటులో లేకుండా పోయాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసే బదులు ముందు జాగ్రత్త పడటం మేలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని