Updated : 20 Jan 2022 07:00 IST

మేడారం భక్తకోటికి సకల సౌకర్యాలు

ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మహాజాతర
రూ. 75 కోట్లతో అభివృద్ధి పనులు
గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్‌ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు రంగం సిద్ధమవుతోంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగే ఈ జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని రాష్ట్ర గిరిజన, మహిళా సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. జాతర జరిగే నాలుగు రోజుల్లో కోటిన్నర మందికి పైగా భక్తులొస్తారని ఆమె అన్నారు. అతిపెద్దదైన ఈ జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులివ్వకపోవడం బాధాకరమన్నారు. జాతర ఏర్పాట్లను ఆమె ‘ఈనాడు’కు వివరించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

* మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. సీఎం కేసీఆర్‌ ఈ ఏడాది ఉత్సవాలకు రూ. 75 కోట్లు మంజూరు చేశారు. ఈ నెలాఖరుకు పనులన్నీ పూర్తి చేస్తాం. ఈ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలంటూ సీఎం కేసీఆర్‌, మంత్రులు ఎన్నోసార్లు కేంద్రాన్ని కోరినా స్పందన లేదు. ఈసారి జాతరకు రావాలని కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తాం. సీఎం కేసీఆర్‌ వచ్చే నెల 18న జాతరకు వచ్చే అవకాశం ఉంది. రామప్పకు యునెస్కో గుర్తింపు వల్ల ఈసారి దేశ, విదేశీ భక్తుల తాకిడి పెరుగుతుందని భావిస్తున్నాం.

* భక్తులకు అరగంటలోనే దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రముఖుల పాస్‌లకూ నిర్ణీత సమయం (టైమింగ్‌ స్లాట్‌) ఇస్తాం. ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రధాన రహదారులతో పాటు ఎడ్లబండ్ల బాటలను సైతం తీర్చిదిద్దుతున్నాం. దాదాపు 8 వేల ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడికక్కడే మంచినీటి సరఫరా ఉంటుంది. వైద్యశిబిరాలూ నిర్వహిస్తాం.

* పెద్ద ఎత్తున స్నానఘట్టాలు నిర్మించాం. జంపన్నవాగు పొడవునా కొత్తవి ఏర్పాటు చేస్తున్నాం. షెడ్లతో పాటు మహిళలకు దుస్తులు మార్చుకునే గదులు, మరుగుదొడ్లు ఉంటాయి. భోజనాల కోసం కమ్యూనిటీ డైనింగ్‌ హాలును నిర్మిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న అతిథిగృహాలకు తోడు, మరో భారీ అతిథిగృహాన్ని నిర్మిస్తున్నాం.

* జాతరకు శాశ్వత సదుపాయాల కల్పనకు మరో 200 ఎకరాలు తీసుకోవాలని సీఎం చెప్పారు. దీని కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. జాతర సందర్భంగా భూయజమానులు ఎవరూ నష్టపోరాదని, 1100 మంది రైతులకు నేరుగా ఎకరానికి రూ. 6 వేల చొప్పున సొమ్ము ఇస్తున్నాం.

* భక్తులు కరోనా నిబంధనలను విధిగా పాటించాలి. తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ప్రభుత్వం సైతం మాస్కులు పంపిణీ చేస్తుంది.

మేడారం జాతర తేదీలు ఇవే...

ఫిబ్రవరి 16 - సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలకు తీసుకొస్తారు.
17వ తేదీ - చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెల వద్దకు తీసుకొస్తారు.
18 - సమ్మక్క-సారలమ్మలకు ప్రజలకు మొక్కులు.
19 - అమ్మవార్ల వన ప్రవేశం, జాతర ముగింపు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని