Published : 20 Jan 2022 05:06 IST

21న ఏపీ ఉద్యోగుల సమ్మె నోటీసు

సీఎస్‌కు అందజేయాలని ఉద్యోగ సంఘాల నిర్ణయం
పీఆర్సీ జీవోలపై ఆందోళనలు ఉద్ధృతం
ఉద్యమ కార్యాచరణపై ఐకాసల ఐక్యవేదిక సమావేశం నేడు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉద్యోగుల ఆందోళనలు మరింత ఉద్ధృతం అవుతున్నాయి. ఇప్పటికే నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్న ఉద్యోగులు చివరి అస్త్రంగా సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. నిబంధల ప్రకారం 14 రోజుల ముందు ఇవ్వాల్సిన సమ్మె నోటీసును... శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మకు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఏపీ ఐకాస, ఐకాస అమరావతి ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం నిర్వహించే సమావేశంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు. సమ్మెలో ఆర్టీసీ సంఘాలు పాల్గొనే అవకాశముంది. మరోవైపు ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) పిలుపు మేరకు ఉపాధ్యాయులు గురువారం జిల్లాల కలెక్టరేట్లను ముట్టడించనున్నారు. దీనికి ఐకాసలు మద్దతు ప్రకటించాయి. ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి(జాక్టో) డివిజన్‌ కేంద్రాల్లో ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీనికి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మద్దతు ప్రకటించింది. పీఆర్సీ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఈ నెల 21న సీఎస్‌కు సమ్మె నోటీసు ఇవ్వనున్నట్లు ఏపీ ఎన్‌జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడలో బుధవారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం కార్యవర్గ సభ్యులతో కలిసి పీఆర్సీ ఉత్తర్వుల ప్రతులను మంటల్లో దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పీఆర్సీ ఉత్తర్వులను రద్దు చేసే వరకు ప్రభుత్వంతో చర్చలకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు. ఉద్యోగి చనిపోతే ఇచ్చే మట్టి ఖర్చులనూ మిగుల్చుకోవాలని ప్రభుత్వం చూస్తోందని ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. ఇస్తున్న వేతనాలు తగ్గించి, గత ప్రభుత్వం ఇచ్చిన భత్యాల్లో కోత వేయడంతోనే సమ్మెకు వెళ్తున్నామని చెప్పారు. సీపీఎస్‌ రద్దు సహా ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. వేతనాలపై సీఎస్‌ దుర్మార్గంగా మాట్లాడుతున్నారన్నారు. జీతాలు తగ్గవని ప్రభుత్వం అనుకుంటే పాత జీతాలే ఇవ్వొచ్చు కదా...! అన్నారు. ప్రభుత్వ ఆదాయం తగ్గిందని ఒకవైపు సీఎస్‌ చెబుతుండగా... మరోవైపు నవంబరు నెలాఖరుకు గత ఐదేళ్లల్లో కంటే ఎక్కువ రాబడి వచ్చినట్లు కాగ్‌ చెప్పినట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. ఇది సమాజాన్ని తప్పుదారి పట్టించడమేనన్నారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని