Updated : 23 Jan 2022 22:58 IST

Jagitial: మాటు వేసిన మూఢ నమ్మకం

అందరూ చూస్తుండగానే మంత్రాల నెపంతో ముగ్గురి హత్య

మృతుల్లో తండ్రి, ఇద్దరు కుమారులు

జగిత్యాల పట్టణంలో దారుణం

మరో ఘటనలో జనగామ జిల్లాలో ముగ్గురిపై దాడి

మృతదేహాలను తరలిస్తుండగా విలపిస్తున్న నాగేశ్వర్‌రావు కుమార్తె, రాంబాబు పిల్లలు

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌, న్యూస్‌టుడే- జగిత్యాల: ఆధునిక కాలంలో కూడా మంత్రాలు, మూఢ నమ్మకాలు రాజ్యమేలుతూనే ఉన్నాయి.. క్రోధాన్ని రగిలిస్తున్నాయి.. మనుషుల్ని బలిగొంటున్నాయి. మంత్రాలు చేశారనే మూఢనమ్మకం తాజాగా ముగ్గుర్ని బలితీసుకుంది. పట్టపగలు.. చుట్టూ పదుల సంఖ్యలో జనం చూస్తుండగానే జిల్లా కేంద్రం జగిత్యాలలో గురువారం మధ్యాహ్నం ఓ తండ్రిని, ఆయన ఇద్దరు కుమారుల్ని కత్తులు, బరిసెలతో అతి కిరాతకంగా పొడిచి చంపారు. జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ మండలం తీగారంలోని కాషాగూడెంలో బుధవారం రాత్రి ఇలాంటిదే మరో ఘటన జరిగింది. మంత్రాల నెపంతో ముగ్గురిపై దాడి చేశారు. జగిత్యాలలో జరిగిన దారుణ హత్యాకాండపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జగన్నాథం నాగేశ్వర్‌రావు(60) ఎరుకలవాడలో ఉంటారు. కుమారుల కుటుంబాలు కూడా సమీపంలోనే ఉంటాయి. ఆరు నెలలకోసారి స్థానికంగా కులసంఘం సమావేశం ఉండటంతో గురువారం ఆయనతోపాటు పెద్దకొడుకు రాంబాబు(35), రెండో కుమారుడు రమేశ్‌(25), మూడో కుమారుడు రాజేశ్‌ వెళ్లారు. అక్కడే మహిళలు వేరేగా సమావేశం నిర్వహించుకుంటున్నారు. నాగేశ్వర్‌రావు, ఆయన కుమారుల కుటుంబాలకు చెందిన మహిళలు కూడా దానికి హాజరయ్యారు. అప్పటికే కుల సంఘం సమావేశంలో కాచుకు కూర్చున్న వైరి వర్గం.. వారి కళ్లెదుటే నాగేశ్వర్‌రావు.. ఆయన ముగ్గురు కుమారులపై కత్తులతో దాడికి తెగబడింది. ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకునేలోపే ఇద్దరు రక్తపు మడుగులో అచేతనంగా పడిపోగా మరొకరు తీవ్రగాయాలతో విలవిల్లాడిపోతూ కనిపించడం చూసి గుండెలవిసేలా రోదించారు. నాగేశ్వర్‌రావు, రాంబాబులను ఛాతి, గొంతు భాగంలో బలంగా పొడవడంతో అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. తీవ్రంగా గాయపడిన రమేశ్‌ను జగిత్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. రాజేశ్‌ దాడి నుంచి తప్పించుకుని పరుగెత్తడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఆరుగురికిపైగా వ్యక్తులు ఈ దారుణంలో భాగమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు. బాధిత కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పక్కాగా ప్రణాళిక

పక్కా ప్రణాళిక ప్రకారమే హంతకులు ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు విశ్వసిస్తున్నారు. అందులో భాగంగానే వారు సంఘ సమావేశానికి హాజరై అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న ఆయుధాలతో తెగబడ్డారని భావిస్తున్నారు. నాగేశ్వర్‌రావు కుటుంబంతో కొన్నాళ్లుగా వైరం ఉన్న వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని, ముఖ్యంగా మంత్రాల నెపంతోనే ఈ ఘోరానికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎరుకల వాడలో కుల పెద్దగా ఉంటున్న నాగేశ్వర్‌రావు సహా ఆయన  కుటుంబీకులు మంత్రాలు చేస్తున్నారని కొంతమందిలో అనుమానాలున్నాయి. నెలరోజుల కిందట సిరిసిల్ల జిల్లా ఆగ్రహారం సమీపంలోని ఓ శ్మశాన వాటిక వద్ద ఈ కారణంగానే నాగేశ్వర్‌రావుపై దాడి జరిగింది. కేసు కూడా నమోదైంది. వారం రోజుల కిందట ఎరుకల వాడలో ఓ మహిళ మృతి చెందింది. ఆమె మృతికి వీరు చేస్తున్న మంత్రాలే కారణమని భావించిన వైరివర్గాలు ఈ హత్యకు పూనుకుని ఉంటారేమోనని పోలీసులు సందేహిస్తున్నారు. నాగేశ్వర్‌రావు భూముల క్రయవిక్రయాలు, వడ్డీ వ్యాపారం చేస్తారు. ఆయనకు ఇద్దరు భార్యలు- సుఖమ్మ, కనుకమ్మ. రాంబాబుకు భార్య సారమ్మ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, రమేశ్‌కు భార్య సౌజన్య ఉన్నారు. మృతిచెందిన అన్నదమ్ములిద్దరు సెప్టిక్‌ ట్యాంకును నడిపిస్తూ జీవనాన్ని సాగిస్తుండేవారు.


కాషాగూడెంలో ఇలా..

జఫర్‌గఢ్‌, న్యూస్‌టుడే: జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ మండలం తీగారంలోని కాషాగూడెంకు చెందిన యాకుబ్‌ కోడలు 3 నెలల కిందట ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 15 రోజుల నుంచి ఆమె కడుపులో మంట, నొప్పితో అవస్థ పడుతుండడంతో పలు ఆసుపత్రులకు తీసుకెళ్లినా నయం కాలేదు. మంత్రాలు చేయడం వల్లనే కడుపులో మంటలు వస్తున్నాయని బంధువులు చెప్పడంతో యాకుబ్‌ తన ఇంటి పక్కన ఉండే గోరిమియాపై అనుమానం పెంచుకున్నారు. బుధవారం రాత్రి తన బంధువులను కాషాగూడెంకు రప్పించారు. వీరంతా కర్రలతో గోరిమియాపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. అడ్డువచ్చిన ఆయన కుమారులు అలీమ్‌, నజీర్‌ను కొట్టారు. పోలీసులు బాధితులను వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదుతో దాడిచేసిన వారిపై కేసులు నమోదు చేశామని జఫర్‌గఢ్‌ ఇన్‌ఛార్జి ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.


Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని