
రూ.1400 కోట్లతో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్
తొలిసారిగా హైదరాబాద్‌లో ఏర్పాటు: మంత్రి జగదీశ్‌రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: దేశంలోనే మొట్టమొదటి గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్‌ను హైదరాబాద్‌లోని రాయదుర్గంలో రూ.1400 కోట్లతో నిర్మించామని, దీనిని త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ట్రాన్స్‌కో నిర్మించిన ఈ సబ్‌స్టేషన్‌కు మంత్రి బుధవారం వెళ్లి పరిశీలించారు. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఆయనకు సబ్‌స్టేషన్ పనుల వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇందుకనుగుణంగా రాబోయే 40 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నగరానికి విద్యుత్ వలయం ఏర్పాటు చేశాం. దీనితో ఒక్క క్షణం కూడా కరెంట్ పోదు. రింగ్‌రోడ్ చుట్టూ సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేశాం. రాయదుర్గంలో నాలుగు సబ్‌స్టేషన్లు ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి సాధారణంగా 100 ఎకరాల స్థలం అవసరం.. కానీ 5 ఎకరాల స్థలంలో అధునాతన పరిజ్ఞానంతో వాటిని నిర్మించాం. ఈ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్‌కు 3 కిలోమీటర్ల కేబుల్స్ భూగర్భంలో ఏర్పాటు చేశాం. దేశంలో మొదటి సారి మోనోపోల్స్ కూడా మనమే వాడుతున్నాం. ఈ సబ్‌స్టేషన్‌తో హైదరాబాద్‌కు మరో రెండు వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయవచ్చు’అని వివరించారు.
ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.